Vijayawada:55 మంది డాక్టర్ల తొలగింపు:ఏపీలో ఏకంగా 55 మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 78 మందిలో 23 మంది ప్రభుత్వానికి సరియైన సమాధానం ఇవ్వగా, మిగిలిన వారిని విధుల నుండి తొలగించారు. ఒకేసారి భారీ సంఖ్యలో వైద్యులను తొలగించడం వెనుక పెద్ద కారణమే ఉంది. అదేమిటో
55 మంది డాక్టర్ల తొలగింపు
విజయవాడ, ఫిబ్రవరి 21
ఏపీలో ఏకంగా 55 మంది ప్రభుత్వ వైద్యులను విధుల నుండి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 78 మందిలో 23 మంది ప్రభుత్వానికి సరియైన సమాధానం ఇవ్వగా, మిగిలిన వారిని విధుల నుండి తొలగించారు. ఒకేసారి భారీ సంఖ్యలో వైద్యులను తొలగించడం వెనుక పెద్ద కారణమే ఉంది. అదేమిటో తెలుసుకుందాం.కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, సెలవు పెట్టకుండా కొందరు వైద్యులు విధులకు డుమ్మా కొడుతూ.. వేతనాలు పొందుతున్నట్లు శ్రీనివాస్ గౌడ్ ఏకంగా లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ప్రభుత్వం పలు మార్లు వైద్యులకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. మొత్తం 78 మంది వైద్యులు విధులకు గైర్హాజరు అవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరిలో కొందరు ప్రొఫెసర్ లు కాగా, మరికొందరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావడం విశేషం. రోగులకు సేవలు అందించాల్సిన వీరు, విధులకు గైర్హాజరు కావడంపై లోకాయుక్తతో పాటు ప్రభుత్వం సీరియస్ గా పరిగణించింది.దీనితో 78 మంది ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు 23 మంది స్పందించి సరియైన సమాధానం ఇచ్చినట్లు సమాచారం. మిగిలిన వారు సమాధానం ఇవ్వక పోవడంతో మరోమారు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ నోటీసులకు కూడా ఎటువంటి సమాధానం ఇవ్వక పోవడంతో, చేసేదేమి లేక ప్రభుత్వం తగు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. షోకాజ్ నోటీసులకు స్పందించని 55 మందిని విధుల నుండి ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు 55 మందిని తొలగించినట్లు లోకాయుక్తకు ప్రభుత్వం సమాచారం అందజేసింది.కాగా ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసే చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. సాధ్యమైనంత త్వరగా భర్తీ చేసి, రోగులకు ఇబ్బంది కలగకుండా చూసేలా ప్రభుత్వం కృషి చేయనుంది. మొత్తం మీద 2023లో అందిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త తీసుకున్న చొరవతో విధులకు గైర్హాజరు అవుతున్న 55 మందిని విధుల నుండి తొలగించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత చర్యలు తీసుకున్నారని, ఇలాంటి వైద్యులపై ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యుడు దేవుడితో సమానంగా భావించే సమాజంలో ఉంటూ.. విధుల పట్ల అశ్రద్ద వహించే వైద్యులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఇప్పుడు వినిపిస్తోంది. అసలే రానున్నది ఎండా కాలం. వడదెబ్బ సోకే అవకాశాలు ఎక్కువ. అలాగే పలు రకాల వ్యాధుల భయం కూడా ప్రజల్లో ఉన్న పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ వైద్యశాలల తీరుతెన్నులపై ఓ నిఘా ఉంచాలని, అర్హత లేకుండా వైద్యం చేసే వ్యక్తులను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Read more:Vijayawada:వైసీపీకి సేనాని సెగ.. పవన్ పై కామెంట్స్ కు దూరం