వర్కౌట్ అయిన సోషల్ ఇంజనీరింగ్
కాకినాడ, జూన్ 27, (న్యూస్ పల్స్)
Social engineering worked
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ సోషల్ ఇంజినీరింగ్ మంచి ఫలితాలను ఇచ్చింది. మంత్రి వర్గ విస్తరణలో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన శెట్టిబలిజ కులానికి చెందిన వాసంశెట్టి సుభాష్‌కు మంత్రి పదవి దక్కింది. అమలాపురంకు చెందిన ఈయన అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి గెలుపొందారు.. తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సుభాష్‌కు మంత్రి పదవి దక్కింది. ఆయన టీడీపీకి దూరమైన శెట్టిబలిజల్ని దగ్గరకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. బీసీ ఉపకులాల్లో ఒకరైన శెట్టిబలిజ కులస్తులు టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీ వెంట నడిచిన వారే. అయితే మెల్లగా మారిపోయారు.
గత 20 ఏళ్లుగా వీరిలో ఎక్కువ శాతం మంది అప్పట్లో కాంగ్రెస్ వెంట నడిచారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడ్డ వైఎస్సార్ సీపీ వెంట నడిచారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత వీరాభిమానులు శెట్టిబలిజ వర్గంలోని పెద్దలు చాలా మంది ఉన్నారని చెబుతారు.. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే ఎక్కువ శాతం మంది నడిచారు..ఉభయగోదావరి జిల్లాలో ఎక్కువగా ఉన్న శెట్టిబలిజ కులాన్ని ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వంలో కూడా పెద్దపీట వేసిన పరిస్థితి ఉంది.. ఈ క్రమంలోనే రామచంద్రపురం నియోజకవర్గం నుంచి తొలిసారి గెలిచిన చెల్లుబోయిన గోపాలకృష్ణకు మంత్రి పదవిని కట్టబెట్టింది.
ఆ తరువాత ఎమ్మెల్సీ పదవుల కేటాయింపులో అమలాపురంకు చెందిన శెట్టిబలిజ కుల నాయకుడు కుడిపూడి సూర్యనారాయణరావుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నా శెట్టిబలిజ కులంలో కులం పేరు చెప్పి కొంత మందే పదవులు పొందుతున్నారు కానీ దిగువ క్యాడర్‌కు అన్యాయమే చేసిందని అసంతృప్తి వ్యక్తమయింది. దీనికి తోడు బీసీలకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్న వాదన బలంగా వినిపించడంతో అనూహ్యంగా శెట్టిబలిజ కులస్తులు కూడా క్రమక్రమంగా పార్టీకు దూరమవుతూ కనిపించింది.
ఉభయగోదావరి జిల్లాల్లో అత్యధికంగా ఉన్న కాపులు, శెట్టిబలిజలు ఒక్కటవ్వాలన్న నినాదం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా సారు వారాహి సభల వేదికగా అనేక సార్లు పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడ్డాక ఈ నినాదంకు మరింత బలం చేకూరింది.. వైసీపీపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న చాలా మంది శెట్టిబలిజ ద్వితీయశ్రేణి నాయకత్వం టీడీపీలోకి చేరింది.. ఈ మార్పే 2024 ఎన్నికల్లో కాపులు, శెట్టిబలిజలు ఏకమై కూటమి గెలుపులో కీలకంగా పనిచేసిన పరిస్థితి కనిపించింది…అమలాపురం అల్లర్లులో కేసుల్లో ఇరుక్కున వారు ఎక్కువ మంది కాపులు, శెట్టిబలిజలు కావడంతో వీరు ఆసంఘటన నుంచి కలిసే ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఆ తరువాత ఈ కేసుల్లో కొందరు అమాయకులు బలి అయ్యారని నష్ట నివారణ చర్యలు చేపట్టిన వైసీపీకు తిరిగి ఆ నష్టం మాత్రం పూడ్చలేని పరిస్థితి ఏర్పడింది.. శెట్టిబలిజ యూత్ ఫోర్స్ కన్వీనర్‌గా ఉన్న ప్రస్తుత కార్మికశాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్, కాపు నాయకుడు గంధం పళ్లంరాజులు మధ్య ముందు నుంచి ఉన్న స్నేహం ఈ రెండు వర్గాలను కలపడంలో ప్రధాన భూమిక పోషించిందని చెప్పాలి. రామచంద్రాపురంలో స్థానికుడు కాకపోయినా కూటమి తరపున బరిలో దిగిన వాసంశెట్టి సుభాష్‌ను ప్రధానంగా కాపు, శెట్టిబలిజ సామాజికవర్గాల కలయిక మంచి మెజార్టీతో గెలుపొందేలా చేసింది..
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ జయహో బీసీ సదస్సులు పేరిట నిర్వహించిన కార్యక్రమంలో శెట్టిబలిజ వర్గాలకు పెద్దపీట వేయడంతో మరింత జోష్ పెరిగి టీడీపీ వైపు మళ్లేలా చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు.. ఈ జోష్ కూటమి గెలుపుకు మరింత బలాన్ని చేకూర్చిందంటున్నారు.. ఈ ఎన్నికల్లో కూటమి భారీ విజయంలో కాపు, కమ్మ సామాజికవర్గాల కాంబినేషన్ ఎంతటి సక్సెస్‌ను ఇచ్చిందో ఉభయగోదావరి జిల్లాల్లో కాపు, శెట్టిబలిజ కాంబినేషన్ కూడా అంతే సూపర్ హిట్ అయ్యిందని విశ్లేషకులు చెబుతున్నమాట. బలమైన సామాజికవర్గంలో ఒకటైన శెట్టిబలిజ వర్గంలో అత్యధికశాతం టీడీపీ వైపుకు మళ్లడం మాత్రం వైసీపీకు చాలా నష్టాన్నే మూటగట్టిందని మాత్రం స్పష్టం అవుతుందంటున్నారు..
వైసీపీ పదవులన్నీ ఆ సామాజిక వర్గానికే | All the posts of YCP are for that social group| Eeroju news