SVNS Verma in Ashala palanquin | ఆశల పల్లకీలో వర్మ… | Eeroju news

SVNS Varma

 ఆశల పల్లకీలో వర్మ….

కాకినాడ, జూలై 8, (న్యూస్ పల్స్)

SVNS Verma in Ashala palanquin

పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా… ఎన్నికల తర్వాత ఈ డైలాగ్‌ ఎంతో ఫేమస్‌ అయింది కదా… మరి ఆ పిఠాపురం గెలిపించిన నాయకుడు ఎంత ఫేమస్‌ అయివుండాలి. జనసేనాని పవన్‌కల్యాణ్‌ గెలుపు బాధ్యతలను తన భుజాన వేసుకుని పనిచేసిన నాయకుడే SVSN వర్మ. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీకి చెందిన వర్మ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమిని తట్టుకుని ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని, కార్యకర్తలను కనిపెట్టుకుని పనిచేశారు.

టీడీపీ ఈజీగా గెలుస్తుందనుకున్న సీటు పిఠాపురం. కానీ, జనసేనాని పవన్‌కల్యాణ్‌ నిర్ణయంతో వర్మ ఆశలు గల్లంతయ్యాయి. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన పవన్‌… ఈ సారి పిఠాపురం నుంచి పోటీ చేయాలని భావించారు. కూటమిలో కీలకనేత పవన్‌ నిర్ణయాన్ని టీడీపీ అంగీకరించాల్సి వచ్చింది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించిన వర్మకే పవన్‌ను గెలిపించే బాధ్యత అప్పగించింది.తొలుత టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని స్థానిక కేడర్‌ వ్యతిరేకించినా, వర్మ మాత్రం చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేశారు. అధినేత ఆదేశాలతో పవన్‌ గెలుపునకు శక్తివంచన లేకుండా పనిచేశారు. ఇక పిఠాపురంలో పవన్‌ను కట్టడి చేయాలని అప్పటి అధికార పార్టీ వైసీపీ ఎన్నో ప్రయోగాలు చేసింది. కానీ, స్థానికంగా వర్మ అన్నింటిని ఒక్క చేత్తో ఎదుర్కొన్నారు. పవన్‌ గ్లామర్‌…. తన రాజకీయ వ్యూహాలతో పిఠాపురంలో భారీ విజయం సాధించి పెట్టారు.

పవన్‌ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని సవాల్‌ చేసిన వైసీపీకి మైండ్‌బ్లాక్‌ అయ్యేలా ఏకంగా 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఇదే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. రాష్ట్రంలో ప్రతి టీడీపీ కార్యకర్త, జనసైనికుడు కూడా వర్మ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇదే సమయంలో వర్మకు ఏ పదవి ఇస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రభుత్వం కొలువుదీరి నెలరోజులు కావస్తుండటంతో వర్మకు ఇచ్చే పదవిపై విస్తృత చర్చ జరుగుతోంది. తాజాగా ఎన్నికలు జరుగుతున్న రెండు ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి వర్మకే అన్న ప్రచారం జరిగింది. ఎన్నికల ముందు చంద్రబాబు కూడా వర్మకు రాష్ట్రంలో మొదటి ఎమ్మెల్సీ పదవి వర్మకే ఇస్తామన్న మాటిచ్చారు.

కానీ, తొలి విడతలో వర్మకు చాన్స్‌ దక్కలేదు. దీంతో వర్మకు ఇచ్చే పదవిపైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. తొలి విడత ఎమ్మెల్సీ అవకాశాన్ని వర్మ వదులుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రెండేళ్ల కాలపరిమితికి ఎన్నిక జరుగుతోంది. ఈ పదవిని వర్మ తీసుకుంటే మరోసారి చాన్స్‌ వచ్చే అవకాశం ఉంది. కానీ, ఈ అవకాశం కన్నా తన నియోజకవర్గానికి మేలు జరగాలన్నదే తొలి ప్రాధాన్యంగా తీసుకున్నారట వర్మ. ఏలేరు రెండో దశ విస్తరణకు నిధులు విడుదల చేయాలని అటు ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు…. సిట్టింగ్‌ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కోరారట వర్మ.తన పదవి కన్నా, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడగటంతో ఇద్దరు అధినేతలు ఒకింత ఆశ్యర్యానికి లోనయ్యారంటున్నారు.

వర్మ బాధ్యతలను అభినందిస్తూనే…. తగిన గౌరవం ఇచ్చేలా వర్మకు నామినేటెడ్‌ పోస్టులో నియమించాలని చూస్తున్నారట… ఎన్నికల్లో వర్మకు ఇచ్చిన మాట ఒక్కటే కాకుండా.. క్షత్రియ సామాజికవర్గానికి తగినన్ని సీట్లు కేటాయించలేకపోయారని టీడీపీ వర్గాల సమాచారం. ఇటు వర్మ.. అటు క్షత్రియ సామాజికవర్గానికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ఎమ్మెల్సీ అవకాశంతోపాటు ఏదైనా కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పవన్‌ సైతం వర్మ కృషిని, త్యాగాన్ని గుర్తు చేస్తూ తగిన గౌరవం కల్పించాల్సిందిగా సీఎం చంద్రబాబుకు సూచించారని తెలుస్తోంది. మొత్తానికి అధినేతల ఇద్దరి ఆశీస్సులు ఉన్న వర్మను ఏ పదవి వరించబోతోందోననేదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

SVNS Varma

 

Trip to Pithapuram from 1st July | జూలై 1 నుంచి పిఠాపురం పర్యటన | Eeroju news

Related posts

Leave a Comment