ఓరుగల్లు జిల్లా నేతల తీరు తలనొప్పిగా మారిందట. అంతర్గత వర్గపోరుతో క్యాడర్‌ను చేజార్చుకుంటున్న నేతలు ఇప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అధిష్టానానికి లేఖలు సంధిస్తున్నారట. దీంతో ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారట కాషాయ పెద్దలు. దేశవ్యాప్తంగా బలాన్ని పెంచుకునేందుకు బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
ఓరుగల్లు కమలానికి కష్టాలు..
వరంగల్, జనవరి 2
ఓరుగల్లు జిల్లా నేతల తీరు తలనొప్పిగా మారిందట. అంతర్గత వర్గపోరుతో క్యాడర్‌ను చేజార్చుకుంటున్న నేతలు ఇప్పుడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అధిష్టానానికి లేఖలు సంధిస్తున్నారట. దీంతో ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారట కాషాయ పెద్దలు. దేశవ్యాప్తంగా బలాన్ని పెంచుకునేందుకు బిజెపి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కోసం పావులు కదుపుతోంది పార్టీ తప్పిదాలు, అంతర్గత కుమ్ములాటల కారణంగా బలహీనపడుతున్నామని తెలుసుకున్న అదిష్టానం.. మొదటగా పార్టీలో నూతన కమిటీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. బూత్ స్థాయి కమిటీల నిర్మాణం పూర్తికాగా.. మండల, జిల్లా స్థాయి కమిటీలను జనవరి మొదటి వారంలో ప్రకటించనుంది. క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించే కమిటీల ఏర్పాటుకు సంబంధించి వర్గ పోరు తరాస్థాయికి చేరుతోంది. నేతల మధ్య వర్గపోరు కారణంగా తమ తమ అనుచరులకే కమిటీలలో అవకాశం కల్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో పార్టీ కోసం కష్టపడ్డ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.ప్రస్తుత హనుమకొండ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్న రావు పద్మకు వ్యతిరేకంగా హనుమకొండ జిల్లా నేతలంతా ఒక్కటయ్యారు. వరుసగా మూడుసార్లు అధ్యక్షురాలుగా పనిచేసిన రావు పద్మపై బిజెపిలోని మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలంతా గుర్రుగా ఉన్నారు. రావు పద్మ సీనియర్లకు తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని ఆరోపణలు ఉన్నాయి. అందుకే రావు పద్మను కాదని మిగతా నేతలంతా ఒక్కటై పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జిల్లా అధ్యక్షురాలి పదవిలో ఉండి నేతలందరినీ కలుపుకోవాల్సిన ఆమె, వర్గాలను పెంచి పోషించారని బహిరంగంగానే బిజెపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కేంద్రంలో ఉన్న బిజెపి హనుమకొండకు చేసిన అభివృద్ధి పనులను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తీవ్రంగా విఫలమయ్యారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్మార్ట్ సిటీ నిధులు బిజెపి ప్రకటిస్తే, ఈ విషయాలను కనీసం ప్రజల్లోకి తీసుకెళ్లలేదని మండిపడుతున్నారు.అన్ని జిల్లాలలో బీజేపీ పార్టీ కార్యాలయాలు ఉండగా, హనుమకొండ జిల్లాలో మాత్రం రావు పద్మ సొంత భవనంలో పార్టీ కార్యాలయాన్ని నడుపుతున్నారు. దీంతో రావు పద్మ వ్యతిరేకిస్తున్న కీలక నేతలంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
మరికొంతమంది వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లా కేంద్రాలలో బీజేపీ పార్టీ కార్యాలయాలు నిర్మాణం జరిగింది కానీ.. హనుమకొండ జిల్లాలో మాత్రం ఆ నిధులను జిల్లా అధ్యక్షురాలు వాడుకున్నారని ఆరోపిస్తున్నారు కాషాయ నేతలు. మూడు సార్లు జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగినప్పటికీ, పార్టీ కార్యాలయాన్ని ఎందుకు నిర్మించలేకపోయారని మండిపడుతున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మరో అభ్యర్థికి టికెట్ ఇచ్చి ఉంటే గెలిచే అవకాశాలు ఉండేవని, రావు పద్మకు టికెట్ కేటాయించడంతో బిజెపి శ్రేణులే వ్యతిరేకించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రావు పద్మ కారణంగా పార్టీ తీవ్రంగా డ్యామేజ్ అవుతోందని, ఆమెను అధ్యక్ష పదవి నుండి తొలగించాలని అధిష్టానానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు సైతం వెళ్లాయి. అయినా అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోలేదు.బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి కోసం నాంపెల్లి శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, రావుల కిషన్, గుజ్జుల వసంత, మరికొంత మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తన వర్గానికి చెందిన వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని రావు పద్మ అధిష్టానం పై ఒత్తిడి తెస్తున్నారంట. ఆ క్రమంలో రావు పద్మ అనుచరులకు పదవి దక్కకుండా ఇతర నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారట. వచ్చే ఎన్నికల్లో హనుమకొండలో బిజెపి జెండా ఎగురుతుందని, అందుకే అధ్యక్ష పదవి ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలని అధిష్టానానికి కొంతమంది నేతలు లేఖలు రాసారట. ఇన్నేళ్లు పార్టీ కోసం కష్టపడ్డ వారిని రావు పద్మ పట్టించుకోలేదని, ఆమె కారణంగానే పార్టీ బలహీనపడుతోందని సీనియర్లు విమర్శిస్తున్నారు. ఒకవేళ ఈ సారి కూడా పార్టీ పదవి ఆమె అనుచరులకే ఇస్తే.. పార్టీని వీడాల్సి వస్తుందని పద్మ వ్యతిరేకులు హెచ్చరిస్తున్నారు.