Vamsi Gayab.. | వంశీ గాయాబ్.. | Eeroju news

Vamsi Gayab..

వంశీ గాయాబ్..

విజయవాడ, జూలై 13, (న్యూస్ పల్స్)

Vamsi Gayab..

టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి నెల రోజులు పూర్తవుతోంది. ఈ నెల రోజులు ప్రభుత్వ పాలనపై దృష్టి పెట్టిన ప్రభుత్వ పెద్దలు… ఇప్పుడు యాక్షన్‌లోకి దిగుతున్నట్లే కనిపిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి, టీడీపీ కేంద్ర కార్యాలయం, గన్నవరం టీడీపీ ఆఫీసుల్లో విధ్వంసానికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు పలువురు నిందితులను అరెస్ట్ చేయించింది. ఈ క్రమంలోనే వైసీపీ ఫైర్‌బ్రాండ్‌ లీడర్‌ వల్లభనేని వంశీ అరెస్ట్ తప్పదంటూ ప్రచారం జరుగుతోంది. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై అల్లరి మూకల దాడి కేసులో వంశీని నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశారు.

మాజీ ఎమ్మెల్యే వంశీని కూడా అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రెండుసార్లు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ… 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి వైసీపీలో చేరారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఐతే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన వంశీ… వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ శ్రేణులను టార్గెట్‌గా చేసుకుని రాజకీయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రోద్బలంతోనే గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయన అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో చంద్రబాబు ఇంటిపై దాడి, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిపై ఆరోపణల్లో ఎదుర్కొంటున్న ఇతర వైసీపీ నేతలకు హైకోర్టులో ముందస్తు బెయిల్‌ లభించింది.

ఆయా కేసుల్లో నిందుతులైన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్‌ తదితర వైసీపీ నేతలను ఈ నెల 16 వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు సూచించింది. కానీ, గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వల్లభనేని వంశీకి ఎలాంటి ఉపశమనం లభించలేదు. దీంతో ఆయన అరెస్టు తప్పదనే ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యే వంశీ ఆచూకీ తెలియడం లేదు. ఆయన ఎక్కడున్నారనే విషయం ఎవరికీ తెలియకుండా గోప్యంగా వ్యవహరిస్తున్నారు. జూన్‌ 4న ఫలితాలు వస్తే ఆ మరునాడే వంశీ ఇంటిపై దాడి జరిగింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న వంశీ బయటకు కూడా రాలేదు.

ఇక జూన్‌ 7న ఒకసారి బయటకు వచ్చిన వంశీ, ఆ తర్వాత ఎవరికీ కనిపించలేదు. ఆయన అమెరికా వెళ్లారా? హైదరాబాద్‌లో ఉన్నారా? అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న వంశీ, అమెరికాలో వ్యాపారవేత్తగా స్థిరపడాలని భావించారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఎన్నికల పోలింగ్‌, కౌంటింగ్‌ మధ్యలో ఓసారి అమెరికా కూడా వెళ్లొచ్చారు. దీంతో ఆయన అమెరికా వెళ్లిపోయి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఐతే వీసా ప్రక్రియ అంత త్వరగా పూర్తయ్యే అవకాశం లేనందున ఆయన హైదరాబాద్‌లోనే ఉండి వుంటారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఎట్టి పరిస్థితుల్లోనూ మాజీ ఎమ్మెల్యే వంశీపై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం పట్టుదలగా ఉండటంతో…. ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఐతే పోలీసులు తనను అరెస్టు చేయకుండా కాపాడాలని మాజీ ఎమ్మెల్యే వంశీ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందంటున్నారు. గన్నవరం కేసులో తొలుత వంశీ పేరు లేకపోవడంతో ఆయన కోర్టుకు వెళ్లలేదని అంటున్నారు వంశీ అనుచరులు. ఐతే పోలీసులు అనూహ్యంగా గన్నవరం దాడి కేసులో 71వ నిందితుడిగా వంశీ పేరును చేర్చడంతో అంతా ఉలిక్కిపడ్డారు.

 

Vamsi Gayab..

 

 

కుప్పకూలుతున్న కొడాలి సామ్రాజ్యం | The Collapsing Kodali Empire | Eeroju news

Related posts

Leave a Comment