Telangana Forests : తెలంగాణలో తగ్గిపోతున్న అడవుల విస్తీర్ణం…

forests

– తెలంగాణలో తగ్గిపోతున్న అడవుల విస్తీర్ణం…

హైదరాబాద్, డిసెంబర్ 26, (న్యూస్ పల్స్)
తెలంగాణ అడవులు గత కొన్నేళ్లుగా బాగా పెరగడం లేదు. థిక్ ఫారెస్ట్ అన్నది లేదు. అంతా పలుచబడి పోయాయి. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం, రాష్ట్రంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో కేవలం 454 చదరపు కిలోమీటర్లలోనే పాతవిగా పరిగణించే చెట్లున్నాయి. వన్యప్రాణి అభయారణ్యాలు, నేషనల్ పార్క్ వంటి రక్షిత ప్రాంతాలకు వెలుపల ఉన్న మిగిలిన అడవులు చాలా చిన్న చెట్లతోనే కనిపిస్తున్నట్లు రిపోర్ట్ తెలిపింది. పాత అడవులు క్రమంగా కనుమరుగవుతున్న విషయాన్ని రిపోర్ట్ స్పష్టంగా ప్రస్తావించింది. అంతే కాదు తెలంగాణలోని 13,480 చదరపు కిలోమీటర్ల రేంజ్ లోని రిజర్వ్ ఫారెస్ట్‌లలో చెట్ల బెరడును తీసేసి, చెట్టు మొదలులో లోపలికి కోత పెట్టి.. దాన్ని డెడ్ వుడ్ గా మార్చే ప్రక్రియ పెరుగుతోందని రిపోర్ట్ గుర్తించింది. దీంతో అలా డెడ్ వుడ్ ను అక్రమంగా అడవి నుంచి తరలించే పని కూడా జోరుగా జరుగుతోంది.తెలంగాణలో 2021-23 మధ్యకాలంలో 100.42 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం తగ్గింది. ఇదే నిజం అంటోంది కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ. సో ఈ లెక్కలు చూస్తే తెలంగాణ కింది నుంచి మూడో స్థానంలో నిలిచింది. అంటే అటవీ విస్తీర్ణం తగ్గడంలో టాప్ త్రీలో ఉందన్న మాట.2021లో 21,279 చదరపు కిలోమీటర్లు ఉన్న తెలంగాణ అటవీ విస్తీర్ణం 2023 నాటికి 21,179కు తగ్గింది. ఈ తరుగుదలలో మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ తర్వాతి స్థానంలో తెలంగాణ నిలిచింది. ఓవరాల్ గా 13 జిల్లాల్లో అటవీవిస్తీర్ణం తగ్గింది. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 115.50 చదరపు కిలోమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 95.55, నిర్మల్‌ జిల్లాలో 45.37 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం తగ్గింది. అయితే జగిత్యాల జిల్లాలో 54.70 చదరపు కిలోమీటర్లు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 50.33, మంచిర్యాల జిల్లాలో 34.96 చదరపు కిలోమీటర్లు మేర పరిధి పెరిగింది. అయితే అక్కడన్నీ యంగ్ ట్రీస్ మాత్రమే ఉన్నాయి.ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ, అలాగే ఫీల్డ్ సర్వేల ద్వారా ఈ అటవీ విస్తీర్ణాలను లెక్కిస్తుంటుంది. రాష్ట్ర మొత్తం భూభాగంలో అటవీ విస్తీర్ణం 22.03% గా నమోదైంది. జాతీయ సగటు 25.17 శాతంతో పోలిస్తే ఇది తక్కువే. అటు అటవీ అగ్నిప్రమాదాల్లో తెలంగాణ దేశంలో ఏడో స్థానంలో నిలిచింది. 2023 నవంబర్ నుంచి 2024 జూన్‌ మధ్యలో రాష్ట్రంలో 13,479 కార్చిచ్చులు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎనిమిది, ములుగు తొమ్మిదో స్థానంలో నిలిచాయి. భద్రాద్రి జిల్లాలో 2,600, ములుగు జిల్లాలో 2,597 అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి.ఫారెస్ట్‌లలో 3,308 చదరపు కిలోమీటర్లలో 10 సెంటీమీటర్ల కంటే తక్కువ మందం ఉన్న చెట్లు ఉన్నాయని, 8,608 చదరపు కిలోమీటర్లలో 20 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన కొంచెం పెద్ద చెట్లు ఉన్నాయని, 3,048 చదరపు కిలోమీటర్లలో 30 సెంటీమీటర్ల వరకు వ్యాసం కలిగిన చెట్లు ఉన్నాయని ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ పేర్కొంది.

ఈ అడవుల్లో 454 చదరపు కిలోమీటర్లు మాత్రమే 30 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మందం కలిగిన చెట్లున్నాయి. సో ఈ లెక్కలు చూస్తే చాలు తెలంగాణలో అడవులు ఏ రేంజ్ లో తగ్గిపోతున్నాయో చెప్పడానికి.తెలంగాణలో అడవుల నష్టానికి ప్రకృతి విపత్తులు, కార్చిచ్చుల కారణం చాలా తక్కువే. అక్రమంగా నరికేయడంతోనే ఎక్కువ నష్టం జరుగుతోందన్నది క్లారిటీ వస్తోంది. చాలా వరకు ప్రాంతాల్లో చెట్లు నేలమట్టమైనట్లు రిపోర్ట్ చెబుతోంది. కొమ్మలు కొట్టేయడం, చెట్ల మొదళ్లలో గాట్లు పెట్టడం, ఇవన్నీ ఉన్నాయి. యూకలిప్టస్ తోటలను నరికివేయడం, అటవీ నివాసితులకు భూ కేటాయింపులను సులభతరం చేసిన ROFR చట్టం అమలుతో అటవీ విస్తీర్ణం తగ్గిందన్న వాదనను అటవీ అధికారులు వినిపిస్తున్నారు. సరే ఇవన్నీ ఒక లెక్క. ఓవరాల్ గా చూస్తే మరో సమస్య ప్రధానంగా కనిపిస్తోంది. పునరుత్పత్తి సరిగా లేకపోవడం సమస్యలను పెంచింది. అంటే అటవీ విస్తీర్ణాన్ని పెంచడం కోసం గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న చర్యలు పెద్దగా వర్కవుట్ కాలేదన్నది తాజా రిపోర్ట్ చూస్తే అర్థమవుతోంది.. 2015-16లో బడ్జెట్ లో హరితహారానికి 193 కోట్లు కేటాయిస్తే, 132 కోట్లు రిలీజ్ చేశారు. అందులో 130 కోట్లు ఖర్చు చేశారు.2016-17లో 155 కోట్లు బ డ్జెట్ లో పెడితే, 155 కోట్లు రిలీజ్ చేయగా, 149 కోట్లు ఖర్చు చేశారు. మొదట్లో కొంత వరకు కరెక్ట్ గా డీల్ చేసినా రాను రాను కథ మార్చేశారు. 2021-22లో 150 కోట్లు బడ్జెట్ లో పెట్టగా, 77 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేశారు. అందులోనూ 52 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఇక 2022-23 చూస్తే 150 కోట్లు బడ్జెట్ లో పెట్టగా, 73 కోట్లు రిలీజ్ చేశారు. 49 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించారు. సో లెక్కలు సరిగా లేవు. హరితహారం పనులూ అలాగే ఉన్నాయి. అందుకే తెలంగాణ అడవులకు ఈ గతి పట్టిందన్న విమర్శలు పెరుగుతున్నాయి.హరితహారం మొక్కలు నాటే కార్యక్రమం అభాసుపాలైంది. ప్రతి ఏటా లక్షల మొక్కలు నాటుతున్నట్లు కాగితాలపై చూపించి.. వాటిల్లో ఎన్ని మొక్కలు బతికున్నాయనే వివరాలు మాత్రం పక్కాగా చెప్పలేకపోయారు. ఏటా ఇదే జరిగింది. 9 సీజన్లుగా చేపట్టిన ఈ ప్రోగ్రామ్ ను సీరియస్ గా తీసుకోలేకపోయారు. గతేడాది కేసీఆర్ ప్రభుత్వం 6.37 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. నర్సరీల్లో మొక్కల పెంపకంతో పాటు, అవసరమైన స్థలాలు గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. కానీ ఏం లాభం? తెలంగాణ గ్రీన్ కవర్ చాలా దారుణంగా దెబ్బతిన్నది.2015 నుంచి 2022 వరకు నిర్వహించిన 8 విడతల హరితహారం కార్యక్రమాల్లో సుమారు 236.54 కోట్ల మొక్కలు నాటినట్లు లెక్కలు చెబుతున్నాయి.

ఇందుకోసం ప్రభుత్వం సుమారు 6 వేల కోట్ల దాకా ఖర్చు చేసింది. ఏటికేడు హరితహారం యాక్షన్ ప్లాన్ లో నాటి ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చినా సీరియస్ నెస్ లేక వర్కవుట్ కాలేదంటున్నారు. ఆరో విడతలో మియావాకీ పద్ధతిని ఫాలో అయ్యారు. అప్పటికే రాష్ట్రంలో మొక్కలు నాటేందుకు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల కొరత తీవ్రంగా ఉండడంతో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు నాటాలనే ఉద్దేశంతో జపాన్ పద్ధతిని తీసుకొచ్చారు. స్వదేశీ చెట్ల ద్వారా దేశీయ అడవులను పునర్నిర్మించాలనుకున్నారు.కానీ మియావాకీ పద్ధతి అన్ని జిల్లాలో సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత ఉపాధి హామీ స్కీం కింద ప్రతి గ్రామంలో ప్రభుత్వ స్థలాలు గుర్తించి పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలనే టార్గెట్ పెట్టింది. కానీ, గ్రామాల్లో, పట్టణాల్లో స్థలాలు లేకపోవడంతో ఎక్కడో ఊరికి దూరంగా రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడవి కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. బృహత్ ప్రకృతి వనాల లక్ష్యాన్ని కూడా పూర్తి స్థాయిలో సాధించలేకపోయారు. హరితహారం కొనసాగించాలనే పట్టుదలతో జాతీయ, రాష్ట్ర హైవేల పక్కన, రూరల్ ఏరియా రోడ్ల పక్కన స్థలాలు, ఇరిగేషన్ ల్యాండ్స్ లోనూ నాటారు. మొక్కలు నాటినప్పుడు ఉన్న శ్రద్ధ అవి పెరిగి పెద్దవి అవడంలో తీసుకోకపోవడం, పర్యవేక్షణ లేకపోవడంతో చాలా వరకు మొక్కలు చనిపోయాయి. కోతుల ఆహార వనాల పేరుతో ఒకే చోట పెద్ద ఎత్తున నాటిన పండ్ల మొక్కల జాడ కూడా ఇప్పుడు లేదు. అన్ని ల్యాండ్స్ లో మొక్కలు నాటేశామని కొత్త జాగాలు లేవని అధికారులు చెబుతూ వచ్చారు. మొక్కలు నాటేందుకూ జాగా లేకపోతే తెలంగాణలో అటవీ విస్తీర్ణం ఎందుకు తగ్గినట్లు.. అన్నది హాట్ టాపిక్ గా మారింది.తెలంగాణలో అడవులకు ఈ పరిస్థితి రావడానికి కారణం గత కేసీఆర్ హయాంలో చిత్తశుద్ధి చూపకపోవడమే. గత ప్రభుత్వం మొక్కల పర్యవేక్షణకు అవసరమైన నిధులు సకాలంలో ఇవ్వలేకపోవడం వల్లే చాలా వరకు చనిపోయాయని, దాంతో నాటినే చోటే మళ్లీ మొక్కలు నాటాల్సి వచ్చిందన్న వాదనలు గతంలోనే వినిపించాయి. ఎందుకంటే 9 విడతల్లో కలిపి ఖర్చు చేసింది 727 కోట్లుగానే ఉన్నట్లు ఆర్టీఐ ద్వారా రిప్లై వచ్చింది. బడ్జెట్ కేటాయింపులు, రిలీజ్ చేసిన నిధులు పక్కన పెడితే హరితహారానికి ఖర్చు చేసిందే అసలైన లెక్క. ఆ ఖర్చులోనే మొక్కలు కొనడం, నర్సరీల్లో పెంచడం, నాటడం వరకే. ఆ తర్వాత వాటి ఆలనా పాలనా చూసేదెవరు? మరి ఈ లెక్కన హరితహారం ఫెయిల్ అవడంతోనే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023లో అటవీ విస్తీర్ణం తగ్గిన రాష్ట్రాల్లో టాప్ త్రీలో తెలంగాణ ఉన్న పరిస్థితి.

Read : Vizag Steel : ప్రైవేటీకరణ దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్

Related posts

Leave a Comment