Visakha YCP Vilawila.. YCP leaders who are nowhere to be seen | విశాఖ వైసీపీ విలవిల.. ఎక్కడా కనిపించని వైసీపీ నేతలు | Eeroju news

Visakha YCP Vilawila.. YCP leaders who are nowhere to be seen

విశాఖ వైసీపీ విలవిల.. ఎక్కడా కనిపించని వైసీపీ నేతలు

Visakha YCP Vilawila.. YCP leaders who are nowhere to be seen

 

విశాఖపట్టణం, జూలై  15   (న్యూస్ పల్స్)

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ నేతలు పూర్తి సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. అధికారంలో ఉండగా రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పిన జిల్లా నేతలు… ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. దాదాపు నెల రోజులుగా చాలా మంది లీడర్లు బయటకే రావడం లేదు. తమ ఓటమికి కారణాలేంటనే కనీస సమీక్ష కూడా చేయడం లేదు. ముఖ్యంగా పార్టీ అధికారంలో ఉండగా, మంత్రి పదవులను అనుభవించిన వారు ఎక్కడా కనిపించకపోవడం పార్టీలో హాట్‌టాపిక్‌గా మారుతోంది.విశాఖ జిల్లాలో వైసీపీకి ఎందరో నాయకులు ఉన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉండగా, విశాఖను పరిపాలన రాజధాని చేస్తామని ఎంతో హడావిడి చేసింది. స్థానిక నేతలకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్దపీట వేసింది.

మాడుగుల మాజీ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, భీమిలి మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌లకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించింది వైసీపీ. ఐతే ఈ ముగ్గురూ ఈ ఎన్నికల్లో ఓడినా.. అమర్‌నాథ్‌ తప్ప, మిగిలిన ఇద్దరూ ఆచూకీ లేకుండా పోయారని క్యాడర్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రుషికొండ ప్యాలెస్‌పై తెగ హడావుడి చేస్తే… అమర్‌నాథ్‌ తప్ప ఏ ఒక్క వైసీపీ నేత కూడా పల్లెత్తు మాటాడలేదు. దీంతో వైసీపీ ఆత్మరక్షణలో పడిపోవాల్సివచ్చింది. పార్టీ అధికారంలో ఉండగా అధికారం అనుభవించిన నేతలు… ఓటమి తర్వాత సైలెంట్‌ అవడాన్ని కార్యకర్తలు ఆక్షేపిస్తున్నారు.

రాష్ట్రంలో జిల్లాలకు జిల్లాల్లోనే వైసీపీ తుడిచిపెట్టుకుపోగా, విశాఖ జిల్లా మాత్రం ఆ పార్టీకి గౌరవం దక్కేలా రెండు ఎమ్మెల్యే, ఓ ఎంపీ సీటులో గెలిపించారు ఓటర్లు. ఇక ఓ రాజ్యసభ ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా వైసీపీ తరఫున ఉన్నారు. అంటే రాష్ట్రంలో మరే జిల్లాలోనూ లేనంత సంఖ్యలో ఆరుగురు ప్రజాప్రతినిధులు ఉమ్మడి విశాఖ నుంచి వైసీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ, వీరెవరూ ఎన్నికల ఫలితాల తర్వాత కనిపించలేదు. విశాఖ, అనకాపల్లిలో నిర్మించిన వైసీపీ జిల్లా కార్యాలయాలకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసినా ఏ ఒక్కరూ స్పందించలేదు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తప్ప, మిగిలిన నేతలు అంతా పార్టీ గప్‌చుప్‌ అన్నట్లే వ్యవహరిస్తున్నారు.జిల్లాలో వైసీపీకి బలమైన నేతలు ఉన్నారని ఇన్నాళ్లు క్యాడర్‌ మురిసిపోయేవారు.

చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తి రాజు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కుమార్‌ గతంలో దూకుడుగా వ్యవహరించి… ఆయా నియోజకవర్గాల్లో సర్వం తామే అన్నట్లు చక్రం తిప్పేవారు. ఐతే పార్టీ ఓడిపోయాక వీరెవరూ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్‌ విశాఖ కార్పొరేషన్‌తోపాటు జిల్లా పరిషత్‌లోనూ వైసీపీయే అధికారంలో ఉంది. కానీ, ప్రభుత్వం మారిన తర్వాత ఈ పదవుల్లో ఉన్న నేతలు సైతం పార్టీపరమైన పనులకు దూరంగానే ఉంటున్నారు.

ఇలా మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ ముఖ్య నేతలు పత్తాలేకుండా పోవడంపై కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసిన నేతల కోసం తామెంతో త్యాగాలు చేసి.. క్షేత్రస్థాయిలో పోరాడితే.. ఇప్పుడెవరూ పట్టించుకోవడం లేదంటున్నారు. ఇదే అదునుగా అధికార పక్షం టార్గెట్‌ చేస్తుండటంతో చాలా మంది దిగువ స్థాయి నేతలు బటయకు రావడానికి కూడా భయపడుతున్నారు. కష్టకాలంలో అండదండగా నిలవాల్సిన నేతలే తప్పించుకు తిరిగితే తమ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. మొత్తానికి నేతల అజ్ఞాత వాసంతో విశాఖ వైసీపీ విలవిల్లాడిపోతోంది.

 

Visakha YCP Vilawila.. YCP leaders who are nowhere to be seen

 

Target YCP senior leaders | టార్గెట్… వైసీపీ సీనియర్ నేతలు | Eeroju news

Related posts

Leave a Comment