Where leaders there is gap chip | ఎక్కడి నేతలు… అక్కడే గప్ చిప్… | Eeroju news

YCP

ఎక్కడి నేతలు… అక్కడే గప్ చిప్…

గుంటూరు, జూలై 10, (న్యూస్ పల్స్)

Where leaders there is gap chip

అధికారంలో ఉండగా వీరావేశం ప్రదర్శించారు. తోటి నాయకుల పై తోడ కొట్టారు. తమకు ఎదురు లేదని ఎవరు పోటీ రారని బీరాలు పలికారు. నాయకుల మెప్పుకోసం మీసాలు మెలేశారు. ప్రజెంట్ అధికారం పోయింది. ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారో అడ్రస్ లేరు. అది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 10 సంఖ్యలో లీడర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. కేసుల భయంతో ఇతర ప్రాంతాలకు వెలుతున్న నేతలు కోర్టుల ద్వారా ఉపశమనం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వైసీపీలో గందరగోళం నెలకొంది.

ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, యువజన విభాగం కోఆర్డినేటర్ పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య ఇలా చెప్పుకుంటే పోతే ఎంతోమంది నేతలు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వైసీపీ నేతలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పదిహేడు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ఓడిపోయారు. మొట్టమొదటి సారి కూటమి అభ్యర్ధులు క్లీన్ స్వీప్ చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు ధైర్యం చెప్పి ముందుండి నడిపించాల్సిన నేతలు తలోదిక్కుకు వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు లేకపోతే కనీసం ఎమ్మెల్సీలైనా అండగా ఉంటారనుకుంటే వారు కూడా అందుబాటులో లేకపోవడం కార్యకర్తలను మరింత కృంగదీసింది.

కేసుల భయంతోనే ముఖ్య నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడంతోనే ఇతర నేతల్లో ఆందోళన మొదలైంది. పిన్నెల్లి అరెస్టు రిమాండ్‌లో ఉన్నా ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఎక్కడున్నది ఇంతవరకూ తెలియదు. పిన్నెల్లి బ్రదర్స్ తో పాటు వారి ప్రధాన అనుచరుడు మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ తురకా కిషోర్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కిషోర్ పై అనేక కేసులున్నాయి. పంచాయతీ ఎన్నికల సమయంలో టీడీపీ నేతల కారుపై దాడి చేసిన నిందితుల్లో కిషోర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ప్రభుత్వం మారడంతోనే ఆ కేసుల్లో అరెస్ట్ చేస్తారన్న భయంతో వెంకట్రామిరెడ్డి, కిషోర్ ఇద్దరూ కూడా విదేశాలకు వెళ్లిపోయారని అనుకుంటున్నారు.

ఇక కేంద్ర టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసు గుంటూరు నేతల్ని వెంటాడుతోంది. దాడుల్లో పాల్గొన్నారని పలువురి కేసు నమోదు చేయడమే కాకుండా ప్రభుత్వం సిట్ కూడా వేసింది. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అప్పి రెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. దాడిలో పాల్గొన్న విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య కూడా ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి చైతన్య గుంటూరులో కనిపించడం లేదు. వీరితో పాటు పలువురు కార్పోరేటర్లు, కార్పోరేటర్ల భర్తలు కూడా గుంటూరు వదిలి వెళ్లిపోయారు.

కార్పోరేటర్ రోషన్, గురవయ్యలతో పాటు కార్పోరేటర్లు రమేష్, రాజేష్ లు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పటికే కార్పొరేటర్ అంచాల వెంకటరెడ్డి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వైసీపీ నేతలతో పాటు కార్యకర్తల్తోనూ కేసులు భయం వెంటాడుతోంది. అయితే ముఖ్య నేతలు అజ్ఞాతంలోకి వెళ్లడంపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. న్యాయ పోరాటం చేయకుండా ఎన్నాళ్లు దాక్కుంటారని ప్రశ్నిస్తున్నారు.

YCP

 

Target YCP senior leaders | టార్గెట్… వైసీపీ సీనియర్ నేతలు | Eeroju news

Related posts

Leave a Comment