టీడీపీ గూటికి వైసీపీ ఎమ్మెల్యేలు
గుంటూరు, జూలై 5, (న్యూస్ పల్స్)
YCP MLAs to TDP faction
వైసీపీ ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పార్టీని వీడుతారా? టిడిపిలో చేరతారా? అనర్హత వేటు పడకుండా మండలిలోని వైసీపీ పక్షాన్ని టిడిపిలో విలీనం చేస్తారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైసిపికి ఘోర పరాజయం ఎదురు కావడంతో.. పార్టీ మారడం మేలన్న నిర్ణయానికి మెజారిటీ ఎమ్మెల్సీలు వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపైనే అధినేత జగన్ ఆందోళనతో ఉన్నట్లు సమాచారం.పార్టీ నేతలతో సమీక్షలో జగన్ సైతం ఇదే ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీల కదలికలు, ఎవరెవరు వెళ్లే అవకాశం ఉంది అన్నదానిపై చర్చించినట్లు సమాచారం.
మండలిలో 57 మంది ఎమ్మెల్సీలకు గాను.. దాదాపు 38 మంది వరకు వైసిపి సభ్యులు ఉన్నారు. జగన్ ఓడిపోయినా మండలిలో బలం చూసుకుని సత్తా చాటాలని చూశారు. అధికారపక్షం దూకుడుకుచెక్ చెప్పాలని భావించారు. కూటమి ప్రభుత్వానికి ఇరుకున పెట్టాలని చూశారు. అమరావతి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు వంటి కీలక బిల్లులను కూటమి సర్కార్ తీసుకురానుంది. వీటికి శాసనమండలిలో వైసిపి అడ్డు తగలడం ఖాయం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బిల్లులను వ్యతిరేకిస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని వైసీపీ ఎమ్మెల్సీలు భయపడుతున్నారు. మరోవైపు పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలామంది సీనియర్లు ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. అందుకే ఎమ్మెల్సీలు సైతం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అయితే చాలామంది ఎమ్మెల్సీలు గడప దాటేందుకు సిద్ధపడినట్లు సమాచారం.ఇది వైసీపీ శ్రేణుల్లో కలవరపాటుకు గురి చేసే అంశం.ఇప్పటికే ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన చాలామంది ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. మండలి చైర్మన్ మోషేన్ రాజు వైసీపీకి చెందిన నేత. ఆయన ద్వారా తతంగాన్ని నడిపించారు.
జగన్ నమ్మకం కూడా అదే. మండలి చైర్మన్ ద్వారా వైసిపి బలాన్ని నిరూపించుకోవాలని చూశారు. కానీ మెజారిటీ ఎమ్మెల్సీలు అలా భావించడం లేదు. అవసరమైతే ఒకేసారిగా టిడిపిలోకి ఫిరాయించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అనర్హత వేటు పడకుండా మండలిలో వైసీపీని టిడిపిలో విలీనం చేసేందుకు కూడా కొంతమంది యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్సీలు టిడిపి నేతలకు టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
కీలక బిల్లులకు మోక్షం కలగాలంటే ఇప్పుడు మండలిలో ఆమోదం అవసరం. అందుకే టిడిపి సైతం మండలి విషయంలో సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే జగన్ సైతం ఆందోళన పడుతున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లి కి వచ్చిన జగన్ క్యాంపు కార్యాలయంలో పార్టీ సీనియర్లతో సమావేశమయ్యారు. వైసీపీ ఎమ్మెల్సీలు చాలామంది పార్టీ మారే అవకాశం ఉందని అధినేత అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు జగన్ చెప్పినట్లు తెలుస్తోంది.
To bring social groups closer together… YCP TDP | సామాజిక వర్గాలను దగ్గరయ్యేందుకు… | Eeroju news