Valmiki Research Center | విజయనగరంలో వాల్మికీ రీసెర్చి సెంటర్ | Eeroju news

విజయనగరంలో వాల్మికీ రీసెర్చి సెంటర్

విజయనగరంలో వాల్మికీ రీసెర్చి సెంటర్

విజయనగరం, సెప్టెంబర్ 26, (న్యూస్ పల్స్)

Valmiki Research Center

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా విజయనగరం జిల్లాలో మొట్టమొదటి వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం కానుంది. ఈనెల 27న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఈ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలిచే రామనారాయణంలో ఏర్పాటు చేస్తున్న వాల్మీకి రిసెర్చ్ సెంటర్‌ను జాతీయ సంస్కృత యూనివర్శిటి తో అనుసంధానం చేశారు నిర్వాహకులు. ఈ వాల్మీకి రిసెర్చ్ సెంటర్ టిటిడి సంస్కృత యూనివర్శిటి పర్యవేక్షణలో సాగుతుంది. ఇక్కడ టిటిడి సంస్కృత యూనివర్శిటికి చెందిన అధ్యాపకులు నిరంతరం అందుబాటులో ఉంటారు.

ఈ రీసెర్చ్ సెంటర్ లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతంకు చెందిన నాలుగు భాషల రామాయణ గ్రంధాలు, రచనలు, పాఠ్యపుస్తకాలతో పాటు శ్రీరామునికి చెందిన ఇతర పుస్తకాలు కూడా అందుబాటులో ఉంటాయి. దేశవిదేశాల్లో రామాయణం పై అధ్యయనం చేసే ఆసక్తి ఉన్నవారెవరైనా ఇక్కడ రీసెర్చ్ చేయవచ్చు. రామాయణంలోని నైతిక విలువలతో కూడిన పలురకాల శ్రీరాముని రూపాలు ఇక్కడ రీసెర్చ్ చేసే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నాయి. రామాయణంపై అనేక మంది అనేక రకాల రామాయణాలు రచించినప్పటికీ వాల్మీకి రామాయణం ప్రధానమైనది. కాగా ఇప్పటివరకు వాల్మీకి రామాయణం పై అధ్యయనం చేసేందుకు ఎక్కడ కూడా రిసెర్చ్ సెంటర్ లేదు.

అయితే ఇప్పుడు విజయనగరం రామనారాయణం లో వాల్మీకి రిసెర్చ్ సెంటర్ ప్రారంభం కానుండటంతో రామభక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అధ్యయనం చేసే విద్యార్థులకు రామనారాయణంలోనే ప్రత్యేకమైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ధనస్సు ఆకారంలో నిర్మితమైన రామనారాయణంను ఉత్తరాంధ్ర అయోధ్యగా పిలుస్తారు. రామనారాయణంలో భావితరాలకు నైతిక విలువలు అందించేలా రామాయణంలోని పలు ఘట్టాలను రూపొందించి అందుబాటులో ఉంచారు. రామనారాయణంలోని అపురూప ఘట్టాలను, లేజర్ షో ను నిత్యం వేలాది మంది భక్తులు తరలివచ్చి తిలకిస్తుంటారు. రామనారాయణంలో ఇప్పటికే టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న వేద పాఠశాల కూడా ఉంది.

ఇప్పుడు రిసెర్చ్ సెంటర్ తో రామనారాయణ ప్రాముఖ్యత మరింత పెరగనుంది.వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ప్రారంభం సందర్భంగా ఈ నెల 27, 28, 29వ తేదీల్లో రామాయణం పై నాలుగు భాషల్లో మహా సదస్సు కూడా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి జరగనుంది. ఈ మహా సదస్సుకు దేశ విదేశాల్లోనే ప్రముఖ పండితులు, పీఠాధిపతులు తరలివచ్చి శ్రీరామునికి సంబంధించి పలు అంశాలపై చర్చిస్తారు. భారీగా జరగనున్న ఈ కార్యక్రమానికి వైదిక్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు తరలిరానున్నారు.

శ్రీరాముని జీవిత చరిత్రను థీమ్ పార్క్ రూపంలో రూపొందించి భావితరాలకు నైతిక విలువలను అందించాలని దృక్పథంతో నారాయణం నరసింహమూర్తి ఈ రామనారాయణంను ప్రారంభించారు.ప్రస్తుతం వాల్మీకి రిసెర్చ్ సెంటర్ రామనారాయణంలో ప్రారంభించడం తమ అదృష్టమని, భవిష్యత్తులో మరిన్ని శ్రీరామునికి సంబంధించిన విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శ్రీకారం చుడతామని రామనారాయణం సిఇవో నారాయణం నీరజాశ్రీనివాస్ పేర్కొన్నారు.

 

విజయనగరంలో వాల్మికీ రీసెర్చి సెంటర్

 

విజయనగరంలో సగం మంది మహిళా నేతలే | In Vizianagaram half of the leaders are women | Eeroju news

Related posts

Leave a Comment