స్వరూపుడి లీలలు…ఇంతింతకాదయా
విశాఖపట్టణం, జూన్ 27, (న్యూస్ పల్స్)
Swarupanandendra Swarupudi’s Leela Intinthakadaya
హిందూ ధర్మ రక్షణ, ధర్మ ప్రచారం, వేద విద్య.. ఇవీ అధ్యాత్మిక పీఠాల కర్తవ్యం.. శారదా పీఠం కూడా ఇందుకు అతీతం కాదు.. కానీ ప్రస్తుతం ఈ పీఠం పెద్దల్లో అధ్యాత్మిక భావన కంటే వాణిజ్యకోణాలే ఎక్కువ కనిపిస్తున్నాయన్న ఆరోపణలు మొదలయ్యాయి. గత ప్రభుత్వ పెద్దలను అడ్డుగా పెట్టుకొని దేవుడి పేరు చెప్పుకొని అక్రమార్జన చేశారన్న ఆరోపణలు రోజురోజుకు పెరుగుతున్నాయి.. ఇంతకీ ఏంటీ శారదపీఠం కథ.. ? వారిపై వస్తున్న ఆరోపణలేంటి?స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి.. విశాఖ శారదాపీఠం అధిపతి.. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన స్వామిజీ.. స్వరూపానందేంద్ర.. అయితే ఆ సమయంలో ఎంత పేరు వచ్చిందో.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ వివాదాలను ఎదుర్కొంటున్నారు. కారణం ఆ పీఠం దక్కించుకున్న భూములు.. వారికున్న పొలిటికల్ లింక్స్.. ఇంతకీ వివాదం ఏంటంటే.. వైసీపీ హయాంలో శారదా పీఠానికి ప్రభుత్వం భారీగా భూములు కేటాయించింది. విశాఖలో వేద పాఠశాల ఏర్పాటు కోసం శారదాపీఠం భూమిని కోరింది.
కోరింది స్వరూపానందేంద్ర.. అధికారంలో ఉంది శిష్యుడు జగన్.. ఇంకేముంది ఎకరం మూడు కోట్లు విలువ చేసే భూమిని కేవలం లక్ష రూపాయల చొప్పున 15 ఎకరాల భూమిని కేటాయించింది. అంటే 45 కోట్ల విలువైన భూమిని.. 15 లక్షలకు కేటాయించింది. భీమిలి బీచ్‌కి సమీపంలోని సర్వే నెంబరు 102,103లో ఈ 15 ఎకరాల భూమి ఉంది.ఇక్కడి వరకు బాగానే ఉంది. స్వామి స్వరూపానంద సరస్వతికి మేలు చేయడం కోసం 15 ఎకరాల భూమికి సమీపంలో VMRDAకు 50 ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం.. ఆ 50 ఎకరాల భూమి అభివృద్ధి పేరుతో శారదాపీఠానికి కేటాయించిన భూమికి సమీపంగా రోడ్లు డెవలప్ కూడా చేశారు. అంటే ఇన్‌డైరెక్ట్‌గా VMRDA నిధులతో శారదాపీఠం స్వామివారికి ప్రత్యేక రోడ్లు.. మౌలిక వసతులు కల్పించింది జగన్ ప్రభుత్వం. మరి ఈ కేటాయింపులు అక్కడితో ఆగిపోయాయా? లేదు.. భీమిలిలో సముద్ర సమీపంలో ఒకచోట..అమరావతిలో యాగం చేసిన ప్రదేశానికి సమీపంలో మరోచోట.. ప్రకాశం జిల్లాలో ఇంకోచోట.. తిరుపతి, తిరుమలలో రెండు చోట్ల భూములను కేటాయించింది జగన్ ప్రభుత్వం.
సో మొత్తంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకుంది శారదాపీఠం.ఇక తిరుమల విషయానికి వద్దాం.. తిరుమలలో ధర్మ పరిరక్షణ పేరుతో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్మాణాలు చేపడుతుంది శారదాపీఠం.. అయితే ఈ నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తుందన్నది ఆరోపణలు. వడ్డించేవాడు మనవాడైతే.. పంక్తిలో ఎక్కడ కూర్చున్న పర్వాలేదన్నట్టుగా.. ఇన్నాళ్లు ఈ అక్రమాలను చూసి కూడా చూడనట్టుగా వదిలేసింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పెద్దలు.. ఏ బ్లాక్‌లో నిర్మాణాలకు పర్మిషన్ తీసుకున్నది నాలుగు అంతస్తులకు నిర్మించింది ఐదు అంతస్థులు. ఇదే విషయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తిరుమల క్షేత్ర రక్షణ సమితి అధ్యక్షుడు ఓంకార్.. హైకోర్టు పిటిషన్‌పై విచారణ చేసి కమిషన్ ఏర్పాటు చేయడం..
ఆ కమిషన్ విచారణ చేపట్టడం.. ఆ విచారణలో అక్రమాలు బయటపడటం.. ఇలా వరుసగా జరిగిపోయాయి. అసలు ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండానే నిర్మించడం ఓ తప్పైతే.. ఊట కాలువను పూడ్పించి మఠము వెనుక రహాదారి వైపు నిర్మించడం మరో తప్పు.. ఇదీ తిరుమల కథ.విశాఖలో గత ప్రభుత్వంలో ఇచ్చిన విలువైన భూములను కొత్త ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కోట్ల విలువైన భూములను స్వామిజీకి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. అయితే.. ప్రభుత్వం ఇచ్చిన భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలి.. అదే మా డిమాండ్ అంటూ క్లియర్ కట్‌గా చెప్తున్నారు. అసలు శారదపీఠం ఆస్తులు ఈ ఐదేళ్లలో ఎందుకు గణనీయంగా పెరిగాయి? ఎలా పెరిగాయి? దీని వెనకున్నది ఎవరు? అనేది తేల్చాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే శారదాపీఠం ఇప్పుడు వివాదాలకు కేరాఫ్‌గా మారింది. మరి ప్రభుత్వం వీటిపై ఫోకస్ చేస్తుందా? త్వరలోనే విచారణ జరిపి.. ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానం త్వరలోనే రానుంది.