తెలంగాణలో పెరిగిన చలి
అదిలాబాద్, నవంబర్ 14, (న్యూస్ పల్స్)
Telangana
తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. వర్షాకాలం పూర్తై చలికాలంలోకి అడుగుపెట్టగానే ఊష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. గత పది రోజులుగా రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగిపోయింది. పలు జిల్లాల్లో రాత్రి ఊష్ణోగ్రతలు 15 డిగ్రీల దిగువకు పడిపోయినట్టు వాతావరణ శాఖ చెబుతోంది. ఉత్తర, ఈశాన్య దిశ నుండి గాలులు వీస్తున్న కారణంగా చలి ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు. చలితో పాటూ భారీగా పొగమంచు ఉండటంతో రోడ్డుపై వెళ్లే వాహనదారులు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు నెమ్మదిగా చూసుకుంటూ వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇక నిన్న అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు చల్లటి గాలులు వీచాయి. పగటిపూట సైతం కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా మెదక్ జిల్లాలో 14.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువ ఉంటున్నాయి. హైదరాబాద్ లోనూ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. ఇక్కడ ఉదయం ఎండకొడుతూ పొడి వాతావరణం కనిపించగా రాత్రి తరవాత ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. చలితీవ్రత పెరగడంతో రాత్రిపూట ప్రజలు బయట తిరగడం మానేశారు. మరోవైపు నేడు, రేపు కొన్ని జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.