బెజవాడలో మెట్రో అడుగులు
విజయవాడ, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టుపై మరో ముందడుగు పడింది. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గతంలో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి భూమిని సేకరించేందుకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేసినా అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్అధికారులు మరోసారి భూసేకరణ పనులు ప్రారంభించారు. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో దాదాపు 90 ఎకరాల భూమి అవసరమని కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సంబందించి ప్రతిపాదనలను అధికారులు తాజాగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు సమర్పించారు. తొలి దశలో భాగంగా గన్నవరం నుంచి పీఎన్ బీఎస్, పెనమలూరు నుంచి పీఎన్ బీఎస్ కారిడార్ల నిర్మాణం చేపట్టనున్నారు.మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడెక్కడ ఎంత భూమి అవసరమనే ప్రతిపాదనలను మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు సిద్ధం చేశారు. ప్రాజెక్టులో భాగంగా అధికారులు రెండు కారిడార్లలో 34 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. గతంలో కూడా భూసేకరణకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి టెండర్లు పిలిచారు. అయితే, కొన్ని కారణాల వల్ల ప్రక్రియ ముందుగు వెళ్లలేదు. అందుకే అప్పుడు భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగలేదు. ఇప్పుడు మరోసారి అధికారులు భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టారు.
రెండు జిల్లాల పరిధిలో మొత్తం 90 ఎకరాల భూమి అవసరం కాగా.. విజయవాడలో 30 ఎకరాలు, మిగిలిన భూమిని కృష్ణా జిల్లా నుంచి సేకరించనున్నారు. నిడమనూర్ లో కోచ్ డిపో ఏర్పాటుకు తొలి ప్రణాళికను కేసరపల్లికి మార్చారు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్-1 గన్నవరం, పెనమలూరు నుంచి పీఎన్ బీఎస్ కారిడార్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు అవసరమైన భూమికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాఅల కలెక్టర్లు, మెట్రో రైలు అధికారులతో త్వరలోనే సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.ప్రాజెక్టులో భాగంగా మొదటి కారిడార్ పీఎన్ బీఎస్ వద్ద ప్రారంభమై విజయవాడ రైల్వే స్టేషన్ ను కలుపుతూ ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు వద్ద నేషనల్ హైవేకి చేరుకుని.. గన్నవరం వరకే కొనసాగనుంది. 12.5 కిలో మీటర్లు ఉండే రెండో కారిడార్ పీఎన్ బీఎస్ వద్ద స్టార్ట్ అయ్యి బందరు రోడ్డు, బెంజ్ సర్కిల్, ఆటో నగర్, కన్నూర్, పోరంకి మీదుగా విక్టోరియా మ్యూజియం, ఇందిరా గాంధీ స్టేడియం, కృష్ణానగర్, తదితర ముఖ్యమైన ప్రదేశాలను కవర్ చేస్తూ పెనమలూరు వరకు కొనసాగనుంది.ముందు ప్రభుత్వం నాలుగు కారిడార్ లు నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నా.. ప్రస్తుతం రెండు కారిడార్ల పైనే దృష్టి పెట్టింది. విజయవాడలోని పీఎన్ బీఎస్ లో రెండు కారిడార్లు అనుసంధానం అయ్యేలా చేసేందుకు సిద్దం చేసిన ప్రతిపాదనల ప్రకారం అధికారులు భూసేకరణ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
Read : Andhra Pradesh:రాజధాని పై వైసీపీ వాదనేంటీ