టీడీపీలోనూ రెబల్ ముద్ర
నరసాపురం, జూలై 17, (న్యూస్ పల్స్)
Rebel Mudra Raghuramakrishnam in TDP too
రఘురామకృష్ణం రాజు అప్పుడే మొదలు పెట్టారా? అసమ్మతి రాజకీయాలకు బీజం వేస్తున్నారా? స్వపక్షంలో విపక్షపాత్రను ప్రారంభించారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.ఈ ఎన్నికల్లో టిడిపి తరఫున ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు రఘురామ.మంచి మెజారిటీతో గెలిచారు. మంత్రి పదవి ఆశించారు. కానీ ఎందుకో చంద్రబాబు కేటాయించలేదు. ముందుగా శాసనసభ స్పీకర్ పదవి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు దక్కింది సభాపతి పదవి. దీంతో సాధారణ ఎమ్మెల్యే గానే రఘురామకృష్ణం రాజు కొనసాగాల్సి వస్తోంది. అయితే ఇటీవల యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు రఘురామ.
చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో టీడీపీలో సైతం రఘురామ మొదలు పెట్టేసారా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేశారు రఘురామకృష్ణంరాజు. అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. కానీ అక్కడికి ఆరు నెలలు తిరగకముందే పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధినాయకత్వాన్ని విభేదించారు. జగన్ తో జగడం పెట్టుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులతో చేయి కలిపారు. గిట్టని వారితో చట్టపట్టలేసుకుని తిరిగారు.
ఎల్లో మీడియాతో అంటగాకారు. వాటికి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. డిబేట్ లలో పాల్గొన్నారు. వైసీపీ సైతం ఆయనపై అనర్హత వేటు వేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. అరెస్టు చేయించి రాజా ద్రోహం కేసు కూడా వేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీలో విపక్షాలకు రఘురామకృష్ణం రాజు ఒక వనరుగా మారిపోయారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా రఘురామకృష్ణం రాజుకు అవకాశం ఇవ్వకపోవడంతోనే ఆయన అసంతృప్తి ప్రారంభమైంది. వైసిపి పార్లమెంటరీ పార్టీ నేతగా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి జగన్ అవకాశం ఇచ్చారు. రాజ్యసభలో వైసీపీ పక్ష నేతగా విజయసాయి రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. ఆ ఇద్దరు నేతలకు ఢిల్లీ రాజకీయ బాధ్యతలు అప్పగించారు. అయితే ఇది రఘురామకృష్ణంరాజుకు నచ్చలేదు.
సీనియర్ గా ఉన్న తనను నియమించాలని ఆయన కోరారు. కానీ జగన్ పరిగణలోకి తీసుకోలేదు. అప్పటినుంచి ఒక రకమైన అసంతృప్తితో రఘురామకృష్ణంరాజు గడిపేవారు. అదే అసమ్మతికి దారితీసింది. ఆయనను పార్టీ నుంచి దూరం చేసింది. రెబల్ గా మారిన రఘురామకృష్ణం రాజు.. జగన్ పతనమయ్యే వరకు వదలనని తేల్చి చెప్పారు. అలాగే చేసి చూపించారు. రఘురామకృష్ణం రాజును జగన్ నిలువరించాలని ప్రయత్నం చేసినా దొరకలేదు. చివరకు టిడిపిలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తాజాగా యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు రఘురామకృష్ణం రాజు. చంద్రబాబు సర్కారులో మంత్రి పదవి దక్కక పోవడంపై అడిగిన ప్రశ్నకు సమాధానం గా చెప్పిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
మంత్రి పదవి అన్ని కులాలకు ఇవ్వలేరు. చంద్రబాబు భయపడే కులాలు కొన్ని ఉంటాయి. నచ్చని కులాలు కూడా ఉండొచ్చు. భయపడే కులాలకు ఎక్కువ పదవులు ఇచ్చి.. నచ్చని కులాన్ని పక్కన పెట్టొచ్చు అని కామెంట్స్ చేశారు. బ్రాహ్మణ కులం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని.. క్షత్రియ కులంలో ఆరేడుగురు ఎమ్మెల్యేలు గెలిచిన మంత్రి పదవి ఇవ్వలేదని రఘురామ గుర్తు చేశారు. రఘురామ కృష్ణంరాజు చేసిన కామెంట్స్ పై ఇప్పుడు టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. ఆయన ఎక్కడ ఉన్నా వైఖరి మారదని విమర్శలు వస్తున్నాయి.
వైసిపి మాదిరిగా ఇక్కడ చేస్తామంటే కుదిరే పని కాదు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇంకోవైపు ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామి. అందుకే వైసిపి మాదిరిగా రఘురామకృష్ణంరాజు తోక జాడిస్తానంటే కుదిరే పని కాదు. అంతవరకు ఛాన్స్ ఇవ్వరు కూడా చంద్రబాబు. అయితే రఘురామ విషయంలో టిడిపి శ్రేణులు సైతం కొంచెం ఆగ్రహంతో ఉన్నాయి. ఏ పార్టీ పట్టించుకోని క్రమంలో చంద్రబాబు పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అదే విషయాన్ని గుర్తు చేసుకొని నడుచుకోవాలని సూచిస్తున్నారు టిడిపి శ్రేణులు. మరి రఘురామకృష్ణం రాజు ఎంతవరకు కుదురుగా ఉంటారో చూడాలి.