Target YCP senior leaders | టార్గెట్… వైసీపీ సీనియర్ నేతలు | Eeroju news

టార్గెట్… వైసీపీ సీనియర్ నేతలు

అంతా చట్టబద్దమే

విజయవాడ, జూలై 5, (న్యూస్ పల్స్)

Target YCP senior leaders

తెలుగుదేశం పార్టీ గెలిచిన మరుక్షణం వైఎస్ఆర్‌సీపీ నేతలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు గర్జించేవారు. నారా లోకేష్ అయితే రెడ్ బుక్ చూపించి ఎవర్నీ వదిలే  ప్రసక్తే లేదని చెప్పేవారు. ఇలా చెప్పినందుకు ఆయనపై సీఐడీ కేసు కూడా నమోదు చేసింది. ఆయనను అరెస్టు చేసేందుకు అనుమతి ఇవ్వాలని  కోర్టును కూడా కోరింది. ఇక ఇతర నేతలు, ధ్వితీయ శ్రేణి నేతల ఆవేశం గురించి చెప్పాల్సిన పని లేదు. కూటమికి మెజార్టీ వచ్చిన మరుక్షణం విరుచుకుపడతారని అనుకున్నారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు గడుస్తున్నా పెద్దగా ఏమీ జరగలేదు.

గ్రామ స్థాయిలో జరిగే చిన్న చిన్న గొడవలే బయటపడుతున్నాయి. నిజంగా టీడీపీ టార్గెట్ చేసుకున్న ఏ ఒక్క నేత కూడా ఇబ్బంది పడలేదు. కొడాలి నాని దగ్గర్నుంచి రోజా వరకూ అందరూ నింపాదిగానే రాజకీయాలు చేసుకుంటున్నారు. అందుకే టీడీపీ కార్యకర్తల్లో రెడ్ బుక్ ఏమియందన్న ప్రశ్న వస్తోంది. కానీ అంతర్గతంగా మాత్రం వైసీపీ ముఖ్య నేతలందర్నీ చట్టబద్ధంగా ఫిక్స్ చేసేందుకు క్రమబద్ధంగా ప్రక్రియ పూర్తి చేస్తున్నారన్న సమాచారం మాత్రం మెల్లగా బయటకు  వస్తోంది. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ జరిగిన తర్వాత రోజు నుంచే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందే ఏపీ బేవరెజెస్ కార్పొరేషన్ మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకున్న అధికారి వాసుదేవరెడ్డి ఇంట్లో సోదాలు ప్రారంభించారు.

ఆయన తనను అరెస్టు చేస్తారేమోనన్న భయంతో హైకోర్టు ను ఆశ్రయించారు. కానీ ఊరట దక్కలేదు. కానీ సీఐడీ అధికారులు వాసుదేవరెడ్డిని అరెస్టు చేయలేదు. కానీ సోదాలు మాత్రం కొనసాగిస్తున్నారు. ఆయనపై  రికార్డుల తస్కరణ కేసు పెట్టారు. ఈ విషయంలో వాసుదేవరెడ్డి ఏపీ ప్రభుత్వం టార్గెట్ కాదు. ఆయన ఇచ్చింది తీసుకుని పై వాళ్లు చెప్పినట్లుగా చేశారు. ఆ పైవాళ్లనే సీఐడీ టార్గెట్ చేసింది. అందుకే మొత్తం గుట్టు రట్టు చేస్తున్నారు. విషయం బయటకు రాకుండా అసలు ఏం జరిగిందో లెక్కలతో సహా వెలుగులోకి తెస్తున్నారు. ఇప్పటికే మద్యం విషయంలో జరిగిన భారీ స్కాం విషయంలో  అన్ని ఆధారాలను సేకరించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ అధికారంలోకి రావడంతోనే పాలసీ మార్చేశారు.

ప్రభుత్వ దుకాణాలు పెట్టారు. అందులో వైసీపీ నేతల డిస్టిలరీల్లో తయారయ్యే విచిత్రమైన బ్రాండ్లే అమ్మారు. అదీ కూడా నగదుకే అమ్మారు. ఈ వ్యవహారంలో అసలు గూడుపుఠాణి మొత్తంబయటకు వచ్చేసిందని అంటున్నారు.అలాగే ఇసుక వ్యవహారంలో కూడా సంచనలనాత్మక స్కాం ఉందని అంటున్నారు. ఇసుక పేరుతో ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం రాకుండానే .. ప్రైవేటు కంపెనీలు ఇసుకను  దోపిడీ చేసేలా అనుమతి ఇచ్చారు. వారు కూడా పూర్తిగా నగదు లావాదేవీలే నిర్వహించారు. ఈ మూలాలన్ని నేరుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. హడావుడి చేయకుండా ఆధారాల  సేకరణ పూర్తి చేయగానే కేసులు నమోదవడం ఖాయమని చెబుతున్నారు.

గనుల మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వాకాలపై టీడీపీ పూర్తి సమాచారం సేకరించింది. గనుల సీవరేజీ దగ్గర నుంచి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేసుకోవడం వరకూ చాలా అక్రమాలు వెలుగులోకి వచ్చాయని చెబుతున్నారు. గనుల శాఖలో అంతా ప్రైవేటు ఉద్యోగులే ఐదేళ్లు చక్రం తిప్పారని అంటున్నారు. టీడీపీ నేతల గనుల్ని లాక్కుని వైసీపీ నేతలకు అప్పగించడం కోసం.. తప్పుడు నివేదికలు ఇచ్చి వందల కోట్ల జరిమానాలు విధించిన రికార్డు ఉంది. అలాగే నేపాల్‌లో పట్టుబడిన ఎర్రంచదనం పెద్దిరెడ్డికి చెందినదని తేలిందని పర్యావరణ మంత్రి పవన్ కల్యాణ్ నేరుగా వెల్లడించారు. ఇది సంచలనం అయింది. ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో పెద్దిరెడ్డి పేరు నేరుగా డిప్యూటీ సీఎం పవన్ చెప్పినా.. ఆయన వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదంటనే వారు నిజంగా ఇరుక్కుపోయారన్న క్లారిటీ వచ్చిందని టీడీపీ నేతలంటున్నారు.

పెద్దెరెడ్డి రామచంద్రారెడ్డి తాను మంత్రి పదవిలో ఉండి టీడీపీని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు. కుప్పం మున్సిపాలిటీలో టీడీపీని అనుచిత పద్దతుల్లో ఓడించారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం, హిందూపురంలో వందల కోట్లు ఖర్చు చేసి టీడీపీని ఓడించడానికి ప్రయత్నించారని అంటున్నారు. అలాగే టీడీపీ నేతలపై కేసులు పెట్టడం.. వేధించడం.. చంద్రబాబుపై రాళ్ల దాడిలోనూ ఆయన కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. అందుకే  పక్కాగా చట్ట బద్ధంగా కేసుల వల రెడీ అయిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

సీనియర్ మంత్రిగా జగన్ ప్రభుత్వం లో చక్రం తిప్పిన  బొత్స సత్యనారాయణ .. బదిలీలకు లంచం తీసుకున్నారన్న దగ్గర నుంచి విద్యాకానుక కిట్ల వరకూ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రోజా తిరుమల దర్శన టిక్కెట్ల దందా దగ్గర నుంచి రుషికొండ ప్యాలెస్ వరకూ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా పులివెందులలో అసలు ఏ మాత్రం విలువ చేయని వైసీపీ నేత భవనాన్ని పన్నెండున్నర కోట్లు పెట్టి కొన్నారన్న ఆరోపణ దుమారం రేపుతోంది. ఇక ఆడుదాం ఆంధ్రా పేరుతో వంద కోట్ల స్కాం చేశారని ఇప్పటికే ఫిర్యాదులు విచారణాధికారుల వద్దకు వెళ్లాయి. వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు, కార్యాలయాలపై జరిగిన  దాడులకు లెక్కే లేదు.

టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021లో దాడి జరిగితే కేసులు పెట్టలేదు. ఇప్పుడు పోలీసులు రంగంలోకి ిగారు.  అప్పటి సీసీ పుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ కేసులో ఐదుగుర్ని అరెస్ట్  చేశారు.  నిందితులను పట్టుకోవడంతోపాటు దాడికి పురిగొల్పిన నేతలపైనా చర్యలకు సిద్ధమవుతోంది ప్రభుత్వం.    నిందితుల్లో ఎక్కువ మంది మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాశ్‌ అనుచరులు ఉన్నారు.  ఈ దాడి వెనకు సూత్రధారులు వాళ్లేనని .. నిందితుల ద్వారా చెప్పించే అవకాశాలు ఉన్నాయి.  నిందితులను పట్టుకోవడంతోపాటు ఈ ముగ్గురిపైనా ఏమైనా చర్యలు తీసుకుంటారా?

అన్న టెన్షన్‌ వైసీపీలో కనిపిస్తోంది. ఇక కాకినాడలో ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్‌ హత్య కేసును ప్రభుత్వం పునర్విచారించాలని భావిస్తోంది. ఈ కేసులో అనంతబాబుతోపాటు మరికొందరి ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. అదేవిధంగా విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ కేసును మళ్లీ ఓపెన్‌ చేస్తున్నారు. సుధాకర్‌ ఎపిసోడ్‌లో భూ సంబంధ వ్యవహారాలు ఉన్నాయనే సమాచారం ప్రభుత్వానికి చేరడంతో  అంతర్గత విచారణ ముమ్మరంగా సాగుతోంది. గత ప్రభుత్వంలో నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఇదే సమయంలో ప్రజాధనం తిరిగి వసూలు చేసేలా ప్రత్యేక చట్టం చేయాలని ఆ లేఖలో సూచించారు.

గనుల లీజులు, ఇసుక తవ్వకాలు, మైనింగ్‌ వ్యవహారాల్లోనూ ఎవరెవరి పాత్ర ఉందని తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని నియమించింది. రాయలసీమకు చెందిన ముఖ్య నేతలు గనుల లీజుల్లో అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వం వద్ద పక్కా సమాచారం ఉన్నట్లు చెబుతున్నారు. రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు కాకుండా.. నేరుగా ప్రజాస్వామ్య బద్దంగా వైసీపీ నేతల అక్రమాలను ప్రజల ముందు పెట్టి.. తర్వాత కేసులు  పెట్టి .. మట్టి తన చేతికి అంటకుండా టీడీపీ అసలు ప్లాన్ అమలు చేస్తోందని నెల రోజుల పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి .

 

Related posts

Leave a Comment