విశాఖ స్థానిక ఎమ్మెల్సీ పోటీ…బరిలో ఎవరు
విశాఖపట్టణం, జూలై 3, (న్యూస్ పల్స్)
Visakha local MLC contest…who is in the ring
ఎమ్మెుల్యే వంశీ రాజీనామాతో ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందుకోసం తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున లాబింగ్ జరుగుతోంది. 164 స్థానాలతో అధికారంలో వచ్చింది టీడీపీ. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఓటర్ల మద్దతు పొందడం సులభం అన్నది టీడీపీ నేతల అభిప్రాయం. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే నేతల సంఖ్య పెరుగుతోంది. ఈ వరుసలో టీడీపీ నుంచి అవకాశం ఎవరికి వస్తుంది. కౌంటర్ గా వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఎవరిని దింపే అవకాశం ఉందన్న చర్చ ప్రస్తుతం పెద్ద ఎత్తున సాగుతోంది.
విశాఖ స్థానిక సంస్థల నుంచి 2021లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సిహెచ్ వంశీకృష్ణ యాదవ్ అనంతం మారిన పరిణామాల్లో పార్టీ వీడారు. 2023 డిసెంబర్‌లో అప్పటి అధికార పార్టీకి రాజీనామా చేయడంతో పాటు జనసేనలో చేరిపోయారు. అధికార పార్టీ అధినేత తోపాటు ఇతర నేతలను విమర్శించడంతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆయనకు కౌన్సిల్ చైర్మన్ నోటీసులు ఇవ్వడం, అనర్హత ప్రకటించడమే కాకుండా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని ఖాళీగా చూపించడం వరకు చకచకా జరిగిపోయాయి. ఇది జరిగి ఇప్పటికీ దాదాపు నాలుగు నెలలుగా వస్తుంది.
ఆరు నెలలలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉండడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ త్వరలో వీటిపై ఒక నిర్ణయాన్ని వచ్చే అవకాశం ఉంది. అంటే వీలైనంత త్వరలో రెండు నెలల్లోనే ఎన్నిక పూర్తి చేయాల్సి ఉండడంతో ఈ ప్రక్రియ వీలైనంత తొందరలో ప్రారంభమయ్యేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్నికలపై మరోసారి అందరి దృష్టి పడింది.2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో దాదాపు 90 శాతానికి పైగా స్థానిక సంస్థలని అప్పటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంది. దీనిపై అప్పట్లోనే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. స్థానిక సంస్థల్లో దాదాపు అన్ని స్థానాలను కైవసం చేసుకోవడంతో వాటి ఆధారంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వచ్చారు.
ఆ క్రమంలోనే విశాఖ స్థానిక సంస్థల నుంచి టీడీపీ ఎవరిని పోటీ కూడా దింపలేకపోయింది. దాంతో వంశీ యాదవ్ ఎన్నిక అప్పట్లో 2021లో ఏకగ్రీవమైంది. మొదటి నుంచి ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో ఉన్న వంశీ అసంతృప్తి గానే ఎమ్మెల్సీ తీసుకున్నారు. తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో రెండేళ్ల ఎమ్మెల్సీ పదవి తర్వాత 2023 డిసెంబర్‌లో వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మూడు రోజుల తర్వాత తొమ్మిది పేజీల ఘాటైన లేఖను వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌కు రాస్తూ, పార్టీ విధానాల్ని తీవ్రంగా దుయ్యపట్టారు.
అయితే ఎమ్మెల్సీ పదవికి మాత్రం తాను రాజీనామా చేయబోనని, తాను పడ్డ కష్టానికి ఇచ్చిన గుర్తింపు తప్పా.. వైఎస్ఆర్‌సీపీ నాకేమీ గంపగుత్తగా, ఉచితంగా ఈ పదవి ఇవ్వలేదంటూ వంశీ అప్పట్లో పెద్ద రాద్ధాంతమే చేశారు. కానీ జనసేనలో చేరి పార్టీ అధిష్టానం మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండడంతో పార్టీ ఫిరాయింపుల కింద ఎమ్మెల్సీ పదవిని రద్దు చేస్తూ శాసనమండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. 2024 ఫిబ్రవరిలో దానికి సంబంధించి ఆ స్థానాన్ని ఖాళీ చూపిస్తూ గెజిట్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం జూలై నెల ప్రారంభంతో దాదాపుగా నాలుగు నెలలు ముగిశాయి మరో రెండు నెలల్లో ఈ స్థానానికి ఎన్నిక జరపాల్సి ఉంది. అందుకోసం అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలని తిరిగి ప్రారంభించాయి.
రాజకీయ పరిణామాలు నేపథ్యంలో టీడీపీ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఎలాగైనా దక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉంది. వాస్తవానికి మొత్తం ఓటర్లు 725 మంది వరకు ఉన్నారు. అందులో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటర్లుగా ఉన్న స్థానిక సంస్థల్లో టీడీపీకి 180 ఓట్లు మాత్రమే ఉండగా, మిగతా 545 వైసీపీకి ఉన్నాయి. అయితే వైసీపీకి స్పష్టమైన ఆధిక్యత దక్కే అవకాశం ఉంది కానీ, రాష్ట్రంలో 164 స్థానాలు దక్కించుకున్న ఎన్డీయే కూటమి ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఇకపై వైఎస్ఆర్ సీపీకి దక్కకుండా చేసే ఆలోచనలో వ్యూహం పన్నుతోందట. ఇప్పటికే వైసీపీతో ఉన్న 545 మంది స్థానిక సంస్థల ఓటర్లలో పలువురు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలు ఇవ్వగా, మరికొందరు పార్టీ మారకపోయినా అభ్యర్థిని బట్టి తెలుగుదేశంకి ఓటు వేసే అవకాశం కూడా ఉందన్న సంకేతాలు ఉన్నాయి. దీంతో సరైన అభ్యర్థి కోసం తెలుగుదేశం అన్వేషిస్తుంది.
మొన్నటి ఎన్నికల్లో పొత్తుల లో భాగంగా తమ స్థానాలు కోల్పోయిన సమర్థులైన నేతలని ఎంపిక చేయాలని నిర్ణయించుకుంది. ఆ రకంగా పలువురు పేర్లు పరిశీలించినప్పటికీ, విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పార్టీ ఇంచార్జిగా ఉంటూ, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ప్రతిపక్షంలో ఉంటూ పార్టీ అధినేత మన్ననలు పొందిన గండీ బాబ్జీపై టీడీపీ అధిష్టానం దృష్టి పడింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ పదవిని వదిలేసి అదే దక్షిణ నియోజకవర్గం కు ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీకే గండి బాబ్జి ఆ స్థానాన్ని త్యాగం చేసి ఉండడంతో.. వంశీ రాజీనామా చేసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి గండి బాబ్జినే సరైన అభ్యర్థి అని తెలుగుదేశం భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ఆయనకి విశాఖ అర్బన్ టీడీపీ అధ్యక్షుడిగా ఇచ్చినప్పటికీ, గతంలో పెందుర్తి ఎమ్మెల్యేగా, ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా గట్టి ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉంది.
గండి బాబ్జి అభ్యర్థిత్వానికి ఎక్కువ మంది మొగ్గు చూపే అవకాశం ఉండడంతో, ఆయననే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబెట్టాలని టీడీపీ భావిస్తున్నట్టు సమాచారం. దానికి తోడు అవసరమైతే ఆర్థిక వనరులను కూడా కూడగట్టుకుని, మెజార్టీ పొందేందుకు గండి బాబ్జి సమర్ధుడు అన్న ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టు సమాచారం. అధికారికంగా ప్రకటించక పోయినప్పటికీ గండి బాబ్జి నే సరైన అభ్యర్థి అన్న సంకేతాలను టీడీపీ ఇస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం మెజారిటీ ఉన్నప్పటికీ పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితి. ఎందుకంటే 545 మంది ఓటర్లు ఉన్నప్పటికీ వారంతా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి ఓటేసే అవకాశం లేదు.
వాళ్ళలో ఎక్కువ మంది పార్టీ మారేందుకు ఆసక్తి చూపుతున్నారట. మిగతా వాళ్ళు తమకు ఎన్నికల్లో చాలా ఖర్చులయ్యాయని, ఆ రకంగా ఆర్థిక సహకారం అందించిన వాళ్లకే ఓటేస్తామని చెప్పే ఆలోచనలో స్థానిక సంస్థల ఓటర్లు ఉన్నట్టు సమాచారం. అలాంటి సంకేతాలు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆర్థికంగా కూడా కొంత భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి కేవలం మాజీ మంత్రి అమర్‌నాథ్ ఒక్కడే ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారట. అమర్ కి అవకాశం ఇస్తే కొంతమేర టీడీపీ వ్యూహాలను నిలువరించే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో ప్రతిపక్ష పార్టీ ఉన్నట్టు సమాచారం.అమర్ – గండి బాబ్జీ ల మధ్య పోటీ సాగితే, స్పష్టమైన ఆధిక్యం ఉన్న వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా..? లేదంటే 164 స్థానాలను గెలుచుకుని శత్రుదుర్భేద్యంగా ఉన్న టీడీపీనే ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటుందా? అదే సమయంలో ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లాలన్న లక్ష్యంతో పనిచేసిన గండి బాబ్జి అసెంబ్లీకి వెళ్లలేకపోయినా చట్టసభల సభ్యుడిగా, కౌన్సిల్ కి వెళ్లే అవకాశం ఉందా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది..!