Visakhapatnam : డోలీలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు

Visakhapatnam

ఉత్తరంధ్రా ఏజెన్సీ ప్రాంతాల్లో కనీస వైద్యం, మౌలిక సదుపాయాలు లేని వందల గ్రామాలు ఉన్నాయి. గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించాలంటే డోలీ కట్టాల్సిందే. ప్రాణాలు దక్కాలంటే పదుల కిలోమీటర్లు డోలీల్లో ప్రయాణించాల్సిందే. ప్రజల జీవన ప్రమాణాల దృష్ట్యా అభివృద్ధిని అంచనా వేస్తారు.

డోలీలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు

 

విశాఖపట్టణం, డిసెంబర్ 23,  ఉత్తారంధ్రా ఏజెన్సీ ప్రాంతాల్లో కనీస వైద్యం, మౌలిక సదుపాయాలు లేని వందల గ్రామాలు ఉన్నాయి. గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించాలంటే డోలీ కట్టాల్సిందే. ప్రాణాలు దక్కాలంటే పదుల కిలోమీటర్లు డోలీల్లో ప్రయాణించాల్సిందే. ప్రజల జీవన ప్రమాణాల దృష్ట్యా అభివృద్ధిని అంచనా వేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని పలు గ్రామాల్లో కనీసం వైద్య సదుపాయాలు లేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా మన్యం గ్రామాల్లో చిన్న పాటి వైద్యానికి సైతం డోలీ కష్టాలు తప్పవు. గిరిజన ప్రాంతాలలో జీవిస్తున్న వారు కనీస సదుపాయాలకు నోచుకోవడంలేదు. కనీస రహదారులు లేక జీవ పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్న కనీస వైద్య సదుపాయాలకు నోచుకోని వందల గ్రామాలు మన్యం ప్రాంతాల్లో ఉన్నాయి. వృద్ధులు, గర్భిణీలు..అత్యవసర చికిత్సలకు డోలీలనే ఆశ్రయించాల్సిన పరిస్థితులు నేటికీ కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని మారినా… కనీసం రోడ్లు వేయలేకపోతున్నారని గొంతులేని ఆ గిరిజనులు మౌనంగా ప్రశ్నిస్తున్నారు. కొండలు, గుట్టలు దాటి డోలీలపై బాధితులను మోస్తూ ప్రాణాలు నిలబెట్టేందుకు నిత్యం పోరాడుతున్నారు. ఉన్న ఒకటి అర మొబైల్ అంబులెన్స్ లు సరైన రోడ్డు సదుపాయాలు లేక గ్రామాలను చేరుకోలేకపోతున్నాయి. సరైన సమయానికి వైద్య సదుపాయాలు అందక నెలకు కనీసం 5-10 మరణాలు సంభవిస్తున్నాయని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి.ఏజెన్సీలోని 11 మండలాల్లో 244 గ్రామ పంచాయతీల పరిధిలో 3,915 గిరిజన గ్రామాలున్నాయి. వీటిలో 1,724 గ్రామాలకు మాత్రమే తారురోడ్డు సదుపాయం ఉంది. మిలిగిన 2,191 గ్రామాలకు ఎలాంటి రోడ్డు సదుపాయం లేదు. దీంతో ఏజెన్సీల్లోని గిరిజనులు కొండలు, కోనలు, వాగులు, వంకలు దాటుకుంటూ ఓ మహాయుద్ధమే చేసి బాహ్య ప్రపంచాన్ని చేరుకుంటారు. అనారోగ్య సమస్యలు, గర్భిణీలకు పురిటి నొప్పులు వచ్చినప్పుడు వీరి అవస్థలు వర్ణనాతీతం. రోగులను, గర్భిణీలను డోలీల్లో కొండ కోనల్లోంచి, ప్రమాదకరమైన దారుల్లో పదుల కిలోమీటర్లు మోసుకుని వచ్చి రోడ్డున్న ప్రాంతాలకు చేరుస్తారు. అక్కడి నుంచి అంబులెన్సుల్లో ప్రభుత్వ ఆస్పత్రులకు చేరుస్తారు.

 

ఈ డోలీ ప్రయాణాల్లో చివరి వరకు చేరి ప్రాణాలు నిలబెట్టుకునే వారి శాతం తక్కువే. ఏజెన్సీలో నిత్యం ఏదో ప్రాంతంలో డోలీలు కనిపిస్తూనే ఉంటాయి. ఎన్నికల సమయాల్లో వచ్చి రోడ్డు వేస్తామని హామీలిచ్చి ఓట్లు వేయించుకునే నేతలు..ఎన్నికల తర్వాత మళ్లీ కనిపించరని గిరిపుత్రులు వాపోతుంటారు.రహదారుల సౌకర్యం లేకపోవడంతో గిరిజనులకు డోలీల మోతలు తప్పడం లేదు. పురిటి నొప్పులు వచ్చిన గర్భిణీలను, అస్వస్థతకు గురైన బాలింతలను, దీర్ఘకాలిక వ్యాధుల బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించాలంటే డోలీ కట్టాల్సిందేనని అంటున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ కష్టాలు ఎవరికీ పట్టడంలేదని వాపోతున్నారు. వర్షాకాలంలో తమ పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని, కనీసం నిత్యావసరాలు కూడా తెచ్చుకోలేని పరిస్థితులు ఉంటాయని వాపోతున్నారు. తమ నుంచి ఆదాయం రావడంలేదనే ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని అంటున్నారు. గిరిజన ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తే గంజాయి సాగును అరికట్టవచ్చని చెబుతున్నారు.  తమ ఆర్థిక పరిస్థితులు బాగాలేక చాలా మంది గంజాయి సాగు వైపు వెళ్తున్నారని, రోడ్లు, నీరు, వైద్య సదుపాయాలు కల్పిస్తే తాము ఇతర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు, పనులు చేసుకుంటామని అంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కనీసం రోడ్లు వేయించాయని కోరుతున్నారు.కూటమి ప్రభుత్వం గిరిజనుల డోలీ కష్టాలపై దృష్టి పెట్టింది. మన్యంలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…గిరిజన ప్రాంతాల్లో రహదారులకు నిర్మాణానికి శంకుస్థాపనలు చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలపై ఇటీవల సమీక్ష చేసిన సీఎం చంద్రబాబు…మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఆ దిశగా అధికారులు దృష్టి పెట్టి చర్యలు చేపట్టారు. ఏజెన్సీలో రోడ్డు, రవాణా సదుపాయాలు లేని గ్రామాలను గుర్తించి, ఆయా ప్రాంతాలకు రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.  రానున్న రోజుల్లో ఏజెన్సీలో డోలీ మోతలు లేకుండా పటిష్ట చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. పార్వతీపురం మన్యంలో 77 ఏళ్లుగా సరైన రహదారులు లేని 55 గిరిజన గ్రామాల్లో రూ.36.71 కోట్లు ఖర్చు చేస్తూ 19 రోడ్లు…39.32 కి.మీ మేర నిర్మించి 3782 గిరిజన గ్రామాలకు డోలీ కష్టాలు తీర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రులు రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నారు.దీంతో పాటు గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆసుపత్రులు నిర్మించి తమ ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. చిన్నపాటి జ్వరం వచ్చినా కనీసం వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నామని గిరిపుత్రులు వాపోతున్నారు. ప్రైమరీ, సెకండరీ హెల్త్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో విద్య కూడా అంతంత మాత్రమే. సరైన పాఠశాలలు లేక, పనిచేసేందుకు ఉపాధ్యాయులు ఆసక్తి చూపకపోవడంతో…గిరిజన గ్రామాలు చదువుకు దూరం అవుతున్నాయి. గ్రామాల్లో పాఠశాలలు అందుబాటులో లేక దూరప్రాంతాలకు తమ పిల్లలను పంపిస్తున్నామని వాపోతున్నారు.

Read : Registration servicesఇక ఇంటి వద్ద రిజిస్ట్రేషన్ సేవలు

Related posts

Leave a Comment