Warangal:రైతు కూలీల సాయంపై తర్జన భర్జనలు

Financial assistance of 12 thousand rupees per year for landless farmers

భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12వేల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తామని..ఎన్నికలప్పుడు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చి ఏడాది అయిపోయింది. రేవంత్‌ ప్రభుత్వం రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. దీంతో సంక్రాంతి కానుకగా రైతుభరోసా ఇంప్లిమెంట్‌ చేయాలని భావిస్తున్నారుఅదే సమయంలో భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక సాయం అమలుపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది.

రైతు కూలీల సాయంపై తర్జన భర్జనలు

వరంగల్, జనవరి 3
భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12వేల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తామని..ఎన్నికలప్పుడు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చి ఏడాది అయిపోయింది. రేవంత్‌ ప్రభుత్వం రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. దీంతో సంక్రాంతి కానుకగా రైతుభరోసా ఇంప్లిమెంట్‌ చేయాలని భావిస్తున్నారుఅదే సమయంలో భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక సాయం అమలుపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఒక్క ఎకరా కూడా వ్యవసాయ భూమి లేకుండా, కూలి పనులు చేసుకొని జీవిస్తున్న అత్యంత నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో భూమి లేని రైతు కూలీల్లో అర్హులను గుర్తించడం కష్టతరంగా మారిందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.ఇంటింటి సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం కోటి 16లక్షల కుటుంబాలు ఉన్నాయి. దీంట్లో పట్టాదారు పాసు పుస్తకాలున్న రైతులు 70 లక్షలని రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. మిగిలిన 46 లక్షల కుటుంబాలకు భూమి లేదు. వీరిలో నిరుపేదలను గుర్తించేందుకు జాతీయ ఉపాధి హామీ కూలీ గుర్తింపు కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.తెలంగాణలో మొత్తం 53 లక్షల మందికి ఉపాధి హామీ గుర్తింపు కార్డులున్నా, వారిలో 32 లక్షల మంది మాత్రమే రోజూ కూలీ పనులకు వెళ్తున్నట్లు కార్డులు చలామణిలో ఉన్నాయి. ఈ కార్డుదారుల్లో భూమి లేని వారు దాదాపు 21 లక్షల నుంచి 23 లక్షల వరకు ఉండొచ్చని ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. కానీ వీరిని మాత్రమే 12వేల రూపాయల ఆర్థిక సాయానికి అర్హులుగా గుర్తిస్తే..మిగతా వారి నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో కనిపిస్తోంది.

రైతు కూలీలకు సాయంపై ఏ ప్రాతిపదికన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేయాలన్న దానిపై ప్రభుత్వం దగ్గర ఇంకా క్లారిటీ లేదని తెలుస్తోంది. కొంతమంది ఉపాధి హామీ కూలీలను మాత్రమే రైతు కూలీలని అర్హులుగా గుర్తించి, మిగతా వారిని తప్పిస్తే వారిలో వ్యతిరేకత వస్తుందని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. దాని ప్రభావం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని అంచనా వేస్తున్నారట.ఒకవేళ ఏ షరతు లేకుండా ప్రస్తుతం ఉపాధి హామీ కూలీలుగా ఉన్న 46 లక్షల మందికి ఏడాదికి 12 వేల చొప్పున చెల్లిస్తే 5వేల 2వందల కోట్లు అవసరం అవుతాయి. అంటే మొదటి విడతలో 6వేల చొప్పున చెల్లించినా 2వేల 600 కోట్లు కావాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో నిధులను చెల్లించే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదంటున్నారు అధికారులు.అలా కాదని ఉపాధి హామీ పనులకు వెళ్తున్న 23 లక్షల మందికి 12వేల చొప్పున చెల్లిస్తే 2వేల 7వందల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. అంటే మొదటి విడతలో 6వేలు చెల్లిస్తే 1350 కోట్లు అవసరం. కాబట్టి ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకుని ఉపాధి హామీ పనులకు వెళ్తున్న వారికి మాత్రమే 12వేల సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పంటలు పండించే రైతులతో పాటు, పది ఎకరాలలోపు భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇవ్వాలనే యోచనలో ఉంది రేవంత్ సర్కార్.అయితే రైతు భరోసా, రైతు కూలీలకు సాయంపై కోత పెడితే పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతోంది ప్రభుత్వం. ఇప్పటికే రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ప్రతిపక్షం విమర్శిస్తోంది. ఇది కోతల ప్రభుత్వమని ఇప్పటికే అపోజిషన్ అటాక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా, రైతు కూలీలకు సాయంపై కసరత్తు చేయడంలో బిజీగా ఉందట తెలంగాణ ప్రభుత్వం. చూడాలి మరి ప్రభుత్వం గైడ్‌లైన్స్ రిలీజ్ చేసిన తర్వాత పబ్లిక్‌ రెస్పాన్స్ ఎలా ఉంటుందో.

Read:Karimnagar:గంగుల కోట బద్దలు కొట్టాల్సిందే

Related posts

Leave a Comment