హాట్ టాపిక్ గా మారిన సోషల్ ఇంజనీరింగ్
హైదరాబాద్, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్)
తెలంగాణలో సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ కారణాలుగా చెప్పవచ్చు. తమ వర్గాల జనాభా లెక్కల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రజల కోరిన మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించింది. ఇటీవల సర్వే గణాంకాలను వెల్లడించింది.ప్రభుత్వ కులగణన లెక్కల ప్రకారం… తెలంగాణలో బీసీలు 56.33%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 13.31% ఉన్నారు. ఏక సభ్య ఎస్సీ కమిషన్ ప్రకారం… ఎస్సీల్లోని 59 కులాలను మూడు గ్రూపులుగా విభజించి 15% రిజర్వేషన్లు ప్రకటించారు. ఈ సర్వే లెక్కలు తప్పంటూ విపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు కొట్టిపారేస్తున్నాయి.ఎస్సీ, ఎస్టీలకు 27% రిజర్వేషన్లు పోగా…మిగిలిన 23% బీసీలకు కల్పిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ ఊహాగాలనాలకు తెర దించుతూ బీసీలకు రాజకీయంగా, విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ల కల్పించేందుకు మార్చి మొదటి వారంలో చట్టం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన ప్రకటన చేశారు. దీంతో ఈ విషయంలో బీఆర్ఎస్, బీజేపీలకు కాంగ్రెస్ చెక్ పెట్టగలిగిందని విశ్లేషకులు అంటున్నారు.
అంతేకాకుండా రాష్ట్రం ఆమోదించిన చట్టాన్ని కేంద్రానికి పంపి 9వ షెడ్యూల్లో పొందుపరిచి తమిళనాడు తరహా రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ భావిస్తుంది.అయితే కాంగ్రెస్ కులగణన సర్వేను ప్రతిపక్షాలు టార్గెట్ చేశారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలే కరెక్ట్ అంటూ బీఆర్ఎస్ వాదిస్తోంది. కులగణన సర్వేలో బీసీలను తక్కువగా చూపారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీసీల సంఖ్య గతం కంటే పెరిగిందని కాంగ్రెస్ వాదన. రిజర్వేషన్లపై చట్టం చేయనున్న కాంగ్రెస్ ప్రభుత్వం….ఈ అంశాన్ని జాతీయ అంశంగా మారుస్తున్నట్టు కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన చట్టంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా? తమిళనాడు తరహా రిజర్వేషన్లకై కృషి చేస్తుందా? బీసీ రిజర్వేషన్లపై ఆ పార్టీ వైఖరి ఏంటి? అనేది ఉత్కంఠ రేపుతుంది.చేపట్టిన కులగణన సర్వే కేంద్రంలోని ఎన్డీఏను కలవరపెడుతుందని కాంగ్రెస్ వాదిస్తుంది. కులగణన లెక్కల ప్రకారం ఆయా వర్గాలకు రిజర్వేషన్ల పెంపు, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో వారికి సమూచిత స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ అగ్రనేతలు హామీ ఇస్తున్నారు. కులగణనతో దేశం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్. తెలంగాణ బాటలో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా కులగణన చేపట్టి మెజారిటీ వర్గాలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తారన్న చర్చ తెరపైకి వచ్చింది.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేను అస్త్రంగా మార్చుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఆ పార్టీ దేశవ్యాప్తంగా ఈ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
=================