Rajiv gandhi | రాజీవ్ గాంధీ విగ్రహంపై రాద్దాంతం… | Eeroju news

Rajiv gandhi

రాజీవ్ గాంధీ విగ్రహంపై రాద్దాంతం…

హైదరాబాద్, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్)

Rajiv gandhi

అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రశ్నలు సహజం. ఆరోపణలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండటం ప్రజాస్వామ్యానికి అవసరం. ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వాన్ని నిలబెట్టడం.. తప్పు చేస్తే ప్రజా కోర్టులో బోనెక్కించడానికి ప్రతిపక్షం పని చేయాలి. కానీ, ప్రతిపక్షం అయినంత మాత్రానా ప్రభుత్వంపై అక్కర్లేని ఆరోపణలు, అనవసర రాద్ధాంతాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఏ పనికి శ్రీకారం చుట్టినా అడ్డుతగిలి ఆటంకపరచాల్సిన పనీ లేదు. అనవసర వాద ప్రతివాదనలు చేస్తూ ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడాన్ని ఎవరూ హర్షించరు. ఇప్పుడు విగ్రహంపై బీఆర్ఎస్ చేస్తున్న గొడవపై ఇలాంటి కామెంట్లే వినిపిస్తున్నాయి.

కొత్త సచివాలయంలో తాము ఒక ఐలాండ్ ఏర్పాటు చేశామని, అందులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తాము ఆలోచించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని దశాబ్ద వేడుకల్లో ఆవిష్కరించాలని తాము భావించినట్టు చెప్పారు. ఇక్కడో గమ్మత్తు విషయమేమిటంటే.. బీఆర్ఎస్ ప్రకారం తెలంగాణ దశాబ్ది(నవాబ్ది) ఉత్సవాలు జరిగిపోయాయి. తొమ్మిదేళ్లకే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలంటూ వేడుకలు నిర్వహించింది, అది వేరే విషయం. తెలంగాణ తల్లి విగ్రహం కోసమని.. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎందుకు అభ్యంతర పెడుతున్నారనేది కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్న ప్రశ్న.

తెలంగాణ తల్లి కొలువుదీరాల్సిన చోట ప్రతిష్టించిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగించి గాంధీ భవన్‌కు పంపుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. వారు ఏం చేసుకున్నా తాము వెనక్కి తగ్గబోమని, తమ ప్రభుత్వం వచ్చాక ఇది చేసి తీరుతామన్నారు.తాము తెలంగాణ తల్లి విగ్రహానికి వ్యతిరేకం కాదని, ఇంకా చెప్పాలంటే.. ఈ డిసెంబర్ 9వ తేదీన ఇదే సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని, అది తమ బాధ్యత అని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసేశారు.

డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ఏర్పాటుపై నాటి కేంద్ర ప్రభుత్వం తొలి ప్రకటన చేసింది. అదే రోజు సోనియా గాంధీ జన్మదినం కూడా. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఈ రోజే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్ చేసింది.పదేళ్లు అధికారంలో ఉండి కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయని బీఆర్ఎస్‌కు ఇప్పుడు తాము సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టగానే ఆ విషయం ఎందుకు గుర్తుకు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. నాటి బీఆర్ఎస్ సర్కారు పెట్టకపోయినా తాము తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి తీరుతామని స్పష్టం చేశారు.

అలాంటప్పుడు తెలంగాణ తల్లికి అవమానం జరిగిందని, పాలాభిషేకాలతో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనకు పిలుపు ఇవ్వడంతో ఆంతర్యం ఏమిటో వారికే తెలియాలని కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి.రాజీవ్ గాంధీ కాంగ్రెస్ నాయకుడనే ఒకే ఒక్క కారణంతోనే బీఆర్ఎస్ ఆయన విగ్రహాన్ని వ్యతిరేకిస్తున్నదని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కానీ, ఆయన పూర్వ ప్రధాని కూడా.. దేశంలో టెక్నాలజీకి దారులు వేసిన దార్శనికుడని, దేశాభివృద్ధికి పాటుపడిన మహా నాయకుడని, దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం ఆయనదని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాలని, గ్రామాలు సాధికారత సాధించాలనే ఆలోచనతో గ్రామ పంచాయతీ వ్యవస్థలో కీలక మార్పులు తెచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడంలో తప్పేమీ లేదని, ఆయన కృషిని స్మరించడంలో పొరపాటేమీ లేదని వివరిస్తున్నారు. బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని మండిపడుతున్నారు.

Rajiv gandhi

 

Rahul Gandhi is a ‘dangerous person’ MP Kangana Ranaut | రాహుల్ గాంధీ ‘ప్రమాదకర వ్యక్తి’ : ఎంపీ కంగన రనౌత్ | Eeroju news

Related posts

Leave a Comment