Telangana Politics : ఎత్తులు.. పై ఎత్తులు_పొలిటికల్ హీట్ పెంచుతున్న కామెంట్స్

Telangana Politics

ఎత్తులు.. పై ఎత్తులు_పొలిటికల్ హీట్ పెంచుతున్న కామెంట్స్

హైదరాబాద్, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్)
తెలంగాణ పాలిటిక్స్‌ మాత్రం ప్రతీరోజు క్లైమాక్స్‌ను తలపిస్తున్నాయి. రేపోమాపో ఎన్నికలు ఉన్నాయన్నట్లుగా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ పొలిటికల్ హీట్‌ను పెంచుతున్నాయి పార్టీలు.బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తామని కాంగ్రెస్‌ నేతలు సవాల్‌ చేస్తున్నారు. గులాబీ నేతలు అయితే రేవంత్‌ సీటుకే ఎసరు వచ్చిందని..బీఆర్ఎస్‌ఎల్పీ విలీనం అయ్యే పని కాదని కౌంటర్‌ ఇస్తున్నారు. దీంతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా కొనసాగుతోన్న రాజకీయం ఆసక్తికరంగా మారింది.ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్‌ అయినప్పటి నుంచి..లేటెస్ట్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం వరకు పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్‌గా కొనసాగుతున్నాయి. కారు పార్టీ నుంచి హస్తం పార్టీలో చేరిన పది ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ ఉండనే ఉంది.ఇలాంటి సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్‌ ఫైట్‌ రోజుకో టర్న్ తీసుకుంటోంది. అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆసక్తికర కామెంట్స్ చేస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య మీటింగ్‌ ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి హస్తం పార్టీ వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తోందట కారు పార్టీ.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారని బీఆర్ఎస్ పార్టీ నేతలంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు ప్లాన్ జరుగుతోందని..ఇందుకోసం 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కుంపటి పెట్టారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.ఇది కాంగ్రెస్ సర్కార్ కూలిపోయేందుకు ఒక ఇండికేషన్‌ అంటున్నారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీకి, రేవంత్‌ను దించేందుకు 25 మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నదానికి ఎక్కడో లింక్ ఉందన్న టాక్‌ వినిపిస్తోంది.అధికార కాంగ్రెస్‌లో ఏదో జరగబోతోందని చెప్తుండగా..హస్తం పార్టీ మాత్రం రివర్స్ గేర్ వేస్తోంది. బీఆర్ఎస్‌ నుంచి మరికొంత మంది ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు వ్యూహాలను స్పీడప్ చేసిందట. ఢిల్లీ స్థాయిలో సీరియస్‌గా సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

ఫిరాయింపులపై న్యాయ పరమైన చిక్కులు రాకుండా ఏకంగా బీఆర్ఎస్‌ఎల్పీనే కాంగ్రెస్‌లో విలీనం చేసుకునే ప్లాన్‌తో ముందుకెళ్తోందట హస్తం పార్టీ.బీఆర్ఎస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 10 మంది శాసనసభ్యులు అధికార కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఫిరాయింపులపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా..కోర్టు సూచనతో అసెంబ్లీ స్పీకర్ జంపింగ్‌ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన అధికార కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది. ఇప్పటికే చేరిన 10మంది ఎమ్మెల్యేలకు తోడు మరో 16 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని ప్లాన్ చేస్తోందట కాంగ్రెస్. బీఆర్ఎస్‌ఎల్పీ విలీనం కావాలంటే 2/3 మెజారిటీ అవసరం. అంటే ఇంకో 16 ఎమ్మెల్యేలకు ఎర వేసి.. బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందట. అట్లైతే న్యాయపరంగా ఎక్కడా చిక్కులు రావని కాంగ్రెస్ ప్లాన్‌గా తెలుస్తోంది.ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వెనకాడిన గులాబీ పార్టీ..స్థానిక సంస్థల ఎన్నికల వరకు మరింత దెబ్బతింటుందని, కనీసం పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులు దొరకరన్నది హస్తం పార్టీ అంచనాగా చెబుతున్నారు. గ్రామస్థాయిలో బీఆర్ఎస్ పార్టీని పూర్తిస్థాయిలో వీక్‌ చేయాలనే స్కెచ్‌తో ఉందట అధికార కాంగ్రెస్ పార్టీ.ఇంతకీ రేవంత్‌కు వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలు గ్రూపు కడుతున్నారన్నది రియలా..వైరలా.? లేక 16 మంది కారు పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోబోతుందా.? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం ఎటా ఉండబోతుందో చూడాలి మరి.
================

BRS : కారు పార్టీ ఎందుకిలా!

Related posts

Leave a Comment