ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కసరత్తు గందరగోళంగా మారింది. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు నిర్వహించన కులగణన ఆధారంగా కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కసరత్తు చేయడం ఈ గందరగోళానికి కారణమైంది.2024 జనవరి మరియు ఫిబ్రవరి నెలలలో రాష్ట్రంలోని అన్ని కులాల సామాజిక ఆర్ధిక పరిస్థితులు తెలుసుకోడానికి అప్పటి వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లతో సర్వే చేయించింది.
ఏపీలో ఎస్సీ లెక్కల మిస్సింగ్..
విజయవాడ, జనవరి 4
ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కసరత్తు గందరగోళంగా మారింది. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు నిర్వహించన కులగణన ఆధారంగా కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కసరత్తు చేయడం ఈ గందరగోళానికి కారణమైంది.2024 జనవరి మరియు ఫిబ్రవరి నెలలలో రాష్ట్రంలోని అన్ని కులాల సామాజిక ఆర్ధిక పరిస్థితులు తెలుసుకోడానికి అప్పటి వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లతో సర్వే చేయించింది. ఈ సర్వేను వాలంటీర్లు డోర్ టు డోర్ తిరిగి చేయలేదని, వాళ్ళ పరిధిలో నివసించే వారి కుటుంబ వివరాలను వారికి తెలిసినంత వరకూ రాసుకున్నారని… ఒక మాదిరి చిన్న పట్టణాల నుండి పెద్ద పట్టణాల వరకూ అసలు ఎన్యూమరేషన్ చేయలేదని పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. అయితే ఎన్నికలు సమీపించడంతో వైసీపీ ప్రభుత్వం ఈ సర్వే వివరాలను పబ్లిష్ చేయలేదు.ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ సర్వే లోని ఎస్సీ కులాల డేటాను తీసుకుని ఫిజికల్ కాపీలను ఆయా గ్రామ వార్డు సచివాలయాల వారీగా నోటీస్ బోర్డు లో డిసెంబర్ 26, 2024 న ప్రకటించి అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 31, 2024 లోపు తెలియచేయాలని అంటే 5 రోజుల సమయం ఇచ్చారు. దీనిపై ప్రచారం మాత్రం చేయలేదు. ఈ జాబితాలు ఎందుకు ప్రకటిస్తున్నారనే విషయంలో ప్రజలకు అవగాహన కల్పించలేదు.వైసీపీ హయంలో వాలంటీర్లు నిర్వహించిన సర్వే తప్పుల తడకగా ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా దళితుల్ని పెద్ద సంఖ్యలో క్రైస్తవులుగా నమోదు చేశారని, కుటుంబాల వారీగా కులాల నమోదు చేయడంలో ఉద్దేశపూర్వకంగా తప్పు ఎంట్రీ చేశారని, ఒక కులానికి బదులు ఇంకొక కులం రాశారని అసలు చాలా చోట్ల ఎన్యూమరేషన్ చేయలేదని గ్రామ వార్డు స్థాయిల నుండి ఫిర్యాదులు అందుతున్నాయి.మరోవైపు గత ఏడాది జనవరిలో నిర్వహించిన సర్వే నివేదికలను ఆయా గ్రామ వార్డు సచివాలయాల నోటీస్ బోర్డుల్లో ఉంచారనే సంగతి 90 శాతం మందికి తెలియదు. తమ వివరాలను తనిఖీ చేసుకున్న వారిలో కూడా అత్యధికంగా తప్పుగా నమోదు చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
తమ కులం, మతం వివరాలు తప్పుగా నమోదు అయ్యాయని ఆయా గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని అడుగుతుంటే వాటిని సరిచేయడానికి డాక్యుమెంట్స్ కావాలని, రుజువులు సమర్పించాలని సతాయిస్తున్నారని జనం వాపోతున్నారు.అసలు డోర్ టు డోర్ సర్వే తాము చేయలేదని తమకు తెలిసిన వివరాలను ట్యాబ్‌లలో నమోదు చేసినట్టు వాలంటీర్లు చెబుతున్నారు. కులాల వారీగా సర్వే చేయించిన అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆ సర్వేను పబ్లిష్ చేసే సాహసం కూడా చేయలేదు. అదే సర్వేఆధారంగా ఎస్సీ కులాల జనాభాను నిర్ధారణకు రావడంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.2015 వ సంవత్సరంలో ఇదే ఎన్డీఏ ప్రభుత్వం జీఓ నెంబర్ 25 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల ఎస్సీ జనాభా లెక్కలను జిల్లాల వారీగా ప్రకటించి, ప్రభుత్వం అందిస్తున్నసంక్షేమ పథకాలను ఆయా ఎస్సీ ఉపకులాల జనాభా ప్రకారం అందించాలని నిర్ణయించింది. 2011 జనాభా లెక్కలను దీనికి ప్రాతిపదికగా తీసుకున్నారు.కుల గణన, అందులోనూ ఎస్సీల కుల గణన క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఆధారంగా చట్ట ప్రకారం సూచించబడిన అధీకృత సంస్థతో, నిర్దేశించిన విధివిధానాలతో, మల్టీ లెవెల్ క్రాస్ వెరిఫికేషన్ చేసి అభ్యంతరాలను స్వీకరించి, వైడ్ పబ్లిసిటీ ద్వారా అందరిలో అవగాహన కల్పించి చేయాల్సిన ప్రక్రియను చట్టబద్దత లేని వాలంటీర్లతో నిర్వహించడం, ఎస్సీల జనాభా సంఖ్యను నిర్దేశించడానికి వాడటంపై అభ్యతంరాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ సర్వే గణంకాలపై అభ్యంతరాలు స్వీకరిస్తున్నారనే సమాచారం కూడా ప్రజలకు లేకపోవడాన్ని అయా వర్గాల ప్రజలు తప్పు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జనాభా సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచడం, ప్రతి ఇంటిలో జనాభా వివరాలు మ్యాపింగ్‌లో నమోదై ఉండటంతో ప్రతి ఒక్కరికి ఆన్‌లైన్‌లో వాటిని స్వయంగా తనిఖీ చేసుకునే సదుపాయం కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది.