ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శ్రీ సేవలపై ఏపీ ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధం అవుతోంది. ఆరోగ్య శ్రీ బాధ్యతల్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. వేల కోట్లు ఖర్చు చేస్తున్నా ఆరోగ్యశ్రీ సేవలపై ప్రజల్లో సంతృప్తి లేని తరుణంలో ప్రభుత్వ నిర్ణయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శ్రీ సేవలు ఎక్కడ మొదలయ్యాయే తిరిగి అక్కడకే చేరబోతున్నాయి. సరిగ్గా 20ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలు అనివార్యంగా కొనసాగిస్తున్నాయి.
ఆరోగ్యసేవలో కీలక మార్పులు
విజయవాడ, డిసెంబర్ 30
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శ్రీ సేవలపై ఏపీ ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధం అవుతోంది. ఆరోగ్య శ్రీ బాధ్యతల్ని ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. వేల కోట్లు ఖర్చు చేస్తున్నా ఆరోగ్యశ్రీ సేవలపై ప్రజల్లో సంతృప్తి లేని తరుణంలో ప్రభుత్వ నిర్ణయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శ్రీ సేవలు ఎక్కడ మొదలయ్యాయే తిరిగి అక్కడకే చేరబోతున్నాయి. సరిగ్గా 20ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయడంలో కీలక పాత్ర పోషించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలు అనివార్యంగా కొనసాగిస్తున్నాయి. దేశంలో ప్రజారోగ్య వ్యవస్థలో కీలక మార్పులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య శ్రీ పథకమే నాంది పలికింది. 108 సేవలు, ఆరోగ్యశ్రీలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేదలకు శస్త్ర చికిత్సలు వైఎస్సార్ అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేశాయి.వైఎస్సార్ హయంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించినపుడు ఆ పథకం నోడల్ ఏజెన్సీగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ బాధ్యతలు నిర్వహించేది. ఇన్సూరెన్స్ కంపెనీల నిర్వహణలో సహజంగా ఉండే అవరోధాలు, నిబంధనలు, వ్యాపార ధృక్పథం, లాభాపేక్ష వంటి కారణాలతో తర్వాతి కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలే సొంత ఆరోగ్య శ్రీ పథకాన్ని అనివార్యంగా కొనసాగించాల్సి వచ్చింది. ఈ 20ఏళ్లలో ఆరోగ్య శ్రీ పథకాన్ని రద్దు చేస్తామనే సాహసం కూడా ఏ పార్టీ చేయలేకపోయాయి.ఆరోగ్య శ్రీ పథకం పేద ప్రజలకు ఎంత మేలు చేసిందో ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా అంతే లబ్ది చేకూర్చిందనే విమర్శలు లేకపోలేదు. వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించి కేవలం ప్రైవేట్ ఆస్పత్రులకు లబ్ది చేకూర్చడానికే ఈ పథకాన్ని కొనసాగించారనే ఆరోపణలు ఉన్నాయి. పేదరికం,అర్హతల పని లేకుండా ఇబ్బడిముబ్బడిగా తెల్ల రేషన్ కార్డులు పెరిగిపోవడానికి కూడా ఈపథకం కారణమైంది. ఉమ్మడి ఏపీలో విఫలమైన ఇన్సూరెన్స్ కంపెనీలను మళ్లీ ఆరోగ్య శ్రీలో తెరపైకి తీసుకురావడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఆరోగ్య శ్రీ పథకం ఒకప్పుడు ఇన్సూరెన్స్‌లతోనే మొదలైంది. కానీ దానిని విధిలేని పరిస్థితుల్లో వదిలేయాల్సి వచ్చింది. ఇన్సూరెన్స్ కంపెనీలలో కనీసం 50శాతం క్లెయిమ్‌లను రిజెక్ట్ చేయడమే ప్రభుత్వం నేరుగా ఆరోగ్య శ్రీ సేవల్ని నిర్వహించడానికి ప్రధాన కారణం. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీల నిర్వహణలో ఎంత మేరకు క్లెయిమ్‌లను సెటిల్ చేస్తారనే సందేహాలు కూడా లేకపోలేదు.గతంలో ఇన్సూరెన్స్ అమోదం లభించకపోతే అప్పుడు సిఎంఆర్‌ఎఫ్ నుంచి బిల్లుల్ని చెల్లించాల్సి వచ్చేది.
ఓ వైపు ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లింపులు జరుపుతూ మరోవైపు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం చేయాల్సి రావడంతో చివరకు ప్రభుత్వమే నేరుగా సొంత ఖర్చులతో ఆరోగ్యశ్రీ సేవల్ని అందించడం ప్రారంభించింది. ఓ విధంగా ఆరోగ్య శ్రీ రూపంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వమే హెల్త్ ఇన్సూరెన్స్ సేవల్ని నేరుగా అందిస్తోంది.ప్రస్తుతం నలుగురు కుటుంబ సభ్యులున్న కుటుంబానికి రెండున్నర లక్షల ఆరోగ్య బీమా కావాలంటే కనీసం రూ.20వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు కోటి 47లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అంతే సంఖ్యలో ఆరోగ్య శ్రీ కార్డులన్నాయి. జనాభాల్లో 85శాతం మందికి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా లభిస్తోంది. కేవలం పన్ను చెల్లింపుదారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఈ సదుపాయం దక్కడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్ సేవలు అందుతుండగా ప్రైవేట్ రంగంలోని పన్ను చెల్లింపుదారులకు ఆ రక్షణ కూడా లేదు. ఈ క్రమంలో ఇటీవల ఆరోగ్య శాఖ ఆరోగ్య శ్రీ సేవల్ని ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టాలనే ప్రతిపాదన వచ్చింది. దీని వెనుక ఏం జరిగిందో స్పష్టత లేకపోయినా అడుగులు మాత్రం వేగంగా పడ్డాయి.ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఏపీలో 1.43 కోట్ల కుటుంబాలకు చెందిన 4.30 కోట్లమందికి ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవలో 3,257 రకాల జబ్బులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల మేర హెల్త్ కవరేజ్ లభిస్తోంది.ఆరోగ్య శ్రీ ట్రస్ట్ పద్దతిలో ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం నిర్వహిస్తుండగా….ఈ కార్యక్రమాన్ని బీమా విధానంలో తీసుకొచ్చే అంశంపై శనివారం వైద్య శాఖ సమీక్షలో సీఎంతో చర్చించారు. ఆరోగ్య బీమా విధానం వల్ల మరింత మెరుగ్గా, నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రికి వైద్యశాఖ అధికారులు వివరించారు. బీమా క్లెయిమ్‌ల విషయంలో ఏ మేరకు అమోదం లభిస్తుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా విభజించి త్వరలో బీమా విధానాన్ని ప్రారంభిచనున్నారు. పబ్లిక్ సెక్టార్, ప్రైవేటు సెక్టార్‌లో ఉన్న బీమా కంపెనీల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ లబ్దిదారులు అందరికీ ఈ సేవలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధానాలను కూడా పరిశీలించి అధికారులు చేసిన ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.