What is Mallareddy’s master plan? | మల్లారెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటీ | Eeroju news

Mallareddy

మల్లారెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటీ

హైదరాబాద్, జూలై 12 (న్యూస్ పల్స్)

What is Mallareddy’s master plan?

తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే నేత మాజీ మంత్రి మల్లారెడ్డి. మాస్ మల్లన్నగా అందరూ ముద్దుగా పిలుచుకునే మల్లారెడ్డి తన రాజకీయ జీవితాన్ని కీలక మలుపు తిప్పాలని నిర్ణయించుకున్నారట. స్వతహాగా వ్యాపారవేత్త అయిన మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేతగా బాగా ఫేమస్ అయ్యారు. ఇక 2014లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తన క్రేజ్ ను మరింత పెంచుకున్నారు. మల్లారెడ్డి అంటేనే ఓ బ్రాండ్‌గా అందరికీ గుర్తిండిపోయారు. 2014లో తొలిసారిగా మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి… ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరి… రాష్ట్రమంత్రి కూడా అయిపోయారు.ఇక గత ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినా, బీఆర్ఎస్ ఓడిపోవడంతో మల్లారెడ్డికి కష్టాలు ఎక్కువయ్యాయి.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మల్లారెడ్డి అప్పట్లో విసిరిన చాలెంజ్ లతో ప్రత్యర్థుల సంఖ్యను పెంచుకున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో వ్యక్తిగతంగా కూడా మల్లారెడ్డికి పొసగకపోవడంతో ఇప్పుడు రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వానికి టార్గెట్‌గా మారడంతో అండ కోసం ఎదురుచూసిన మల్లారెడ్డి బీజేపీలో చేరాలని… ఆ పార్టీతో టచ్ లోకి వెళ్లారని ప్రచారం జరిగింది. కానీ, మల్లారెడ్డికి బీజేపీలో చేర్చుకునే విషయంలో సానుకూల స్పందన లేకపోవడంతో మరింత ఇబ్బందులు పెరిగిపోయాయట. ఐతే ఈసారి మల్లారెడ్డి వేసిన ప్లాన్‌తో మొత్తం తెలంగాణ రాజకీయం రక్తి కట్టేలా కన్పిస్తోందప్రస్తుతం మల్లారెడ్డితోపాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఈ ఇద్దరూ తొలుత కాంగ్రెస్‌లోకి వెళ్లాలని భావించారు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోనే విభేదాలు ఉండటంతో ఆ పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మల్లారెడ్డి విద్యాసంస్థల్లో ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం పూనుకోవడం, వరుసగా కేసులు నమోదు చేయిస్తుండటం, తన నియోజకవర్గంలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కాంగ్రెస్ లో చేర్చుకుంటూ తనను ఒంటరిని చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుండటం వల్ల… హస్తం పార్టీతో చేతులు కలపాలనే ఆలోచనను విరమించుకున్నారు మల్లారెడ్డి. ఆ తర్వాత కమలం గూటికి చేరేందుకు ప్రయత్నించారు.

కావాలంటే రాజీనామా చేసైనా బీజేపీ తరఫున పోటీ చేసి గెలుస్తానంటూ ఆఫర్ కూడా ఇచ్చారట. అయితే కారణమేదైనా బీజేపీ నుంచి కూడా రెడ్ సిగ్నలే పడింది. ప్లాన్ A కింద కాంగ్రెస్, ప్లాన్ Bగా బీజేపీని ఎంచుకున్న మల్లారెడ్డి.. ఆ రెండు పార్టీల నుంచి ప్రతికూల స్పందనే ఎదురవడంతో ఈ సారి గమ్మత్తైన ప్లాన్ వేశారు. అదే తన పొలిటికల్ కెరీర్‌ను ప్రారంభించిన టీడీపీలో చేరడం ద్వారా తన రాకను అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఒకేసారి చెక్ చెప్పాలని భావిస్తున్నారు మల్లారెడ్డి.తెలంగాణలో టీడీపీకి పెద్దగా బలం లేకపోయినా, తనకు ప్రభుత్వం నుంచి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే టీడీపీలో చేరడం కూడా మంచిదే అన్న ఆలోచనలో పడ్డారు మల్లారెడ్డి.

ప్రస్తుతం తెలంగాణ టీడీపీకి పెద్ద దిక్కు లేకపోవడం కూడా తనకు కలిసివస్తుందని భావిస్తున్నారు. తనతోపాటు ఒకరిద్దరు ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకువెళ్లి.. ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా చక్రం తిప్పాలని భావిస్తున్నారట మల్లన్న. ప్రస్తుతం బీజేపీ-టీడీపీ మధ్య పొత్తు ఉండటం, కేంద్రంలో టీడీపీ కీలకంగా మారడంతో తాను టీడీపీలో ఉంటే తనకు ఇండైరెక్ట్‌గా బీజేపీ మద్దతు ఉంటుందని భావిస్తున్నారు మల్లన్న. అదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య సత్సంబంధాలు ఉండటంతో… తెలంగాణ ప్రభుత్వం తన వైపు చూసే అవకాశమే ఉండదని ప్లాన్ చేస్తున్నారట మల్లన్న…తెలంగాణలోనూ తన అస్థిత్వాన్ని కాపాడుకోవాలని చూస్తున్న టీడీపీ… మల్లారెడ్డి వంటివారు చేరతామంటే కాదనడనే ధీమాలో మల్లన ఉన్నారని తెలుస్తోంది.

దీంతో తన మదిలోని ఆలోచనను సన్నిహితులతో పంచుకున్నారట.. ఇక టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తన ప్రతిపాదనను తీసుకెళ్లేందుకు అడుగులు వేస్తున్నారని సమాచారం. టీడీపీలో చేరితే ప్రస్తుతానికి తనకు ఉన్న ముప్పు నుంచి తప్పించుకోవచ్చని.. నాలుగున్నరేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లోనూ బీజేపీతో అలయెన్స్‌తో రాజకీయంగా చక్రం తిప్పవచ్చనే అంచనాలో ఉన్నారట మల్లన్న.టీడీపీ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మల్లారెడ్డి.. మళ్లీ టీడీపీ గూటికే వెళతారనే ప్రచారం తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది.

వాస్తవానికి సీఎం రేవంత్‌రెడ్డికి, మల్లారెడ్డికి టీడీపీలో ఉన్నప్పుడే విభేదాలు మొదలయ్యాయి. అప్పటి విబేధాలను ఇప్పుడు పరిష్కరించుకునేందుకు అదే టీడీపీని వాడుకోవాలని మల్లారెడ్డి చూడటం ఆసక్తికరంగా మారింది. ఇక బీజేపీ కూడా టీడీపీ మిత్రపక్షం కావడం వల్ల భవిష్యత్‌లో ఎలాంటి రాజకీయ మార్పులు జరిగినా తాను సేఫ్ జోన్‌లో ఉంటారనే ఆలోచనతోనే టీడీపీయే బెస్ట్ చాయిస్‌గా ఎంచుకోవాలని మల్లారెడ్డి ఆలోచిస్తున్నారని అంటున్నారు. మొత్తానికి మాస్ మల్లన్న పొలిటికల్ యాక్షన్‌పై తెలంగాణలో హాట్ డిబేట్‌ జరుగుతోంది.

Mallareddy

 

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ | Big shock for former minister, Medchal MLA Mallareddy | Eeroju news

 

Related posts

Leave a Comment