కేటీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ ఫైర్
హైదరాబాద్, ఆగస్టు 20
Revanth fires on KTR’s comments
సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే… తాము అధికారంలోకి వచ్చాక దానిని తొలగిస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం తగ్గలేదని విమర్శించారు. అనవసర ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ నేతలను తెలంగాణ సమాజం బహిష్కరిస్తుందని హెచ్చరించారు. డిసెంబర్ 9 లోపు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా… సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తదితరులు పంజాగుట్టలోని రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… దేశంలో విప్లవాత్మక మార్పులకు రాజీవ్ గాంధీ శ్రీకారం చుట్టారన్నారు. దేశానికి టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.పంచాయతీరాజ్ వ్యవస్థలు రాజీవ్ గాంధీ హయాంలోనే బలోపేతమయ్యాయని పేర్కొన్నారు. తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను యంగ్ ఇండియా రెసిడెన్షియల్ అకాడమీలుగా మార్చుతామని తెలిపారు.
నేను రేవంత్ వెంటే ఉంటా
ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నానని సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆగస్ట్ 1 నాడు మాదిగలకు, మాదిగ ఉపకులాలకు స్వాతంత్ర్యం వచ్చిందని రేవంత్ చెప్పారని తెలిపారు. తనకు ఎన్నికల్లో సీట్ రాలేదని మొన్నటి వరకు ఎంతో బాధ ఉండేదని… కానీ ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత… ఆ విషయాన్ని అసెంబ్లీలో సీఎం ప్రకటించిన తర్వాత ఎంతో ఆనందపడ్డానని చెప్పారు. రేవంత్ రెడ్డి ప్రకటన మాదిగ జాతి మొత్తానికి ధైర్యాన్ని ఇచ్చిందని మోత్కుపల్లి అన్నారు.
జాతి మొత్తం రేవంత్ వెంట ఉందని… ఆయనకు తాము అన్ని విధాలుగా రుణపడి ఉంటామన్నారు. రేవంత్ శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండొచ్చని చెప్పారు. దేశానికే ఆదర్శవంతమైన సీఎంగా రేవంత్ నిలుస్తారని అన్నారు. మంద కృష్ణ మాదిగను కూడా రేవంత్ కు అండగా తీసుకొస్తామని చెప్పారు. తనకు ఎలాంటి పదవి అవసరం లేదని… ఒక కార్యకర్తగా ముఖ్యమంత్రి వెనుక ఉంటూ పని చేస్తానని తెలిపారు. రిజర్వేషన్లపై రేవంత్ ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని మోత్కుపల్లి కోరారు. 80 లక్షల మంది మాదిగలను హైదరాబాద్ కు తీసుకొచ్చి సభ పెడతామని చెప్పారు. మాదిగ జాతికి సీఎం రేవంత్ పెద్ద మాదిగ అన్నారు.