What happened to Sajjala Ramakrishna Reddy where are you ? | కనిపించని సజ్జల… | Eeroju news

Sajjala Ramakrishna Reddy

కనిపించని సజ్జల…

గుంటూరు, జూన్ 29, (న్యూస్ పల్స్)

What happened to Sajjala Ramakrishna Reddy where are you ?

 సజ్జల రామకృష్ణారెడ్డి ఏమయ్యారు? ఎక్కడున్నారు? గతంలో వైసీపీ పాలసీలపై పరిగెత్తి మరీ ప్రెస్‌మీట్లు పెట్టిన సజ్జల ఎందుకు కనిపించడం లేదు? ఏపీ రాజకీయాల్లో ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొడాలి నాని, పేర్నినాని, రోజా, అమర్నాథ్, అంబటి రాంబాబు లాంటివారు గతంలో వైసీపీ తరుఫున ప్రెస్‌మీట్లు పెట్టేవారు. అయితే, వీరంతా కేవలం పవన్, చంద్రబాబు, లోకేష్ ను తిట్టడానికే పరిమితం అయ్యేవారు. పాలసీలపై మాట్లాడటానికి మాత్రం వీళ్లు దూరంగా ఉండేవారు. వీరంతా జగన్ కేబినెట్‌లో మంత్రులుగా చేసినప్పటికీ.. వారి శాఖలకు సంబంధించిన పాలసీ వ్యవహారాలపై మాత్రం సజ్జల రామకృష్ణరెడ్డి మాత్రమే మాట్లాడేవారు. పార్టీ, ప్రభుత్వ విధివిధానాలు ఆయనే చెప్పేవారు.కానీ.. అధికారం చేతులు మారిన తర్వాత సజ్జల కనిపించడం లేదు. పార్టీకి సంబంధించిన అంశాలు కూడా మాట్లాడం లేదు. జగన్‌కు ప్రతిపక్ష హోదా, కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం లాంటి వార్తలపై కూడా ఆయన స్పందించడం లేదు. ఇలాంటి కీలకమైన అంశాలపై పేర్ని నాని మొన్న ప్రెస్‌మీట్ పెట్టారు. దీంతో.. జగన్ ప్రియారిటీలను మార్చుకున్నారా? సజ్జలను దూరం పెట్టారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సజ్జల వలనే ఓడిపోయామనే ప్రచారాన్ని జగన్ కూడా నమ్మారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.వైసీపీ ఓటమికి కారణమేంటని ప్రశ్నిస్తే సొంత పార్టీ వాళ్లు కూడా చెప్పే మొదటి పేరు సజ్జల రామక‌ృష్ణారెడ్డి. గ్రౌండ్ లెవెల్ వాస్తవాలను జగన్‌కు తెలియకుండా సజ్జల ఓ సైంధవుడిలా వ్యవహించారని ఇంటా బయటా వినిపస్తున్న మాట. ఎన్నికలకు ముందే ఈ విషయం చాలా మంది వైసీపీ నాయకులు చెప్పినా.. జగన్ వినలేదు. సజ్జలపై తీవ్రమైన ఆరోపణలు చేసి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి లాంటి వారు బయటకు వచ్చారు. అప్పుడు జగన్ తన మంత్రులు, ఎమ్మెల్యేలతో శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి లాంటివారిపై మాటల దాడి చేయించారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా చాలా మంది వైసీపీ నేతలు సజ్జలవైపే చూపిస్తున్నారు.

మొన్నటికి మొన్న గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా సజ్జలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గ్రౌండ్ విషయాలు తమ అధినేతకు తెలయకుండా సజ్జల చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ కు కలిసేందుకు కూడా అవకాశం లేకుండా ఓ గోడలా సజ్జల అడ్డంగా ఉన్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో మంత్రులు మితిమీరి మాట్లాడినా.. అడ్డుకోవాల్సిన సజ్జల వారిని ప్రోత్సహించారని అన్నారు. అందుకే వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోయిందని చెప్పారు. అయితే.. ఇది ఒక్క కాసు మహేష్ రెడ్డికే పరిమితం కాలేదు.పార్టీలో నేతలంగా పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో ఓటమికి ప్రధాన కారణం సజ్జల అని అంటున్నారు. అయితే కొంతమంది ధైర్యంగా వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది లోలోపల గుసగుసలాడుతున్నారు.

పార్టీలోనే కాకుండా ప్రత్యర్థులు కూడా సజ్జల తీరుపై చాలా ఏళ్లుగా విమర్శలు చేస్తూనే వస్తున్నారు. పేరుకే జగన్ కేబినెట్‌లో మంత్రులున్నారే కానీ.. వారి వ్యవహారాలన్నీ సజ్జలే చూస్తున్నారని ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ వచ్చేవారు. కానీ, జగన్ మాత్రం ఇవన్నీ రాజకీయ విమర్శలకుగానే చూశారు తప్పా.. అందులో నిజమెంత ఉందో తెలుసుకోలేకపోయారు. చివరికి ఓటమి తర్వాత ఆయనకు తత్వం బోధపడిందని అంటున్నారు. అందుకే సజ్జలను పక్కన పెట్టారని చెబుతున్నారు.అయితే.. మరో వర్సెన్ కూడా వినిపిస్తోంది. ఎవరో ఏదో చెబితే వినే తత్వం జగన్ ది కాదని అంటున్నారు. నిజంగానే ప్రత్యర్థులో, పార్టీ నేతలో చెప్తే వినే పరిస్థితుల్లో జగన్ ఉంటే ఈ స్థాయి ఓటమిని మూటకట్టుకునే వారు కాదనే వాదనలు కూడా ఉన్నాయి. కానీ, సజ్జలను జగన్ పక్కన పెట్టడం కాదని.. జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత సైలంట్‌గా సజ్జలే సైడ్ అయ్యారని వైసీపీ నేతల్లో ఓ వర్గం చెబుతోంది. అందులో భాగంగానే తన కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డిని కూడా సోషల్ మీడియా బాధ్యతలను నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతోంది. ఈ వాదనల్లో నిజం ఏదైనా.. సజ్జల, జగన్ మధ్య కాస్త గ్యాప్ పెరిగిందన్నది వాస్తవంగా తెలుస్తోంది.

 

Sajjala Ramakrishna Reddy

 

హైదరాబాద్ ట్రైనీ ఐఏఎస్ లకు సజ్జనార్ అవగాహన | Sajjanar awareness for Hyderabad Trainee IAS | Eeroju news

 

Related posts

Leave a Comment