రేవంత్ లో రెండో యాంగిల్
హైదరాబాద్, జూలై 26 (న్యూస్ పల్స్)
Second angle in Revanth
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో ఎన్నడూ చూడని రెండో యాంగిల్ కాంగ్రెస్ నేతలకు షాకిస్తోంది. అధికారం చేపట్టి తొలి రోజు నుంచి సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో చాలా క్లోజ్‌గా వ్యవహరిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఈ మధ్య సహచరులపై రుసరుసలాడుతున్నారని గాంధీభవన్ టాక్. ఏడు నెలలుగా ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం… ఎప్పుడూ సహచరులతో చాలా స్నేహ సంబంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజా ప్రభుత్వంగా చెబుతూ మంత్రులకు ప్రాధాన్యమివ్వడంతో పాటు.. ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా బాగా ప్రోత్సహించేవారు. కానీ, ఈ మధ్య సీఎంలో కాస్త మార్పు కనిపిస్తోందంటున్నారు.
కొందరు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తిగా ఉన్న సీఎం.. వారికి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. కొందరికి చీవాట్లు పెట్టిన సీఎం.. ఇకపై సీరియస్‌గా పని చేయాలని మాస్ వార్నింగ్ ఇవ్వడం కాంగ్రెస్ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తోంది. అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడే సీఎం ఒక్కసారిగా సీరియస్ కావడంతో నేతలు కూడా అవాక్కయారట. ప్రభుత్వ మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారని.. ప్రతి దానికి సీఎంగా తానే మాట్లాడాల్సి రావడం మంచిది కాదని సహచర మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారట సీఎం రేవంత్‌రెడ్డి.
కొందరు మంత్రుల శాఖలపై ఆరోపణలొచ్చినా కూడా స్పందించకపోవడమేంటని నిలదీశారట సీఎం. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేసే విమర్శలపై ఎమ్మెల్యేలు మాట్లాడకుండా మౌనంగా ఉండటమేంటని సీఎం క్లాస్ తీసుకోవడంతో వారంతా కంగుతిన్నారంటున్నారు. కొద్ది రోజులుగా ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థి, నిరుద్యోగుల అంశాన్ని బేస్ చేసుకొని బీఆర్ఎస్ నేతలు ప్రతిరోజూ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి సైతం ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ నేతలు టాక్స్ వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారని మంత్రులపై ప్రతిరోజూ ఆరోపణలు చేస్తున్నా… మంత్రులు, ప్రభుత్వ విప్‌లు ఎవరూ పట్టించుకోవడం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారట. ప్రతిరోజూ ప్రభుత్వంతోపాటు మంత్రులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నా, ప్రత్యర్థులను లైట్‌గా తీసుకోవడంపై సీఎం క్లాస్ పీకినట్లు సమాచారం. సోషల్ మీడియాలో సైతం ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తుంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి కూడా కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని సీఎం సీరియస్ అయినట్లు తెలుస్తోంది.
కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలను సచివాలయానికి పిలిపించుకొని మాట్లాడిన సీఎం.. ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కోలేకపోవడంపైనే క్లాస్ పీకినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజు నుండి ఎంతో నిబద్దతతో పనిచేస్తుంటే.. దాన్ని చెప్పుకోవడంలో విఫలమవుతున్నామని భావిస్తున్న సీఎం.. సహచరులకు బాధ్యత ఉండాలని క్లాస్ పీకడంపై విస్తృత చర్చ జరుగుతోంది. కొన్ని విషయాల్లో ప్రభుత్వం సైలెంట్‌గా ఉండేసరికి సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు రెచ్చిపోతున్నాయని, ఇక ఉపేక్షించేది లేదని సంకేతాలివ్వాలని సహచరులకు సూచించారట సీఎం..బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై గులాబీ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న అంశం కూడా చర్చకు వచ్చింది. నిరుద్యోగుల అంశాన్ని సాకుగా చూపిస్తూ బీఆర్ఎస్ నేతలు రాహుల్ గాంధీపై సెటైర్లు వేస్తున్న అంశం ప్రస్తావనకు వచ్చిందని చెబుతున్నారు.
ఇంత జరుగుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు డ్యామేజ్ కంట్రోల్ చేయడంలో విఫలమవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం… ప్రతిపక్షాలు పనిగట్టుకొని ప్రభుత్వంపై బురద చల్లుతుంటే ప్రభుత్వం తరఫున స్పందించాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు ఏమీ పట్టనట్లు ఉండడం భావ్యం కాదని క్లాస్ తీసుకున్నారు ముఖ్యమంత్రి. అన్నింటికి తానే మాట్లాడాలా? మీరంతా ఏం చేస్తున్నారు? ప్రతిపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తుంటే చూస్తూ కూర్చుంటారా? స్పందించాల్సిన అవసరం మీకు లేదా? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సీఎం హోదాలో ఉండి ప్రతి విమర్శపైనా తాను స్పందించలేనని.. ఈ మాత్రం కూడా మీకు తెలియదా అంటూ సహచర మంత్రులు, ఎమ్మెల్యేలకు చురకలు పెట్టారట ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఇక నుంచి అవసరాన్ని బట్టి అందరూ మాట్లాడాల్సిందేనని సీఎం ఆదేశించారట. ఎవరు ఏం చేస్తున్నారో తనకి తెలుసని, తమకు అంటీ ముట్టనట్లు ఎవరైనా ఉంటే వారిని ఏం చేయాలో తనకు తెలుసని సీఎం స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ మంత్రుల్లో మార్పు కనిపిస్తోందని అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు.. సీఎం క్లాస్ పీకిన తర్వాతనే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు మీడియా ముందుకు వస్తున్నట్లు చెబుతున్నారు.