రోజాకు బిగిస్తున్న ఉచ్చు
తిరుపతి, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్)
ఆర్కే రోజా టీడీపీ హిట్ లిస్ట్ లో అగ్రభాగాన ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ టీడీపీ నేతల చెవుల్లో మారుమోగిపోతున్నాయి. దీంతో రోజా విషయంలో కూటమి సర్కార్ సీరియస్ గానే ఉందని తెలిసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆర్కే రోజాను కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నగరి ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే రోజా తర్వాత మంత్రిగా నాటి వైసీపీ హయాంలో బాధ్యతలను స్వీకరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 నుంచి 2024 వరకూ ఆర్కే రోజా టీడీపీముఖ్య నేతలపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ప్రధానంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లపై ఆమె చేసిన వ్యాఖ్యలతో నాడే టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు ఆర్కే రోజా టూరిజం, క్రీడల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన లొసుగులను ఆసరాగా చేసుకుని ఆమెపై కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆడుదాం ఆంధ్ర పేరిట గత ప్రభుత్వ హయంలో పెద్దయెత్తున కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆడుదాం ఆంధ్రపేరిట వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఆర్కే రోజాపై టీడీపీ నేతలు సీఐడీకి ఫిర్యాదులు చేశారు. దీనిపై సీఐడీ విచారణ కూడా ప్రారంభించనట్లు తెలిసింది. ఎన్ని నిధులు వెచ్చించారు? ఎంత క్రీడాకారుల కోసం ఉపయోగించారన్న దానిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టారు.
మంత్రిపదవి వచ్చిన తర్వాత… ఆర్కే రోజా కూడా తొలుత టీడీపీలో ఉండి తర్వాత వైసీపీలోకి వచ్చిన వారే. వైసీపీలోకి వచ్చిన తర్వాత ఆర్కే రోజా నగరి నియోజకవర్గం నుంచి 2014, 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2024లో జరిగిన ఎన్నికలలో మాత్రం ఓటమి పాలయ్యారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన రోజా తన పదునైన కామెంట్స్ తో టీడీపీ నేతలతో పాటు పవన్ కల్యాణ్ ను కూడా టార్గెట్ చేశారు. అయితే మంత్రివర్గంలో చోటు కోసమే రోజా నాడు చెలరేగి మాట్లాడారన్న వార్తలు కూడా వచ్చాయి. రోజా ఆశించినట్లుగానే కేబినెట్ లో జగన్ చోటు కల్పించారు. 2019లో గెలిచిన వెంటనే రోజాకు మంత్రి పదవి రాకపోవడంతో ఆమె ప్రమాణస్వీకార కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు. అయితే మంత్రి వర్గ పునర్వ్యస్తీకరణలో భాగంగా జగన్ ఆమెకు అవకాశమిచ్చారు. క్రీడా, పర్యాటక, యువజన సర్వీసుల శాఖను అప్పగించడంతో ఆమె మరింత రెచ్చిపోయారు. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే పాత్యా సంఘం, కబడ్డీ అసోసియేషన్ లు సీఐడీకి ఫిర్యాదు చేశాయి. వంద కోట్ల రూపాయల స్కాం జరిగిందని వారు ఆరోపించారు కూడా. తాజాగా వల్లభనేని వంశీ అరెస్ట్ కావడంతో ఇక రోజా మెడ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందన్న వార్తలు వస్తున్నాయి. ఆర్కే రోజా పై కేవలం ఇదే కాకుండా తిరుమలలో దర్శనం టిక్కెట్ల విషయంపై కూడా ఫిర్యాదులు చేసే అవకాశాలున్నాయి. దీంతో రోజాకు రానున్న రోజులు కష్టాలు తప్పవని వైసీపీ నేతలే చెబుతున్నారు.
=========================
RK Roja | రోజాకు రియల్ సినిమా.. | Eeroju news