రేషన్ కార్డులకు లైన్ క్లియర్
వరంగల్, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్)
Ration card
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. కుటుంబాల నుంచి వేరు పడిన వారు, పెళ్లిళ్లు చేసుకున్నవారు కొత్త రేషన్ కార్డుల కోసం ఆశగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్ కార్డు ఆశావాహులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని తాజాగా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సోమవారం భేటీ అయిన కేబినెట్ సబ్ కమిటీ రేషన్ కార్డుల జారీపై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది.
కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులు జారీ చేసే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.అయితే కొత్త రేషన్ కార్డుల అర్హతపై సస్పెన్స్ కొనసాగుతోంది. కార్డుల జారీకి లబ్ధిదారుల ఆదాయ పరిమితి, అర్హతలపై నిబంధనలను పున:సమీక్షిస్తామని చెప్పడంతో ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. బియ్యం అవసరం లేని వారికి స్మార్ట్ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పడంపైనా అనుమానాలున్నాయి. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షల్లోపు, పట్టణాల్లో రూ.2లక్షల్లోపు ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.అలాగే 3.5 ఎకరాలలోపు తడి, 7.5 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవారికి మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిసింది.
అయితే ఏపీ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్లో ఆదాయ పరిమితులు పరిశీలించామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. రాష్ట్రంలోనూ పరిమితి పెంచాలా? తగ్గించాలా? ప్రస్తుత నిబంధనలే కొనసాగించాలా? అనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 21న ఈ అంశంపై తుది నిర్ణయం రానుంది. ప్రస్తుతం తెలంగాణలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈసారి కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు విడివిడిగా అందిస్తామని మంత్రుల సబ్ కమిటీ వెల్లడించింది.
అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు, హెల్త్కార్డులు అందిస్తామన్నారు. కొత్త రేషన్కార్డుల జారీపై తుది ప్రక్రియ నెలాఖరులోగా పూర్తి చేయనున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ 21వ తేదీన మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుండగా.. ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. అక్టోబర్లో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందిచనున్నారు.
Online registration | ఇంకా అందుబాటులోకి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ | Eeroju news