మళ్లీ యాక్టివ్ గా రామ్ మాధవ్
శ్రీనగర్, ఆగస్టు 22, (న్యూస్ పల్స్)
Ram Madhav is active again
జమ్ము-కశ్మీర్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోకి భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లడంలో కీలక నేత రామ్ మాధవ్ కృషి ఉందని కార్యకర్తల నుంచి కీలక నేతల వరకు అంగీకరించారు. జమ్ము-కశ్మీర్ లో 2015లో పీడీపీతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో ఆయన పాత్ర కీలకమైంది. బీజేపీని ఆ రాష్ట్ర ప్రభుత్వంలో చేర్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. నాలుగేళ్ల తర్వాత మరోసారి ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఇందుకు బీజేపీలో పెద్ద చర్చలే సాగాయి. త్వరలో జమ్ముకశ్మీర్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కో ఇన్ చార్జిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు రామ్ మాధవ్ ను పార్టీ నియమించింది. ఇక ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కూడా కావడం గమనార్హం. కాగా, ఐదేండ్ల పాటు పార్టీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రామ్ మాధవ్ ను 2020లో పార్టీ ఆ పదవి నుంచి తొలగించింది.
2021లో తిరిగి ఆర్ఎస్ఎస్ కేంద్ర కమిటీలో చేరారు. జమ్ము కశ్మీర్ తో పాటు ఈ శాన్య రాష్ట్రంలో బీజేపీ ప్రస్థానంపై నేతలు, కిందిస్థాయి నేతలో రామ్ మాధవ్ కృషిపై విస్తృత చర్చ జరుగుతున్నది. జమ్ము కశ్మీర్ ఎన్నికల కోసం రామ్ మాధవ్ ను తేవడం వెనుక ఆయన సమర్ధత, నిబద్ధతను పార్టీ మరోసారి గుర్తించినట్లు అయ్యింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందనే ఊహాగానాలను తోసిపుచ్చుతూ ఈ నియామకం జరిగింది. ఆయనకు అప్పగించిన బాధ్యతల్లో ఎన్నో విజయాలను గతంలో నమోదు చేసుకున్నారు. ఇక జమ్ముకశ్మీర్ లో బీజేపీ ఊహించిన ఫలితాలు సాధిస్తే, రామ్ మాధవ్ కు మరింత అగ్రపీఠం దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు.
రామ్ మాధవ్ గురించి ఒక కార్యకర్త మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే కీలక అర్కిటెక్ట్ గా మాధవ్ ప్రయాణం ఉంటుందని, ఇది ఆయన ప్రయాణంలో పునర్నిర్మాణం లాంటిదని పేర్కొన్నారు. 2020లో తనను పదవి నుంచి తొలగించిన తర్వాత ఆర్ఎస్ఎస్ లో ఇండియా ఫౌండేషన్ కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండిపోయాడు. విదేశాంగ విధాన ఆలోచనలను రూపొందించడంలో నిమగ్నమయ్యాడు. డజనుకు పైగా పుస్తకాలు రాసిన ఆయన మేధస్సు, వ్యూహాత్మక ఆలోనలకు మంచి పేరుంది. బీజేపీని పలు రాష్ర్టాల్లోకి తీసుకెళ్లడంలో ఆయన వ్యూహాలు గతంలో గట్టిగా పని చేశాయి. ఇక పార్టీలోని చాలా మంది సీనియర్ నాయకుల వలే కాకుండా రామ్ మాధవ్ పార్టీ కార్యకర్తలను ప్రేరేపించగలడు. అతని వాక్చాతుర్యం ఆర్ఎస్ఎస్ లో కీలకంగా ఎదిగేలా చేసింది.
బహుముఖ ప్రతిభాశాలిగా ఆయన ఎలాంటి కష్టసాధ్యమైన పనులైననా సాధించగలడనే పేరుంది. కశ్మీర్ లో ప్రస్తుతం ఆయన సేవలు అవసరం. కశ్మీర్ గురించి పలు సందర్భాల్లో ఆయన మాట్లాడారు. జేకే శాంతి ప్రక్రియలో స్థానికులను భాగస్వాములను చేయాలి వాదించిన బీజేపీ నేతల్లో ఆయన ఒకరు.కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, కశ్మీర్ గురించి చర్చల్లో స్థానిక ప్రాతినిథ్యం లేకపోవడం తీవ్రమైన సమస్యగా ఆయన గతంలో పలుమార్లు అభిప్రాయపడ్డారు. జమ్ముకశ్మీర్ లో నిర్వహించే ప్రతి రాజకీయ కార్యక్రమంలో స్థానికుల పాత్ర ఉండాలనేది ఆయన మాట. అదే జమ్ము కశ్మీర్ లో రామ్ మాధవ్ కు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక రానున్న ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు రామ్ మాధవ్ సాధిస్తారో వేచిచూడాలి.
Excise again in place of Seb | సెబ్ స్థానంలో మళ్లీ ఎక్సైజ్ | Eeroju news