వయానాడ్ నుంచి ప్రియాంక
తిరువనంతపురం, జూన్ 18, (న్యూస్ పల్స్)
Priyanka from Wayanad
కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ గత లోక్ సభ ఎన్నికల్లో తాను గెలిచిన రెండు సీట్లలో ఒకదాన్ని వదులుకోవాల్సి ఉండగా.. కేరళలోని వయనాడ్ సీటును వదులుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇకపై తాను ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్ బరేలీ ఎంపీగానే కొనసాగుతానని వెల్లడించారు. రాయ్ బరేలీ పార్లమెంటు నియోజకవర్గం గాంధీల ఫ్యామిలీకి తొలి నుంచి కంచుకోటగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఖాళీ అవనున్న వయనాడ్ పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది.
ఈ ఉప ఎన్నికలో ప్రియాకా గాంధీ వాద్రా పోటీ చేయనున్నట్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ ఉప ఎన్నిక ద్వారానే ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి ప్రియాంకా గాంధీ అడుగు పెట్టబోతున్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కాస్త భావోద్వేగానికి గురయ్యారు. తన పోరాటానికి వయనాడ్ నియోజకవర్గ ప్రజలు ఎంతో మద్దతిచ్చారని గుర్తు చేసుకున్నారు.
ఆ స్థానాన్ని వదులుకుంటున్నందుకు తాను ఎంతో మదనపడ్డానని అన్నారు. అక్కడి ప్రజలతో తన బంధం కొనసాగుతూనే ఉంటుందని.. తాను ఎప్పుడూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడే ఉంటానని అన్నారు. తన సోదరి ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయబోతుందని.. ఆమె ఉత్తమ ప్రతినిధి కాబోతుందని నమ్ముతున్నట్లు రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. తాను మహిళ అయినప్పటికీ వయనాడ్ నుంచి అక్కడి ప్రజల కోసం పోరాడగలనని అన్నారు. రాహుల్ గాంధీ అక్కడ లేరనే భావనను వయనాడ్ ప్రజలకు కలగనివ్వబోనని ప్రియాంక గాంధీ అన్నారు.