భవననిర్మాణ కార్మికుల సంక్షేమానికి కృషిచేస్తా
– ఎమ్మెల్యే బొలిశెట్టి హామీ!
తాడేపల్లిగూడెం
We are working for the welfare of construction workers MLA Bolishetti guarantee
భవననిర్మాణ కార్మికుల సంక్షేమానికి శాయశక్తులా కృషి చేస్తానని ఎమ్మెల్యే బొలి శెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఏరియా తాపీ వడ్రంగి సెంటరింగ్ రాడ్ బెండింగ్ వర్కర్స్ యూనియన్ , ఎఐటీయూసి నాయకులు శుక్రవారం ఎమ్మెల్యే బొలి శెట్టి శ్రీనివాస్ ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. దానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. కూటమి అధికారంలోకి రావడంలో భవన నిర్మాణ కార్మికుల తోడ్పాటు ఎంతో ఉందని , వారి సమస్యలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఎమ్మెల్యే అన్నారు.
కూటమి ప్రభుత్వం అమలు చేయ తలపెట్టిన కొత్త ఇసుక విధానం బాగుందని , దానివల్ల గృహ యజమానులకు మేలు జరుగుతుందని, కార్మికులకు ఉపాధి పెరుగుతుందని యూనియన్ నాయకులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.
భవననిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని , గత ఐదేళ్లుగా బోర్డులో పెండింగులో ఉన్న క్లేయిములను పరిష్కరించాలని, వెల్ఫేర్ బోర్డును పటిష్టం చేసి పాత సభ్యత్వాల పునరుద్ధరణ , కొత్త సభ్యుల నమోదు కొనసాగించాలని యూనియన్ నాయకులు ఆ వినతిపత్రంలో కోరారు. గత ప్రభుత్వం దారి మళ్లించిన నిధులను తిరిగి బోర్డుకు జమ చేయాలని, వృద్ధులైన కార్మికులకు వెల్ఫేర్ బోర్డు నుండి పింఛను ఇవ్వాలని కోరారు. వెల్ఫేర్ బోర్డు సభ్యులుగా ఉండి మృతి చెందిన కార్మిక కుటుంబాలను ఆదుకోవడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు.ఎమ్మెల్యే బొలి శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ భవననిర్మాణ కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
ప్రాధాన్యతా క్రమంలో సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని , ఆర్థిక సమస్యలను అవగాహన చేసుకుని చక్కదిద్దడానికి తమకు కొంత సమయం ఇవ్వాలని కోరారు.కార్యక్రమంలో ఏరియా భవననిర్మాణ కార్మికసంఘం అధ్యక్షుడు దువ్వా శ్రీనివాస్ , కార్యనిర్వాహక అధ్యక్షుడు పడాల శ్రీనివాస్, కార్యదర్శి అత్తిలి బాబీ, కోశాధికారి కోడే సాయి బాలాజీ,భవననిర్మాణ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి పోలిరాతి ఆదినారాయణ , జిల్లా ఉపాధ్యక్షులు అంకం భాస్కరరావు , యూనియన్ నాయకులు శెట్టి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.తొలుత యూనియన్ నాయకులు ఇటీవల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు.