What is KCR’s strategy? | కేసీఆర్ వ్యూహం ఏమిటో | Eeroju news

What is KCR's strategy?

కేసీఆర్ వ్యూహం ఏమిటో

హైదరాబాద్, ఆగస్టు 8, (న్యూస్ పల్స్)

What is KCR’s strategy?

తెలంగాణ రాజకీయాల్లో మాజీ సీఎం కేసీఆర్‌ పాత్ర చాలా కీలకం… పదేళ్ల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌… గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కేవలం పార్టీ కార్యక్రమాలకు… తన ఫాం హౌస్‌కు మాత్రమే పరిమితమయ్యారనే వాదన ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాలకు అస్సలు హాజరుకావడం లేదు. ప్రస్తుత సభ కొలువుదీరిన తర్వాత ఈ 8 నెలల కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే శాసనసభలో అడుగుపెట్టారు కేసీఆర్‌. అందులోనూ ఒకసారి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడానికి అసెంబ్లీకి రాగా, గత వారం జరిగిన బడ్జెట్‌ సమావేశాలకు మరోసారి వచ్చారు కేసీఆర్‌.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రతిపక్ష నేత కేసీఆర్‌ సభకు రాకపోవడంపై పొలిటికల్‌ సర్కిల్స్‌లో రకరకాల ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు, కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు పదేపదే కేసీఆర్‌ను సభకు రప్పించాలని కవ్వించేలా విమర్శలు చేస్తున్నా.. ఆయన మాత్రం చలించలేదు. మరోవైపు కేసీఆర్‌ సభకు రావాల్సిన పని లేదని, ఆయన బదులుగా తాము సరిపోతామని మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు చెప్పుకుంటూ వస్తున్నారు. ఐతే తాను అసెంబ్లీలో అడుగుపెట్టకపోవడానికి కారణమేంటనేది ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు కేసీఆర్‌. ఇక తాజాగా ఆయనను కలిసిన బీఆర్‌ఎస్‌ సభ్యుల వద్ద తాను అసెంబ్లీకి హాజరుకాకపోవడానికి అసలు కారణమేంటన్నది చెప్పారట.

తాను పూర్తిగా అసెంబ్లీని బహిష్కరించలేదని… త్వరలోనే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతానని తనను కలిసిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు వివరించారట మాజీ సీఎం కేసీఆర్‌….పదేళ్లు సీఎంగా పనిచేసిన తనను అవమానించేలా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్న కేసీఆర్‌…. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు తీరును బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల వద్ద ప్రస్తావించారని అంటున్నారు. అధికారంలోకి రాడానికి ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్‌… చేతులెత్తేస్తోందని… ఆ విషయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు తనను టార్గెట్‌గా విమర్శలు చేస్తుందని వివరించారట కేసీఆర్‌. కాంగ్రెస్‌ గ్యారెంటీ హామీలపై ప్రజల్లోనే తేల్చుకోవాలనే ఆలోచనతో తాను పక్కా వ్యూహం సిద్ధం చేశానని… తన వ్యూహం ప్రకారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని… ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే ప్రజల్లోనే తేల్చుకునే అవకాశం వస్తుందని చెప్పారట కేసీఆర్‌.

బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార పక్షంతో బాగా పోరాడారని తనను కలిసిన ఎమ్మెల్యేలను అభినందించిన కేసీఆర్… సీఎం రేవంత్‌రెడ్డితో తాడోపేడో అన్నట్లు తలపడిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడినట్లు చెబుతున్నారు. తనను పదే పదే సభకు రావాలంటూ రేవంత్ పిలవడం వెనుక వ్యూహాన్ని కూడా సదరు ఎమ్మెల్యేలకు కేసీఆర్ వివరించారట. తాను సభకు వస్తే టార్గెట్ చేసి విమర్శలు చేయడమో లేదా తనతో వాగ్వాదానికి దిగడం ద్వారానో ప్రజల్లో తన ఇమేజీని తగ్గించడమే రేవంత్ వ్యూహమని తేల్చారట కేసీఆర్. ఓ వైపు తనను సభకు రావాలని కోరుతూనే… మరో వైపు హాఫ్, ఫుల్ అంటూ రేవంత్ మాట్లాడ్డం ఏంటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారంటున్నారు.

మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలతోనే బూతులు మాట్లాడించడం రేవంత్ వ్యూహంలో భాగమేనని.. దీనికి దీటుగా స్పందించిన ఎమ్మెల్యేలను ఆయన అభినందించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సందర్భంగానే రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రస్తావన వచ్చిందని చెబుతున్నారు. ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారతాయని… ఆ తర్వాత తాను అసెంబ్లీకి వస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో చెప్పారట కేసీఆర్. బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై ఎట్టిపరిస్థితుల్లో అనర్హత వేటు పడుతుందని అంచనా వేస్తున్న బీఆర్ఎస్ బాస్… ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ ఆలస్యం చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

సుప్రీంకోర్టు ఈ తరహా కేసులపై ఆయా రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసిందని… ఆ ప్రకారం కనీసం మూడు నెలల్లోగా ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో ప్రభుత్వంతో చావోరేవో తేల్చుకుంటానని… ఆ తర్వాతే సభకు వస్తానని ఎమ్మెల్యేలకు చెప్పారట బీఆర్ఎస్ బాస్. మొత్తానికి తాను సభలో అడుగుపెట్టాలంటే భారీ విజయం సాధించి…. ప్రజల్లో తన పట్టు సడలలేదని నిరూపించుకోవాలని కేసీఆర్ డిసైడయ్యారని అంటున్నారు పరిశీలకులు.

What is KCR's strategy?

 

KCR | అసెంబ్లీకి కేసీఆర్ | Eeroju news

Related posts

Leave a Comment