స్సర్శ దర్శనం పై కీలక నిర్ణయం
కర్నూలు, డిసెంబర్ 11, (న్యూస్ పల్స్)
శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనంపై దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రద్దీ రోజుల్లోనూ స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. శని, ఆది, సోమవారాలు, పండుగ రోజుల్లోనూ స్పర్శదర్శనం కల్పిస్తామని శ్రీశైలం దేవస్థానం ఈవో ప్రకటించారు.
స్పర్శదర్శనంపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లోనూ స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం నూతన ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. శని, ఆది, సోమవారాలు, పండుగ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తుల రద్దీ సమయాల్లో స్పర్శదర్శనాలు, అభిషేకాలు నిలిపివేస్తూ శ్రీశైలం దేవస్థానం గతంలో నిర్ణయం తీసుకుంది. భక్తుల విజ్ఞప్తి మేరకు దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో చర్చించి రద్దీ సమయాల్లోనూ స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. రద్దీ రోజుల్లో నాలుగు విడతల్లో అలంకార దర్శనం, మూడు విడతల్లో స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు ఈవో పేర్కొన్నారు.శని, ఆది, సోమవారాలతో పాటు, పర్వదినాలు, సెలవు రోజుల్లో కూడా స్పర్శ దర్శనానికి అవకాశం ఇస్తామని ఈవో స్పష్టం చేశారు. అయితే స్పర్శ దర్శనం కోసం భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లు పొందేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. శ్రీశైలం మల్లన్న నిత్యం వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. పండుగల సమయాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. ఇక కార్తీక మాసం, మహాశివరాత్రి రోజుల్లో శ్రీశైలం భక్తులతో కిటకిట లాడుతుంటుంది. హైదరాబాద్ కు సమీపంలో ఉండడంతో తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీశైల క్షేత్రానికి వస్తుంటారు. శ్రీశైలం ప్రాజెక్టు, ఘాట్ రోడ్డు అందాలు, రోప్ వే, బోటు ప్రయాణం, సీ ప్లేన్ టూరిజంతో శ్రీశైలంలో టూరిస్టుల సంఖ్య పెరుగుతోంది.
శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శ్రీశైలంలో నిన్న భక్తుల రద్దీ అధికంగా ఉంది. సోమవారం కావడంతో మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు చేసి, స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే దేవస్థానం అధికారులు అనుమతించారు. దీంతో స్వామి దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పట్టింది. క్యూలైన్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.శ్రీశైలం మల్లికార్జున స్వామి తెలంగాణ గద్వాలకు చెందిన ఓ భక్తుడు బంగారు నామాలను విరాళంగా అందించారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన అనికేత్ సాయి ఈవో శ్రీనివాసరావుకు 68 గ్రాముల బంగారు నామాలను అందించారు. త్రిపుండ్రాల నామాలను ప్రత్యేక పర్వదినాల్లో స్వామివారికి అలంకరించేందుకు విరాళంగా అందించినట్లు భక్తుడు అనికేత్ తెలిపారు. దాతకు స్వామి అమ్మవార్ల దర్శనంతో పాటు లడ్డూ ప్రసాదం, పరిమళ విభూది, కుంకుమ, శేష వస్త్రాలను పండితులు అందజేశారు.