Vijayawada:నదుల అనుసంధానంపై ప్రధాన గురి

Godavari Cauvery Connection

ఏటా వరదల సమయంలో సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి నదిలో కడలి పాలవుతున్న వేలాది టిఎంసీల నీటిని పెన్నా బేసిన్‌కు తరలించడం ద్వారా కరవు పారద్రోలాలని యోచిస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి…రాష్ట్రాన్ని 100 శాతం కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ ప్రణాళికలను అమలు చేయబోతున్నారు.

నదుల అనుసంధానంపై ప్రధాన గురి..

విజయవాడ, డిసెంబర్ 31
ఏటా వరదల సమయంలో సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. గోదావరి నదిలో కడలి పాలవుతున్న వేలాది టిఎంసీల నీటిని పెన్నా బేసిన్‌కు తరలించడం ద్వారా కరవు పారద్రోలాలని యోచిస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి.. రాష్ట్రాన్ని 100 శాతం కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ ప్రణాళికలను అమలు చేయబోతున్నారు.గోదావరి జలాలను బనకచర్లకు తరలించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్‌లో పది సూత్రాల్లో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు.ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవరకూ సీమకు నీళ్లివ్వాలనే ఆలోచన ఎవరూ చేయలేదు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో ఒక ఒప్పందం జరిగిందని, ఆ సందర్భంలో శ్రీశైలం నుంచి తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకు కెనాల్ నీరివ్వడానికి తాను సిద్ధంగా ఉన్నామని అన్నారని గుర్తు చేశారు. తెలుగుగంగ ద్వారా రాయలసీమ, తమిళనాడుకు నీరిచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ, ఏపీలో ఉన్న 90 శాతం ప్రాజెక్టులు ప్రారంభించి పూర్తిచేసిన ఘనత టీడీపీది. గండికోట, కండలేరు, సోమశిల ఇలా అనేక ప్రాజెక్టులు నిర్మించాం. 2014 రాష్ట్ర విభజన సమయంలో నాటి కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది.

తెలంగాణలోని 7 మండలాలను ఏపీకి ఇస్తేనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ప్రధాని మోదీకి చెప్పగా 7 మండలాలను ఏపీలో కలుపుతూ ఆర్డినెన్స్ తెచ్చారు. నీటి విషయంలో ఎన్టీఆర్ ముందుచూపుతో ఆలోచన చేశారు. వెలుగొండ ప్రాజెక్టుకు పునాదిరాయి వేశాను. ఉత్తరాంధ్రలో తోటపల్లి ప్రారంభించి పూర్తిచేశానన్నారు.గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోయే 3 వేల టీఎంసీల నీటిలో 300 టీఎంసీల నీటిని ఒడిసిపట్టడమే ఈ ప్రాజెక్టు చేపట్టడం వెనుక ముఖ్య ఉద్దేశమని వివరించారు.ప్రాజెక్టు పూర్తైతే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుంది. మూడు దశల్లో బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. పోలవరం నుంచి కృష్ణా నదికి నీరు మళ్లించడం మొదటి దశ కాగా, రెండోదశలో బొల్లాపల్లి జలాశయం నిర్మించి నీళ్లు తరలిస్తామన్నారు.మూడోదశలో బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్లకు నీటిని మళ్లిస్తాము. గోదావరి నీటిని కృష్ణా నదికి దాని నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు తరలిస్తాము. ఈ ప్రాజెక్టు పూర్తైతే రాయలసీమ రతనాలసీమగా మారుతుంది.

పెన్నా నది ద్వారా నెల్లూరుకు నీరు ఇవ్వొచ్చు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రకాశం జిల్లాలో కరవును అరికట్టవచ్చన్నారు.వర్షపాతం ఎక్కువగా ఉన్నా నీటి కొరత ఉందని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరవు వల్ల సాగు దెబ్బతింది. సకాలంలో నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమను రతనాలసీమగా మార్చవచ్చు. గతంలో అనంతపురంలో అతి తక్కువ తలసరి ఆదాయం ఉండేది. మా ప్రభుత్వంలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడంతో తలసరి ఆదాయం 4-5 శాతానికి చేరింది. పట్టిసీమ రాకతో సకాలంలో పంట చేతికి అందుతోంది. 1970లో 371 టీఎంసీల నీరు 1994లో 5,959 టీఎంసీ నీరు 2024లో 4,114 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయిందని వివరించారు.ఈ 50 ఏళ్లలో సగటున యేడాదికి 3 వేల టీఎంసీల నీరు గోదావరి నుంచి వృధాగా సముద్రంలోకి వెళ్తోంది. ఈసారి వరుణుడు కరుణించడం, ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతగా పనిచేయడంలో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో కలిపి 983 టీఎంసీలు నీటి నిల్వ ఉందని ప్రస్తుతం రిజర్వాయర్ల నీటి సామర్థ్యం 729 టీఎంసీలుగా ఉందన్నారు. నదుల అనుసంధానం చేసి ఎక్కడికక్కడ రిజర్వాయర్లు కడితే రాష్ట్రంలో నీటి సమస్య అనేదే ఉండదన్నారు.
డెల్టాకు … రాయలసీమకు
రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు గోదావరి నీటిని బనకచర్ల కు తరలించడమే మార్గం అని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా గోదావరి వరద జలాలను తరలించడం ద్వారా రాష్ట్రానికి జలహారం కింద అన్ని ప్రాంతాల నీటి అవసరాలు తీర్చనున్నారు. పోలవరంతో పాటు కొత్త ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీళ్లిచ్చే అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఏర్పడ్డాక 6 నెలలుగా దీనిపై విస్తృత కసరత్తు చేస్తున్న ప్రభుత్వం…ప్రాజెక్టును కార్యరూపం ఇచ్చే విషయంలో కీలక అడుగులు వేస్తోంది. ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.బనకచర్ల ప్రాజెక్టు ద్వారా విస్తృత స్థాయిలో రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు, పరిశ్రమలకు మేలు జరగబోతోంది. ప్రాజెక్టు పూర్తి అయితే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందుతుంది. దీనితో పాటు 22.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. పరిశ్రమలకు దాదాపు 20 టిఎంసిల నీటిని వినియోగించవచ్చు.ఎగువున ఉన్న ప్రాజెక్టుల కారణంగా కృష్ణా నదికి తగిన విధంగా నీటి ప్రవాహాలు రావడం లేదు. మరో వైపు గోదావరి నదిలో ప్రతి ఏడాది వేల టిఎంసిల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిలో కనీసం 280 టిఎంసిల నీటిని వరద సమయంలో వినియోగించుకోవాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని కోసం రెండు మూడు రకాల ప్రతిపాదనలు సిద్దం చేశారు.

మొదట గోదావరి నీటిని కృష్ణా నదికి తరలిస్తారు. కృష్ణా నది నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తారు. 200 టిఎంసిల సమర్థ్యంతో బొల్లాపల్లిలో రిజర్వాయర్ నిర్మిస్తారు. అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు నీటికి తరలిస్తారు. బొల్లాపల్లి నుంచి బనకచర్లకు 31 కి.మీ టన్నెల్ ద్వారా నీటిని తరలిస్తారు.బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగుగంగ, SRBC, నిప్పుల వాగుకు నీళ్ళు వెళుతుంటాయి. నిప్పుల వాగు ద్వారా సోమశిల, కండలేరుకు నీటిని తరలిస్తారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని వివిధ లిఫ్టులు, కాలువల ద్వారా అన్ని ప్రాజెక్టులకు తరలిస్తారు.ఈ ప్రాజెక్టు పూర్తైతే ఎంత దుర్భర పరిస్థితులున్నా సీమ జిల్లాలకు, పెన్నా ద్వారా నెల్లూరుకు నీరు ఇవ్వొచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ కుడికాలువ ద్వారా సాగయ్యే పంటలకు కూడా సమృద్ధిగా నీటిని అందజేయవచ్చు. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కరువు ప్రాంతంగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు నీటి అసవరాలను కూడా తీర్చుతుంది. గోదావరిలో వరద సమయంలో 280 టిఎంసిల నీటిని సీమకు తరలిస్తారు.పోలవరం ప్రాజెక్టు ఎగువ నుంచి రోజుకు మూడు టిఎంసి నీటిని తరలిస్తారు. ఒక టిఎంసి నీళ్లు కృష్ణా డెల్టాకు ఇస్తారు. అంటే 280లో కనీసం 80 టిఎంసిల నీరు కృష్ణా డెల్టాకు కేటాయిస్తారు. ఈ స్థాయిలో నీటిని గోదావరి నుంచి తరలించాలంటే పోలవరం కుడికాలువ సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. పోలవరం కుడికాలువను 17 వేల క్యూసెక్కుల సామర్థ్యం నుంచి 28 వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచుతారు.అదే విధంగా తాడిపూడి లిఫ్ట్ స్కీమ్ కాలువ సామర్థ్యాన్ని కూడా 1500 క్యూసెక్కుల నుంచి 10 వేల క్యూసెక్కులకు పెంచి నీటిని తరలిస్తారు.

కేవలం గోదావరి కి వరదల సమయంలోనే నీటిని తీసుకోవడం ద్వారా.. సముద్రంలో వృధాగా పోయే నీటిని మాత్రమే తీసుకోవడం ద్వారా గోదావరి డెల్టాకు ఈ కొత్త ప్రాజెక్టు వల్ల నీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ ప్రాజెక్టు చేపట్టడం అంత సులభం కాదు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇదే పెద్ద గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ప్రాధమిక అంచనాల ప్రకారం రూ.70 వేల నుంచి రూ.80 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. 54 వేల ఎకరాల భూ సేకరణ జరపాల్సి ఉంటుంది. 4 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. పెద్ద మొత్తంలో ఫారెస్టు భూములు కూడా సేకరించాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే భారీ వ్యయం అవుతుంది.రాష్ట్ర ప్రభుత్వం ఇంత వ్యయం చేసే అవకాశం లేదు. దీంతో ఈ ప్రాజెక్టు అవసరాన్ని, ప్రయోజనాలను కేంద్రానికి వివరించిన ముఖ్యమంత్రి కేంద్ర సాయం కూడా తీసుకుని దీన్ని పూర్తి చెయ్యాలని భావిస్తున్నారు. ఈ వారంలో జరిగిన ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలతో ఈ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రాజెక్టు అవసరాన్ని వివరించి ఆర్థిక సాయం పై విన్నవించారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టుకు అనుమతులు పొంది, టెండర్ల ప్రక్రియ పూర్తి చెయ్యాలని సిఎం ఆదేశించారు.రాష్ట్ర ప్రజల అవసరాల దృష్ట్యా అత్యంత వేగంగా, ప్రాధాన్యంతో ఈ ప్రాజెక్టు పూర్తి చెయ్యాలని భావిస్తున్నామని…అందులో భాగంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని పనులు వేగంగా జరగాలని సిఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ తో పాటు ఇతర ఇరిగేషన్ శాఖ అధికారులు, సిఎంవో అధికారులు పాల్గొన్నారు.

Read:Pawan Kalyan:ఆయన సూచనతో పవన్

Related posts

Leave a Comment