Ratan Tata | దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా కన్నుమూత | Eeroju News

ratan tata

Ratan Tata | దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా కన్నుమూత

 

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. రతన్‌ టాటా మరణ వార్తను టాటాసన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ధ్రువీకరించారు. రతన్‌ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ సంతాపం వ్యక్తం చేశారు. రతన్‌ టాటా మరణవార్త తెలిసిన వెంటనే బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రికి రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ స్వయంగా వెళ్లారు. రతన్‌ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

రతన్‌ టాటా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సోమవారం మీడియాలో వార్తలు వచ్చాయి. దీనితో “నా ఆరోగ్యం బాగానే ఉంది. వైద్య పరీక్షల కోసమే ఆసుపత్రికి వెళ్లా. ఎలాంటి ఆందోళన అవసరం లేదు” అని ఆయన అదే రోజు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా స్పష్టతనిచ్చారు. కానీ అంతలోనే ఆయన ఆరోగ్యం విషమించి దివంగతులయ్యారు. రతన్‌ టాటా ఇక లేరని బాధాతప్త హృదయంతో ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ ఛైర్మన్‌ హర్ష్‌ గోయెంకా తొలుత ప్రకటించారు. ఆ తరువాత టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ ఆ విషయాన్ని ధ్రువీకరించారు. “ఒక అసాధారణ నాయకుడికి వీడ్కోలు పలుకుతున్నాం. టాటా గ్రూప్‌నే కాకుండా దేశ రూపురేఖలను మార్చిన వ్యక్తి రతన్‌ టాటా. నాకు ఆయన మిత్రుడు, మార్గదర్శి, గురువు. వినూత్నత, ప్రత్యేకతలతో ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించారు” అని ఎన్‌.చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు.

రతన్‌ టాటా మహాప్రస్థానం!

రతన్​ టాటా 1937 డిసెంబర్‌ 28న ముంబయిలో నావల్‌ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించారు. 1962లో కార్నెల్‌ యూనివర్సిటీ నుంచి బీ-ఆర్క్‌ డిగ్రీ సంపాదించారు. తరువాత టాటా గ్రూప్‌లో చేరారు. తొలుత టాటా స్టీల్‌ సంస్థలో షాప్‌ ఫ్లోర్‌లో ఉద్యోగిగా ఆయన పనిచేశారు. 1971లో నేషనల్‌ రేడియో, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్‌డీ టాటా నుంచి టాటా సన్స్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన టాటా గ్రూప్‌నకు కూడా నేతృత్వం వహించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్‌నకు రతన్‌ టాటా ఛైర్మన్‌గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2000లో రతన్‌ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ను, 2008లో పద్మవిభూషణ్‌ పురస్కారాలను అందించింది.

Prime Minister Modi | మేం చేసిన అభివృద్ధి వల్లే మూడోసారి విజయం సాధించాం.. ప్రధానమంత్రి మోదీ | Eeroju news

దాతృత్వంలో కర్ణుడు రతన్‌ టాటా
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమయంలో, దేశ ప్రజలు​ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో టాటా సంస్థ తన విశాల హృదయాన్ని చాటుకుంది. మహమ్మారిపై పోరు కోసం రూ.1500 కోట్ల భూరి విరాళం ఇస్తున్నట్లు రతన్‌ టాటా ప్రకటించారు. ‘అత్యంత కఠినమైన సవాలు మానవాళి ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభ సమయంలో కొవిడ్-19పై పోరాటానికి అత్యవసర వనరులను సమకూర్చాల్సి ఉంది. వైరస్ ప్రభావానికి గురైన అన్ని వర్గాలను ఆదుకోవడానికి టాటా ట్రస్టు కట్టుబడి ఉంది. రోగులకు ముందుండి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కవచాలు, నానాటికీ పెరుగుతున్న రోగులకు కృత్రిమ శ్వాస అందించి, తగిన చికిత్స చేయడానికి అవసరమైన పరికరాలు, పరీక్షల సంఖ్య పెంచడానికి అనువైన టెస్టింగ్ కిట్లు, రోగులకు ఆధునిక సౌకర్యాలు అందించడానికి, సాధారణ ప్రజలు, ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన అవగాహన కల్పించడానికి రూ.500 కోట్లు ఖర్చు చేస్తాం’ అని రతన్ టాటా ప్రకటించారు. అంతే కాదు తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ, ‘సరిలేరు ఆయనకెవ్వరూ’ అని నిరూపించుకున్నారు.

Related posts

Leave a Comment