కౌలు రైతులను గుర్తించే పనిలో సర్కార్…
హైదరాబాద్, జూలై 8, (న్యూస్ పల్స్)
Rythu Bharosa Revant Sarkar for Tenant Farmers
రైతు భరోసా స్కీమ్ విధివిధానాల తయారు కోసం రైతుల నుంచి వ్యవసాయ శాఖ సలహాలు, సూచనలు తీసుకుంటున్నది. ఇప్పటివరకు సుమారు 31 వేల మంది రైతులు ఈ స్కీమ్పై తమ అభిప్రాయాలు తెలుపగా, అందులో మెజార్టీ రైతులు ఐదెకరాలకు కటాఫ్ పెట్టి రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని కోరినట్లు ప్రభుత్వవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కటాఫ్ లేకుండా స్కీమ్ అమలు చేయడం వల్ల ప్రజాధనం వృథా అవడంతో పాటు అనుకున్న లక్ష్యం నెరవేరదని అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. రైతు భరోసా స్కీమ్ కోసం ఎలాంటి కండీషన్లు పెట్టాలనే అంశంపై త్వరలో జరుగనున్న బడ్జెట్ సమావేశాల్లో చర్చకు పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ఈ లోపు రైతుల నుంచి కూడా అభిప్రాయాలు, సూచనలు తీసుకుంటున్నది. రైతు వేదిక లు, వ్యవసాయ సహకార సంఘాలు, జిల్లా, మండల పరిషత్ సమావేశాల సమయంలో అక్కడికి వచ్చిన రైతులు, రాజకీయ నాయకుల నుంచి వ్యవసాయ శాఖ సలహాలు స్వీకరిస్తున్నది. ఇప్పటివరకు సుమారు 31 వేల మంది నుంచి లిఖిత పూర్వకంగా సలహాలు సేకరించినట్టు తెలిసింది. అందులో మెజార్టీ మంది ఐదెకరాలకు కటాఫ్ పెట్టి, రైతు భరోసా స్కీమ్ అమలు చేయాలని చెప్పినట్టు సమాచారం. అసలైన రైతులకు ప్రయోజనం కలగాలంటే, కండీషన్లు పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు వ్యవసాయ శాఖ సేకరించిన అభిప్రాయాలు, సూచనలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని సబ్ కమిటీకి సమర్పించే చాన్స్ ఉంది. త్వరలో మంత్రుల సబ్ కమిటీ రైతులు, రైతు సంఘాలు నుంచి అభిప్రాయాలు సేకరించే అవకాశం ఉంది. అందుకోసం ప్రత్యేకంగా జిల్లాలో పర్యటించే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ ప్రక్రియ మొత్తం ఈ నెల చివరిలోపు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్టు తెలిసింది. ఈ లోపు వ్యవసాయ శాఖ మరిన్ని జిల్లాలకు చెందిన రైతుల నుంచి సలహాలు తీసుకోవాలని భావిస్తోంది.
లిఖిత పూర్వకంగా మాత్రమే సలహాలు తీసుకోవాలని, వీలైతే రైతు పేరు, ఫోన్ నెంబర్ వివరాలను సేకరించాలని భావిస్తున్నట్టు సమాచారం. రైతు భరోసా స్కీమ్ను కౌలు రైతులకు సైతం వర్తింపజేస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది. దీంతో కౌలు రైతులను గుర్తించడం పెద్ద సమస్యగా మారిందనే చర్చ జరుగుతున్నది. ఎలా గుర్తించాలి అనే అంశంపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. కౌలు చేస్తున్న రైతు ఇచ్చిన సమాచారం సరిపోదని, భూ యజమాని తన భూమిని ఫలాన రైతుకు కౌలుకు ఇచ్చినట్టు అఫడవిట్ సమర్పిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎంత మంది అఫిడవిట్ ఇచ్చేందుకు ముందుకు వస్తారనే అనుమానం అధికారులకు పట్టుకున్నది.