ఆగని విగ్రహ వివాదం
హైదరాబాద్, ఆగస్టు 21, (న్యూస్ పల్స్)
Unstoppable idol controversy revanthreddy and KTR
తెలంగాణలో మరో రాజకీయ వివాదం రాజుకుంటోంది. అధికార, విపక్షాల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతో రోజురోజుకూ వేడెక్కుతోన్న రాజకీయంలో ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎంటరయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన గుర్తులు చేరిపేసేలా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా, రేవంత్ సర్కార్ మాత్రం తాను చెప్పిందే శాసనం అన్నట్లు దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇంతకీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య తాజా వివాదమేంటి? ఈ వివాదానికి రాజీవ్ గాంధీకి సంబంధం ఏంటి?తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయం వాడివేడిగా సాగుతోంది. నిత్యం ఏదో అంశంపై ఇరుపార్టీలు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నాయి.
రైతు రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణంపై కొద్దిరోజులుగా మాటల యుద్ధం జరుగుతుండగా, ఇప్పుడు మరో కొత్త అంశం తెరపైకి వచ్చిందిసెక్రటేరియట్ ఎదుట మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించాలనే కాంగ్రెస్ ప్రతిపాదనే ఇప్పుడు ఇరు పార్టీల మధ్య చిచ్చు రాజేసింది. సచివాలయంలో తెలంగాణా తల్లి విగ్రహం ఏర్పాటు కోసం అప్పటి బిఆర్ఎస్ సర్కార్ స్థలం కేటాయించింది. అయితే ఇప్పుడు అదే స్థలంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్టించేందుకు కాంగ్రెస్ సిద్దం అవుతుండటం అగ్గి రాజేస్తోంది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిన్నచిన్న అంశాలపైనా పెద్ద వివాదం కొనసాగుతోందంటున్నారు పరిశీలకులు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన గుర్తులను చెరిపేసేలా కాంగ్రెస్ అడుగులు వేయడం వల్లే ఇలాంటి వివాదాలు వస్తున్నాయని గులాబీదళం గుర్రుగా ఉంది.
సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణం చేసిన తర్వాత రాష్ట్రం పేరును సూచించే టీఎస్‌ను… టీజీగా మార్చారు. దీనిపై ఇటు కాంగ్రెస్; అటు బీఆర్ఎస్ల్లో విస్తృత చర్చ జరిగింది. చివరికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టుదలే నెగ్గింది. ఇక ఆ తర్వాత రాష్ట్ర చిహ్నం మార్పుపైనా విస్తృత చర్చ జరిగింది. కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను రాష్ట్ర చిహ్నంలో తొలగిస్తామని స్వయంగా సీఎం రేవంతే ప్రకటించారు. అయితే కాకతీయ తోరణం తొలిగించడంపై వరంగల్ జిల్లా నేతల నుంచి… చార్మినార్‌ను తీసేయడంపై ఎంఐఎం నుంచి ఒత్తిడి వచ్చింది. అటు బీఆర్ఎస్ కూడా ఈ అంశాన్ని కోర్టులోనే తేల్చుకుంటామంటూ ప్రకటించింది. దీంతో వెనక్కి తగ్గిన సర్కార్ ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.
ఇక ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించడం, ఇందుకోసం గతంలో కేసీఆర్ సర్కార్ తెలంగాణ తల్లి విగ్రహానికి కేటాయించిన స్థలాన్ని ఎంచుకోవడమే వివాదమవుతోంది. తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన భావోద్వేగాన్ని రగిల్చితే ఫలితం ఎలా ఉంటుందోనని టెన్షన్ కాంగ్రెస్‌లోనూ కనిపిస్తోంది. కానీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ఎలాగైనా రాజీవ్ విగ్రహ ప్రతిష్ఠించాలనే నిర్ణయానికే కట్టుబడినట్లు చెబుతున్నారుఐతే మాజీ ప్రధాని విగ్రహం ఏర్పాటుపై రాష్ట్రంలో ఇతర పార్టీలతో సంప్రదించి.. ఏకాభిప్రాయం వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తే బాగుండేదని వాదన వినిపిస్తోంది. కానీ, ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతోనే బీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. తాము అధికారంలోకి వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని తొలగించి.. తెలంగాణా తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ప్రకటన కాక పుట్టిస్తోంది.
Revanth fires on KTR’s comments | కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ ఫైర్ | Eeroju news