తెలంగాణలో టీడీపీకి స్పేస్ ఉందా…
హైదరాబాద్, అక్టోబరు 8, (న్యూస్ పల్స్)
TDP in Telangana
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో డీలాపడ్డా టీడీపీకి పూర్వవైభవం తెచ్చేలా అడుగులు పడుతున్నాయా అంటే..అవుననే ఆన్సర్ వినిపిస్తోంది. దీనికి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కామెంట్స్ బలం చేకూరుస్తున్నాయి. తాను త్వరలో టీడీపీలో చేరుతానని ఆయన ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి అభిమానులు ఉన్నారని.. త్వరలోనే పార్టీకి గత వైభవం తీసుకొస్తానంటున్నారు. చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఈ ప్రకటన చేశారాయన. తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.
తాను మనవరాలి పెళ్లి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికే చంద్రబాబుతో భేటీ అయినట్లు మల్లారెడ్డి చెప్పారు. తీగల కృష్ణారెడ్డి మాత్రం తాను వంద శాతం టీడీపీలో చేరతానంటూ తేల్చేశారు. ఆ ప్రకటన చేసిన సమయంలో..మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ఆయన పక్కనే ఉన్నారు. కానీ ఈ వ్యవహారంపై రియాక్ట్ అయ్యేందుకు నిరాకరించారు మల్లారెడ్డి. ఇద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఓ మాజీ ఎమ్మెల్యే చంద్రబాబుతో భేటీ అవడం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.
విభజన తర్వాత ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 2014లో టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలు వరుస పెట్టి గులాబీ గూటికి చేరారు. చివరకు టీడీఎల్పీ బీఆర్ఎస్లో విలీనం అయిపోయింది. ఆ తర్వాత తెలంగాణలో టీడీపీ వీక్ అయిన పరిస్థితులు కనిపించాయి. 2018లో టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు పొత్తులో పోటీ చేశాయి. అయినా అప్పుడు బీఆర్ఎస్ ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయాయి. ఆ తర్వాత టీడీపీలో ముఖ్యనేతలంతా బీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. దాంతో గతేడాది జరిగిన తెలంగాణ ఎన్నికలను లైట్ తీసుకుంది టీడీపీ. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ.. తెలంగాణపై ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తిరిగి గత వైభవాన్ని తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అందులో భాగంగానే తీగల కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, అతని అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి చంద్రబాబును కలిసినట్లు చర్చ జరుగుతోంది.తీగల కృష్ణారెడ్డి, మల్లారెడ్డి ఇద్దరి రాజకీయ ప్రస్థానం టీడీపీలోనే స్టార్ట్ అయింది. తీగల కృష్ణారెడ్డి టీడీపీ కార్పొరేటర్గా గెలిచి హైదరాబాద్ మేయర్గా పనిచేశారు. ఇక మల్లారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి 2014లో మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు. అలా ఈ ఇద్దరికీ చంద్రబాబుతో టీడీపీతో విడదీయలేని బంధం ఉంది. అందుకే తిరిగి సొంత గూటికి చేరేందుకు రెడీ అయ్యారు తీగల కృష్ణారెడ్డి. మల్లారెడ్డి మాత్రం డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఒకవేళ మల్లారెడ్డి సైకిల్ ఎక్కితే ఖాళీగా ఉన్న తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని ఆయనకు ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది.
మల్లారెడ్డి కూడా టీడీపీకి దగ్గరై.. తెలంగాణలో తన వ్యవహారాలనే చక్కబెట్టుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం ఉంది.వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి అభిమానులు బానే ఉన్నారు. హైదరాబాద్, ఖమ్మంలో టీడీపీకి మంచి పట్టుంది. టీడీపీ కోర్ ఓటు బ్యాంకైన కమ్మ ఓటర్లు హైదరాబాద్లో పలు నియోజకవర్గాల్లో గెలుపోటములను డిసైడ్ చేస్తారు. మరికొన్ని సెగ్మెంట్లలో సెటిలర్ల ఓట్లు ఎక్కువగానే ఉంటాయి. ఖమ్మంలోనూ కమ్మ ఓటర్లు ఉండటం..విజయవాడకు బార్డర్గా ఉన్న జిల్లా కావడంతో అక్కడ కూడా టీడీపీకి అంతో ఇంతో పట్టుంది.
అందుకే తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి హైదరాబాద్, ఖమ్మంతో పాటు మిగతా జిల్లాల్లో 15 సీట్లు వచ్చాయి. అంతేకాదు ఏపీలో చంద్రబాబు అరెస్ట్ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో జనం రోడ్ల మీద వచ్చి ఆందోళనలు చేశారు. ఇలా టీడీపీకి, చంద్రబాబుకు తెలంగాణలో ఫ్యాన్ బేస్ ఉంది. అయితే గెలిచేంత పట్టు ఉందా లేదా అన్నదే చర్చ. ఎలా అయినా తెలంగాణలో ప్రభావం చూపేంత పట్టు సాధించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అధికారంలోకి వస్తామా రామా అన్నది పక్కన పెడితే డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండాలని..హంగ్ వస్తే కీలకంగా మారాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.తీగల కృష్ణారెడ్డి పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి.? మల్లారెడ్డి టీడీపీలోకి వెళ్తారా లేదా అన్నది ఇప్పటికైతే చర్చనీయాంశమే. తెలంగాణలో టీడీపీ వ్యూహం ఫలిస్తుందా.. తెలంగాణ వాకిట్లో చంద్రబాబు పెడుతున్న గొబ్బెమ్మలు నిలబడుతాయా లేదా అన్నది మాత్రం కొన్నాళ్లు వేచి చూడక తప్పదు.
TDP focus in Telangana | తెలంగాణలో టీడీపీ ఫోకస్…. | Eeroju news