కుప్పంలో వైసీపీ ఖాళీ
తిరుపతి, ఆగస్టు 1 (న్యూస్ పల్స్)
YCP is empty in the kuppam
ఓటమి తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. కీలక నియోజకవర్గాల్లో ఇంచార్జులు పత్తా లేకండా పోవడంతో ద్వితీయ శ్రేణి నేతలు ఇబ్బంది పడుతున్నారు. కుప్పంలో ఐదేళ్ల పాటు హవా చెలాయించి గత ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన భరత్ పార్టీని పట్టించుకోవడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి ఆయన కుప్పం రాలేదు. జగన్ తో పాటు ఢిల్లీ ధర్నాకు వెళ్లారు కానీ.. కుప్పంకు మాత్రం రావడం లేదు. హైదరాబాద్లోనే గడుపుతున్నారు. వైసీపీ హయాంలో కుప్పంలో జరిగిన అనేక అరాచకాలకు భరతే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబుపై రాళ్ల దాడితో పాటు టీడీపీ కార్యకర్తలపై దాడులు సహా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి.
ఈ కారణం టీడీపీ విజయం సాధించిన వెంటనే భరత్ కుప్పం నుంచి వెళ్లిపోయారు. ఆయన అండగా ఉంటారని భావించిన క్యాడర్ .. ఆయన కనిపించకపోవడంతో చాలా మంది ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చంద్రబాబుపై బాంబులేస్తామని.. లేపేస్తామని బెదిరించిన కొంత మంది నేతలు కుప్పంలో కనిపించి చాలా కాలం అయింది. ఇలా ముఖ్యనేతలంతా కుప్పం బయట ఆజ్ఞాతంలో ఉండటంతో.. పార్టీని పట్టించుకునేవారు లేకుండా పోయారు. తాజాగా కుప్పం నియోజకవర్గ స్థాయి కార్యాలయాన్ని వేరే హోటల్కు అద్దెకు ఇచ్చేశారు. ఇప్పుడు వైసీపీ కార్యాలయంలో చిన్న హోటల్ నడుపుతున్నారు.
ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇతర పార్టీల నేతల్ని చేర్చుకునే విషయంలో టీడీపీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూండటంతో అందర్నీ చేర్చుకోవడం లేదు. తాజాగా చంద్రబాబు సమక్షంలో ఐదుగురు కుప్పం కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మరికొంత మంది ఎంపీటీసీలు చేరారు. టీడీపీలో చేరేందుకు కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కూడా సిద్ధమయ్యారు. కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుు టీడీపీ నేతలపై దాడులకు పాల్పడ్డారని ఆయనను చేర్చుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆయన ఆస్పత్రిపైనే కుప్పం టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.
దాంతో చేరికల కార్యక్రమం ఆగిపోయింది. కుప్పం లో చంద్రబాబు తరుపున ఎమ్మెల్సీ శ్రీకాంత్ పార్టీ వ్యవహారాలు చక్క బెడుతున్నారు. వచ్చే కొద్ది రోజుల్లో వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతుందని ఆయన చెబుతున్నారు. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.250 కోట్లు కేటాయించారన్నారు. హంద్రీనీవా కాలు ద్వారా వచ్చే నీటిని నిలువ చేయడానికి రూ.500 కోట్లతో రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. కుప్పంలో 2000 ఎకరాలతో సెజ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన 40 రోజుల్లోనే కుప్పం అభివృద్ధికి చంద్రబాబు నిధులు కేటాయిస్తున్నారన్నారు. ఎవరైతే తటస్తులుగా ఉండి కుప్పం అభివృద్ధిని కోరుకుంటున్నారో వారందరినీ టీడీపీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు.