సీజ్ ద షిప్ డ్రామా ముగిసింది. రేషన్ బియ్యం పట్టుబడిన స్టెల్లా నౌక కాకినాడ పోర్టు విడిచిపోయింది. రేషన్ బియ్యం అక్రమాలు మాత్రం ఆగలేదు. కొద్ది నెలల క్రితం చోటు చేసుకున్న హంగామాతో రేషన్ బియ్యం ధర మాత్రం కిలోకు రెండు రుపాయలు పెరిగింది ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డు కట్ట వేస్తామంటూ చేసిన హంగామా ప్రకటనలకే పరిమితం అయ్యింది.
ఆగని రేషన్ బియ్యం దందా
విజయవాడ, జనవరి 8
సీజ్ ద షిప్ డ్రామా ముగిసింది. రేషన్ బియ్యం పట్టుబడిన స్టెల్లా నౌక కాకినాడ పోర్టు విడిచిపోయింది. రేషన్ బియ్యం అక్రమాలు మాత్రం ఆగలేదు. కొద్ది నెలల క్రితం చోటు చేసుకున్న హంగామాతో రేషన్ బియ్యం ధర మాత్రం కిలోకు రెండు రుపాయలు పెరిగింది ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డు కట్ట వేస్తామంటూ చేసిన హంగామా ప్రకటనలకే పరిమితం అయ్యింది. ఊరురా రేషన్ బియ్యం అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పోర్టుల్లో తనిఖీలు, మిల్లుల్లో సోదాలతో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌కు అడ్డు కట్ట పడుతుందని భావించినా అందుకు భిన్నంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఉంది. గతంలో దొంగచాటుగా సాగిన వ్యవహారం ఇప్పుడు బహిరంగంగానే సాగుతోంది. ఊరురా మొబైల్ డెలివరీ యూనిట్లలోనే బియ్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. గతంలో సివిల్ సప్లైస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తారనే భయం కాస్తో కూస్తో ఉండేది. ప్రస్తుతం ఆ భయం కూడా పోయింది.ఏపీలో మూడు నెలల క్రితం రేషన్ బియ్యం అక్రమ తరలింపు వ్యవహారాలపై జరిగిన హంగామాతో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం వ్యాపారానికి అడ్డుకట్ట పడుతుందని భావించారు. కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ ఎపిసోడ్‌తో ఈ దందాకు అడ్డుకట్ట పడినట్టే అనుకున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా తనిఖీలు చేసిన స్టెల్లా నౌకకు సైతం కస్టమ్స్ క్లియరెన్స్ లభించడంతో సోమవారం బయల్దేరి వెళ్లిపోయింది.రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ బియ్యం వ్యాపారాల సిండికేట్లు చేతులు మారినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రతి జిల్లాలో మండలాల వారీగా రేషన్ దుకాణాలను నడిపించే అక్రమ సిండికేట్లలో కొత్త ముఖాలు ప్రవేశించాయి. ఇప్పటి వరకు ఈ తరహా దందాలు నడిపిన వ్యక్తుల చేతుల్లోంచి కొత్త వ్యక్తులు వాటిని దక్కించుకున్నారు. ప్రతి మండలంలో ఉన్న రేషన్ దుకాణాలను అధికార పార్టీల నేతల అనుచరులు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ప్రభుత్వం పేదల కోసం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం తినడానికి వినియోగించే సన్న రకాలు కాకపోవడంతో రేషన్ బియ్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ లెక్కల ప్రకారం కోటి 55లక్షల కుటుంబాలు ఉంటే అందులో కోటి 48లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి నెలకు 5 కేజీల చొప్పున బియ్యం పంపిణీ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న కార్డులకు బియ్యం పంపిణీ కోసం ఏటా 30లక్షల టన్నుల బియ్యం అవసరం అవుతున్నాయి. వీటిలో 80శాతానికి పైగా పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వం ఒక్కో కిలో బియ్యం సేకరించి కార్డులకు అందించడానికి రూ.43.50ఖర్చు చేస్తుంటే ఆ బియ్యాన్ని రూ.10-12కు అమ్మేస్తున్నారు. రాష్ట్రంలో రేషన్ బియ్యం హడావుడి మొదలయ్యాక ఆ ధర రూ.2మేరకు పెంచి కొనుగోలు చేస్తున్నారు.ప్రస్తుతం ఏపీలో కోటి 48లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నవాయి. వీటిలో 92లక్షల కార్డులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రేషన్ అందుతోంది. మరో 56లక్షల కార్డుల్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. రేషన్ కార్డులకు అందించే బియ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.5700కోట్లను వెచ్చిస్తోంది. కేంద్రం ఇచ్చే వాటాతో కలిపితే అది రూ.13వేల కోట్లకు చేరువలో ఉంటుంది. రేషన్ కార్డులతోనే ఆరోగ్యశ్రీ, ఫీజు రియింబర్స్‌మెంట‌్, డిబిటి పథకాలను ముడిపెట్టడంతో ఏదో ఒక మార్గంలో రేషన్ కార్డును దక్కించుకుకుంటున్నారు.చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం అందించే బియ్యాన్ని 90శాతం మంది ఆహారంగా వినియోగించడం లేదు. ప్రభుత్వం బోనస్ కలిపి రైతుల నుంచి కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని పేదలకు ఆహారంగా సరఫరా చేస్తోంది. ఇలా కిలోకు రూ.43.50 ఖర్చవుతోంది. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే వారికి 20కిలోల బియ్యం ప్రభుత్వం రైస్ కార్డుపై ఇస్తోంది. అంటే నెలకు ఒక్కో కుటుంబానికి రూ.870 ఖరీదైన బియ్యం అందుతోంది.
అదే బియ్యాన్ని కార్డు దారుడు తీసుకోకుండా రేషన్ దుకాణాలు, మొబైల్ వాహనాలకే వదిలేస్తే కిలోకు రూ.10-12 కార్డుదారుడికి చెల్లిస్తున్నారు. కార్డులో నలుగురు సభ్యులు ఉంటే బియ్యంకు బదులుగా రూ.200 వారికి ఇస్తున్నారు.ఏడాదికి సగటున రూ.10,440 విలువైన బియ్యాన్ని రూ.2400కు అమ్మేసుకుంటున్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి నెల 3,24, 797 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ కార్డులకు చెల్లిస్తున్నారు. ఇందులో బీపీఎల్ కార్డులు, ఏపిఎల్ కార్డులు, అంత్యోదయ అన్న యోజన కార్డులు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, మిడ్ డే మీల్స్, అన్నపూర్ణ స్కీమ్, అదనపు ఏపిఎల్ కార్డులు ఉన్నాయి. మొత్తం 3.24లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో 80శాతం పైగా తిరిగి బ్లాక్ మార్కెట్లకే వెళుతోంది. ఏడాదికి రూ.25లక్షల టన్నుల బియ్యం ఇలా పోర్టుల నుంచి తరలిపోతోంది. దీని ద్వారా నేతలు కళ్లు చెదిరేలా సంపాదిస్తున్నారు.రేషన్ కార్డు దారుల నుంచి రూ.10కు కొనుగోలు చేసే బియ్యాన్ని దళారులు రూ.16-18కు మండల, జిల్లా స్థాయి విక్రేతకు అందిస్తారు. ప్రతి జిల్లాలో రేషన్ బియ్యం మాఫియాను నియంత్రించే నాయకులు ఉన్నారు. రేషన్ వాహనాలు, దుకాణాల నుంచి బియ్యాన్ని నేరుగా వీరికి అందిస్తారు. ఒక్కో మండలంలో నెలకు సగటున 250-300 మెట్రిక్ టన్నుల బియ్యం బ్లాక్ మార్కెట్లకు తరలిపోతోంది. ప్రతి నెల రెండున్నర లక్షల కిలోల నుంచి 3లక్షల కిలోల బియ్యాన్ని రేషన్ మాఫియా సొమ్ము చేసుకుంటుంది.జిల్లా స్థాయి మాఫియా నుంచి మద్యం తయారీ దారులు, ఎగుమతి దారులకు చేరే సరికి దాని ధర గరిష్టంగా రూ.36-38కు చేరుతోంది. రేషన్ కార్డుదారుడికి రూ.10 దక్కితే అదే బియ్యం మీద దళారులు కిలోకు రూ.26-28వరకు సంపాదిస్తున్నారు. ఫలితంగా అన్ని రాజకీయ పార్టీలకు రేషన్ బియ్యం మిఠాయిలా మారింది.ప్రభుత్వం మారిన వెంటనే రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులపై ఉక్కుపాదం మోపుతామని ప్రకటించింది. వాస్తవానికి రేషన్ దుకాణాలు, బియ్యం తరలింపు దందా మాత్రమే చేతులు మారింది. గత ఆర్నెల్లలో గతంలో ఉన్న వారి స్థానంలో కొత్త దళారులు పుట్టుకొచ్చారు.ఒక్కో రేషన్ దుకాణంలో ప్రతి నెల లక్షల రుపాయలు ఆదాయం కనిపిస్తుండటంతో చోట మోట నాయకులు తమ ప్రాంతంలో రేషన్ దందా కోసం ముఖ్యమైన నేతల్ని ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ డెలివరీ యూనిట్లతో బియ్యం రవాణా చేస్తుండటంతో బ్లాక్ మార్కెటింగ్ యథేచ్ఛగా సాగుతోంది.
Read:Jupalli Krishna Rao:రహదారి భద్రత మాసోత్సవాల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు