Target Harish Rao | టార్గెట్ హరీశ్ రావు… | Eeroju news

టార్గెట్ హరీశ్ రావు...

టార్గెట్ హరీశ్ రావు…

మెదక్, జూలై  22 (న్యూస్ పల్స్)

Target Harish Rao

కేసీఆర్‌ సొంత జిల్లా మెదక్‌లో రాజకీయం ఆసక్తిరేపుతోంది. వచ్చేస్థానిక ఎన్నికల నాటికి ఉమ్మడి జిల్లాలో బలమైన శక్తిగా ఎదగాలని భావిస్తోన్న కాంగ్రెస్‌… కారు పార్టీని ఖాళీ చేసేవిధంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని హస్తం గూటికి చేర్చుకోగా, ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలపై వల విసురుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఉమ్మడి మెదక్‌ జిల్లాల్లో మొత్తం ఏడుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉండగా, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్‌ చేతిని అందుకున్నారు. ఇక మిగిలిన ఆరుగురిలో కేసీఆర్‌, హరీశ్‌రావు మినహా నలుగురితో హస్తం నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ మినహా మిగిలిన ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, మాణిక్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే ఓ సారి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తొలి నెలరోజుల్లోనే ఉమ్మడి మెదక్‌ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎంను కలవడం అప్పట్లో సంచలనమైంది. అప్పుడే వీరు పార్టీ మారనున్నారనే ప్రచారం ప్రారంభమైంది. కానీ, అప్పట్లో ఈ ప్రచారాన్ని ఖండిన నేతలు… ఇప్పుడు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరేందుకు అడుగులు వేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది. సీఎం రేవంత్‌ను కలిసిన వారిలో ఇప్పటికే మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా, నెక్ట్స్‌ ఎవరనేది ఆసక్తి రేపుతోంది.సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో స్థానిక ఎన్నికల సమయానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బలపడాలనే వ్యూహంతో కాంగ్రెస్‌ అడుగులు వేస్తోంది.

ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్‌ మూడుచోట్ల గెలిస్తే పటాన్‌చెరు ఎమ్మెల్యే చేరికతో హస్తం బలం నాలుగుకు చేరింది. ఇక చకచకా చేరికలు పూర్తిచేసి మెజార్టీ మండలాలు, మున్సిపాలిటీల్లోనూ పాగా వేయాలని ప్లాన్‌ చేస్తోంది కాంగ్రెస్‌. దీనిద్వారా క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసి మాజీ మంత్రి హరీశ్‌రావుకు జిల్లాలో చెక్‌ పెట్టాలని చూస్తోంది.కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విరుచుకుపడే హరీశ్‌రావును మెదక్‌ లోనే దెబ్బతీసి… సర్కార్‌ పై గట్టిగా గళం విప్పకుండా నివారించాలనేది కాంగ్రెస్‌ ప్లాన్‌ గా కన్పిస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి డైరెక్షన్‌లో జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, సీనియర్‌ నేత జగ్గారెడ్డి ఆపరేషన్‌ ఆకర్ష్‌ను వేగవంతం చేసినట్లు చెబుతున్నారు.

ఒకవైపు ఎమ్మెల్యే స్థాయి నేతలను చేర్చుకుంటూనే… దిగువస్థాయిలోనూ వలసలను ప్రోత్సహించాలని కాంగ్రెస్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధిపత్యానికి గండి కొట్టి…. ఆయనను ఒంటరిని చేసేలా పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది టీపీసీసీ… ఇప్పటికే రుణమాఫీ విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావుతో మాటల యుద్ధానికి దిగిన కాంగ్రెస్‌… మున్ముందు బిఆర్‌ఎస్‌ ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న హరీశ్‌నే ట్రబుల్స్‌లోకి నెట్టేందుకు పక్కావ్యూహం రచిస్తోంది.

గులాబీ బాస్‌ సొంత జిల్లా అయినప్పటికీ… ఉమ్మడి మెదక్‌లో రాజకీయం అంతా హరీశ్‌రావు చుట్టూనే తిరుగుతుంది. గజ్వేల్‌లో కేసీఆర్‌ను గెలిపించే బాధ్యత కూడా హరీశే తీసుకుంటుంటారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో తనకున్న వ్యక్తిగత పలుకుబడితో బీఆర్‌ఎస్‌ను బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దారు హరీశ్‌రావు.అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ హవా చూపినా.. మిగతా ఏ జిల్లాల్లో లేని విధంగా ఒక్క ఉమ్మడి మెదక్‌లోనే ఏడు చోట్ల గెలిచి స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపింది బీఆర్‌ఎస్‌. దీంతో హరీశ్‌రావు కంచుకోట మెదక్‌ జిల్లాపై స్పెషల్‌ ఫోకస్‌ చేసింది కాంగ్రెస్‌.

పార్లమెంట్‌ ఎన్నికల నాటికి కొంత మేర పుంజుకున్నా… జిల్లాపై సంపూర్ణ ఆధిపత్యం చలాయించలేకపోయామనే ఉద్దేశంతో ఇప్పుడు ఆపరేషన్‌ ఆకర్ష్‌లో తొలి ప్రాధాన్యంగా మెదక్‌ను తీసుకున్నట్లు చెబుతున్నారు.మొత్తానికి హరీశ్‌రావు టార్గెట్‌గా జరుగుతున్న రాజకీయం ఆసక్తికరంగా మారింది. మరి కాంగ్రెస్‌ వ్యూహాన్ని హరీశ్‌రావు ఎలా చేధిస్తారో చూడాలి మరి.

 

టార్గెట్ హరీశ్ రావు...

 

Silence among the pink leaders | గులాబీ నేతల్లో మౌనం… | Eeroju news

Related posts

Leave a Comment