రాజధానిపై వైసీపీ సేమ్ స్టాండ్
విజయవాడ, ఆగస్టు 22, (న్యూస్ పల్స్)
YCP same stand on Rajdhani
ఎన్నికల్లో ఓటమి ఎదురైనా వైసీపీ తీరులో మార్పు రావడం లేదు. ఈ ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధిస్తామని వైసిపి ధీమా వ్యక్తం చేసింది. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేశామని.. ప్రజలు ఆశీర్వదిస్తారని భావించింది. కానీ వైసీపీ ఒకటి తలిస్తే.. ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు. దారుణ ఓటమిని అంటగట్టారు. అటు మూడు రాజధానులు అంటూ హడావిడి చేసిన ఆ ప్రాంతీయులు సైతం ఆదరించలేదు. పాలనా రాజధానిగా విశాఖను ప్రకటించినా అక్కడి ప్రజలు ఆహ్వానించలేదు. అయినా సరే వైసిపి తీరు మారడం లేదు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా అదే పల్లవి వీడడం లేదు. తాజాగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈరోజు ఆయన శాసనమండలిలో పదవి ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మూడు రాజధానుల అంశంపై మరోసారి మాట్లాడారు. ఇప్పటికీ వైసీపీ స్టాండ్ అదేనని చెప్పారు. అందులో మార్పు వస్తే తామే ప్రకటిస్తామని తేల్చేశారు.కూటమి ప్రభుత్వానికి కేవలం 75 రోజులు మాత్రమే అయ్యిందని.. కొంత సమయం ఇచ్చి మాట్లాడుతామని బొత్స తేల్చి చెప్పారు. అంతవరకు సమయం కావాలని అడిగారు. అయితే మూడు రాజధానుల విషయంలో ప్రజా తీర్పు స్పష్టంగా కనిపించినా.. వైసిపి తీరు మారకపోవడం విమర్శలకు తావిస్తోంది. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ లో తొలిసారిగా అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం. నాడు అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ప్రకటించింది.
సాక్షాత్ నాటి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి శంకుస్థాపన చేశారు. కీలక నిర్మాణాల పనులను సైతం ప్రారంభించారు. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అమరావతి రాజధానిని మార్పు చేసింది. ఆ స్థానంలో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా విశాఖను పాలనా రాజధానిగా చేసింది. అయితే విశాఖ తో పాటు ఉత్తరాంధ్ర ప్రజలు దీనిని ఆహ్వానించలేదు. అలా జరిగితే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి ఎందుకు ఎదురయింది. ఈ ఎన్నికల్లో అయితే ఉత్తరాంధ్రలో వైసిపి తుడుచుపెట్టుకుపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతి రాజధానిపై దూకుడుగా ముందుకు సాగుతోంది. అటు కేంద్ర ప్రభుత్వం సైతం సహకరించేందుకు ముందుకు వస్తోంది. కీలకమైన ప్రాజెక్టులను అమరావతికి కేటాయిస్తోంది.
రోడ్డు, రైలు రవాణాలో కీలక ప్రాజెక్టులను మంజూరు చేసింది. అదే సమయంలో కేంద్ర బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఇలా అమరావతి విషయంలో కీలక అడుగులు పడుతున్నాయి. అయినా సరే వైసీపీ ఇంకా మూడు రాజధానుల స్టాండ్ తోనే కొనసాగుతుండడం విశేషం.ఐదేళ్లలో అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి కావడం ఖాయం. అమరావతిని తప్పించి రాజధానిని మార్చడం కూడా అసాధ్యం. గత అనుభవాల దృష్ట్యా దానిని ఒక చట్టంలా మార్చేస్తారు. ఈ విషయంలోచంద్రబాబు తప్పకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. ఇప్పటికే మూడు రాజధానుల విషయాన్ని ప్రజలు తప్పు పట్టారు. వ్యతిరేకంగా ప్రజా తీర్పు ఇచ్చారు. అయినా సరే వైసీపీ వైఖరిలో మార్పు రావడం లేదు. మున్ముందు ఇది వైసీపీకి ఇబ్బందులు తెచ్చే విషయమే. అందుకే రాజధానుల విషయంలో సరైన స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం వైసీపీకి ఉంది.