16 నుంచి ధనర్మాసం….సుప్రభాత సేవకు బదులు తిరుప్పావై
తిరుమల, డిసెంబర్ 12, (న్యూస్ పల్స్)
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 16వ తేదీన ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఆరోజు ఉదయం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభమవుతాయని పేర్కొంది.ధనుర్మాస ఘడియాల నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారని టీటీడీ తాజా ప్రకటనలో వెల్లడించింది.. కాగా జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి.ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతి రోజూ స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోశ, బెల్లం దోశ, సుండలు, సీరా, పొంగల్ వంటి ప్రసాదాలను నివేదిస్తారని టీటీడీ తెలిపింది.పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు.ఆళ్వార్ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.
12న తిరుమలలో చక్రతీర్థ ముక్కోటి:
తిరుమలలో జరిగే ఉత్సవాల్లో అత్యంత ప్రముఖమైన చక్రతీర్థ ముక్కోటి ఈనెల 12వ తేదీన ఘనంగా జరుగనుంది. పౌరాణిక నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసివున్న శేషగిరులమీద దక్షిణభాగంలో కొన్ని మైళ్ల దూరంలో మహా పవిత్రతీర్థమగు చక్ర తీర్థం వెలసివుంది. ప్రతి ఏడాది కార్తీక మాసం శుద్ధద్వాదశినాడు ఈ చక్రతీర్థ ముక్కోటి తిరుమలలో జరుగుతుంది.ఆరోజున స్వామివారికి ప్రాతఃకాల, మధ్యాహ్న ఆరాధనలు పూర్తి చేశారు. ఆ తరువాత అర్చకులు, పరిచారకులు, ఉద్యోగులు, భక్తులు, యాత్రికులు మంగళవాయద్యాలతో స్వామివారు ఆలయం నుండి ఊరేగింపుగా చక్రతీర్థానికి వెళతారు. చక్రతీర్థంలో వెలసివున్న శ్రీ చక్రత్తాళ్వారు వారికి, నరసింహస్వామివారికి, ఆంజనేయస్వామివారికి అభిషేకం, పుష్పాలంకారం, ఆరాధన చేస్తారు. హారతి నివేదించిన అనంతరం తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.వరాహ పూరాణ నేపథ్యంలో తిరుమలలోని శేషగిరులలో వెలసివున్న 66కోట్ల తీర్థాలలో అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడే సప్త తీర్థాలలో చక్రతీర్థము కూడా ఒకటిగా భాసిల్లుతోంది.