Vijayawada:టీడీపీ టార్గెట్ లో మరో ఇద్దరు వైసీపీ నేతలు:కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన ఎనిమిది నెలల తర్వాత వైసీపీ కీలక నేతల అరెస్ట్ లు ప్రారంభమయ్యాయి. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఒక మర్డర్ కేసులో జైలుకు పంపారు. అదే సమయంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సయితం నెల్లూరు జైలు లో కొద్ది రోజులు ఉండి తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు.
టీడీపీ టార్గెట్ లో మరో ఇద్దరు వైసీపీ నేతలు
విజయవాడ, ఫిబ్రవరి 18
కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన ఎనిమిది నెలల తర్వాత వైసీపీ కీలక నేతల అరెస్ట్ లు ప్రారంభమయ్యాయి. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఒక మర్డర్ కేసులో జైలుకు పంపారు. అదే సమయంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సయితం నెల్లూరు జైలు లో కొద్ది రోజులు ఉండి తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. తాజాగా వల్లభనేని వంశీ అరెస్ట్ కావడంతో తర్వాత గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. కొడాలి నాని ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని అంటున్నారు. తాజాగా మరో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేరు కూడా అదే స్థాయిలో వినపడుతుండటం విశేషం.వెల్లంపల్లి శ్రీనివాస్ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసి కూటమి ప్రభుత్వం ఆగ్రహానికి గురయ్యారు. దీంతో పాటు ఆయనపై అనేక కేసులు నమోదు కావడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిసింది. మంత్రిగా ఉన్న సమయంలోనూ, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దుర్గగుడి లో జరిగిన అవినీతిపై అనేక ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించిన ఫిర్యాదుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే వెల్లంపల్లి శ్రీనివాస్ పై కేసు నమోదు చేసే అవకాశముంది. దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించడంలో ఒక బృందం బిజీగా ఉందని చెబుతున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ పై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను సిద్ధం చేస్తున్నారు.వెల్లంపల్లి శ్రీనివాస్ అనేక పార్టీలు మారారు. తొలుత ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 లో ఆయన విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచారు. అనంతరం కాంగ్రెస్ లో ప్రజారాజ్యం విలీనం చేయడంతో వెల్లంపల్లి శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరిపోయారు. తర్వాత బీజేపీలో చేరారు. అనంతరం వైసీపీలో చేరి 2019 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత జగన్ కేబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ అధికారంలోకి రాగానే పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. పవన్ కల్యాణ్ పై వ్యక్తిగతంగా విమర్శలకు దిగడంతో జనసైనికుల ఆగ్రహానికి గురయ్యారు. జగన్ ప్రాపకం సంపాదించడం కోసమే వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ రకమైన వ్యాఖ్యలు చేశారన్న టాక్ ఉంది.గన్నవరం తర్వాత గుడివాడ.. ఆ తర్వాత విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ను ప్రభుత్వం టార్గెట్ చేస్తుందన్న ప్రచారం ఉంది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మంత్రి హోదాలో కనకదుర్గ దేవాలయంలో పాల్పడిన అవకతవకలు ఆయనకు ఉచ్చు బిగియనున్నాయి. టిక్కెట్ల విషయంలోనూ, చీరల అమ్మకాల్లోనూ అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్ పై వరసగా కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని బెజవాడలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. దీనిని ప్రచారంగా మాత్రమే కొట్టిపారేయాల్సిన అవసరం లేదని, త్వరలోనే మరికొందరు నేతలు జైలు పాలు కాక తప్పదన్న టీడీపీ నేతల హెచ్చరికలు ఇందుకు అద్దం పడుతున్నాయి.
Read more:Andhra Pradesh:బలప్రదర్శనకు జనసేన