Visakhapatnam:గాజువాకలో.. టూ లెట్ బోర్డ్స్

gajuwaka-is-becoming-empty

గాజువాక.. ఎంతో పేరున్న ప్రాంతం. నిత్యం కళకళలాడేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గాజువాకలోని చాలా ప్రాంతాలు ఖాళీ అయ్యాయి. అందుకు కారణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలు.

గాజువాకలో.. టూ లెట్ బోర్డ్స్..

విశాఖపట్టణం, జనవరి 17
గాజువాక.. ఎంతో పేరున్న ప్రాంతం. నిత్యం కళకళలాడేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గాజువాకలోని చాలా ప్రాంతాలు ఖాళీ అయ్యాయి. అందుకు కారణం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలు. ఈ ప్రభావం వేలాది కుటుంబాలపై పడింది. ఫలితంగా గాజువాకలో ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులే దర్శనమిస్తున్నాయి.విశాఖ జిల్లాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కాకముందు.. గాజువాక చిన్న గ్రామంగా ఉండేది. ఉక్కు పరిశ్రమ నిర్మాణం తర్వాత క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ.. పట్టణంగా మారింది. షీలానగర్ నుంచి అంగనపూడి వరకు చాలా వేగంగా విస్తరించింది. ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది, కార్మికులు నివసిస్తున్నారు. దీంతో గృహవినియోగాలు పెరిగాయి.డిమాండ్‌కు తగ్గట్టు గాజువాకలో ఇళ్లు నిర్మించారు. ఎంతోమంది ఇళ్లను అద్దెకు ఇచ్చి.. వచ్చిన ఆదాయం ద్వారా జీవించేవారు. కానీ.. ఇటీవల పరిస్థితి మారిపోయింది. నిత్యం కళకళలాడే గాజువాక.. నేడు బోసిపోయింది. గతంలో ఎక్కువ డబ్బులు ఇచ్చినా ఇల్లు దొరికేది కాదు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులే కనిపిస్తున్నాయి. గతంలో సింగిల్ బెడ్రూం ఇళ్లు అద్దె రూ.7 వేలు ఉండేది. ప్రస్తుతం రూ.5 వేలకు కూడా అడిగేవారు లేరు.గత 3 నెలలుగా గాజువాకలో ఎక్కడ చూసినా ఖాళీ ఇళ్లే దర్శనమిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ కార్మికులకు సరిగా జీతాలు ఇవ్వకపోవడం, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడంతో.. చాలామంది తమతమ సొంత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. మరికొంత మంది ఢిల్లీ, ముంబయి వంటి నగరాలకు వెళ్తున్నారు. దీంతో గాజువాక క్రమంగా ఖాళీ అవుతోంది. వుడా కాలనీ, సమతానగర్, శ్రీనగర్, రిక్షా కాలనీ, ఆఫీసర్ కాలనీ, రామచంద్రానగర్, షీలానగర్ ప్రాంతాలు బోసిపోయాయి.చాలామంది వ్యాపారులు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు గాజువాకలో ఇళ్లు నిర్మించుకున్నారు. రిటైర్ అయ్యాక వచ్చే అద్దెలతో బతకొచ్చని ఆశించారు. ఇప్పుడు ఈ పరిస్థితి రావడంతో.. ఏం చేయాలని పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షమంది వరకు జీవించేవారు. కానీ దాన్ని నిర్వీర్యం చేస్తుండటంతో.. ఎంతోమంది వేరే ఉపాధి అవకాశాలు ఉన్నచోటకు వెళ్తున్నారుగాజువాకలో మార్కెట్ చాలా ఫేమస్. ఏ వస్తువు కావాలన్నా అక్కడ లభిస్తుంది. కానీ ఇటీవల అక్కడ సరిగా వ్యాపారం సాగడం లేదు. స్టీల్ ప్లాంట్‌లో పనిచేసే వారికి సరిగా జీతాలు రాక ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగలేదు. క్రిస్‌మస్, న్యూఇయర్, సంక్రాంతికి కూడా వ్యాపారం సరిగా లేదని చెబుతున్నారు. మంచి మంచి ఆఫర్లు ప్రకటించినా.. అమ్మకాలు లేవని వ్యాపారులు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. గాజువాక మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read:Kurnool:కర్నూలుకు మహర్దశ

Related posts

Leave a Comment