The Paper Leakage Act came into force | అమల్లోకి వచ్చిన పేపర్ లీకేజ్ యాక్ట్ | Eeroju news

The Paper Leakage Act came into force

అమల్లోకి వచ్చిన పేపర్ లీకేజ్ యాక్ట్

న్యూఢిల్లీ, జూన్ 22, (న్యూస్ పల్స్)

The Paper Leakage Act came into force :

వరుస పేపర్ లీకులతో సతమవుతున్న కేంద్రం ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. పేపరు లీకేజీలకు కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకుగాను యుద్ధప్రాతిపదికన ‘ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్)యాక్ట్-2024ను అమల్లోకి తీసుకొచ్చింది. ఇది జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోందని, త్వరలో నోటిఫై చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ జూన్ 20న ఒక ప్రకటనలో తెలిపారు.

ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోపే కేంద్ర సిబ్బంది, వ్యవహారాలశాఖ ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశపరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు.

పేపరు లీక్ చేసేవాళ్లకు 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలుశిక్షతోపాటు రూ.కోటి వరకు జరిమానా విధించే వెసుబాటు ఉంది. ఇందులో భాగస్వాములు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే.. వారి ఆస్తులనూ జప్తు చేస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునూ వారినుంచే వసూలు చేస్తారు. ఈ కొత్త చట్టం ప్రకారం పేపర్‌ లీకేజీకి పాల్పడినా, మాల్‌ ప్రాక్టీస్‌ చేసినా, నకిలీ వెబ్‌సైట్లు తెరిచినా గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌, ఎన్‌డీఏ తదితర పోటీ పరీక్షలతో పాటు నీట్‌, జేఈఈ, సీయూఈటీ వంటి ఎంట్రన్స్‌ టెస్టులకు సైతం చట్టం వర్తించనుంది. పేపర్ లీక్ కేసుల్లో దోషులుగా తేలే వారికి కనీసం మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే పేపర్ లీక్ వ్యవహారాల్లో వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వారికి ఐదు నుంచి పదేళ్ల జైలుశిక్ష విధించాలని బిల్లులో పెట్టారు. విద్యార్థులు, ఉద్యోగార్థుల  భవిష్యత్‌తో ఆడుకోవడమే కాబట్టి.. ఇలాంటి నేరాలు చేసే వారికి  భవిష్యత్ లేకుండా చేసేలా శిక్షలు ఉంటాయి.

పరీక్షల నిర్వహణ బాధ్యతలను చేపట్టే సర్వీస్ ప్రొవైడర్ సంస్థలు పేపర్ లీక్ చేసినట్లు తేలితే వాటికి రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు. పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చునంతా సంస్థ నుంచి రికవర్ చేయాలనే ప్రతిపాదనను కూడా ఈ బిల్లులో పొందుపరిచారు. ఇలాంటి సంస్థపై పరీక్షలు నిర్వహించకుండా నాలుగేళ్ల పాటు బ్యాన్‌ను కూడా విధిస్తారు. పేపర్ లీక్ కేసుల విచారణను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ స్థాయి కంటే తక్కువ లేని అధికారి నిర్వహించాల్సి ఉంటుంది.

దర్యాప్తును ఏదైనా కేంద్ర ఏజెన్సీకి అప్పగించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.  ఈ బిల్లులో పేపర్ లీక్‌తో ముడిపడిన 20 రకాల నేరాలు, అక్రమాలకు పాల్పడే వారికి విధించాల్సిన శిక్షల గురించి ప్రస్తావించారు. మాస్ కాపీయింగ్, జవాబు పత్రాలను తారుమారు చేయడం, ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్ చేయడం వంటివన్నీ ఈ నేరాల జాబితాలో ఉన్నాయి.

The Paper Leakage Act came into force

 

రాత పరీక్షా లేకుండానే ఉద్యోగాలు ఇవ్వాలి | Jobs should be given without written test | Eeroju news

 

Related posts

Leave a Comment