వైఎస్ జగన్ నివాసం వద్ద ప్రైవేటు సెక్యూరిటీ | Private security at YS Jagan’s residence | Eeroju news

వైఎస్ జగన్ నివాసం వద్ద ప్రైవేటు సెక్యూరిటీ

గుంటూరు, జూన్ 18, (న్యూస్ పల్స్)

Private security at YS Jagan’s residence

ఏపీలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం వద్ద ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. నివాసం వద్ద పోలీసు సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. దాదాపు 30మందితో కొత్తగా సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం ముందు నుంచి సామాన్య ప్రజలు వెళ్లకుండా పోలీసులు కట్టడి చేశారు. ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. దీంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 1.5 కిలో మీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వచ్చేది. స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నూతన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

జగన్ ఇంటి ముందున్న రోడ్డుపై ఆంక్షలు తొలగించింది. దీంతో ఆ రోడ్డు ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేందుకు అందుబాటులోకి వచ్చింది.స్థానిక ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జగన్ నివాసం వద్ద మార్గాల్లో బారికేడ్లు తొలగించింది. రహదారికి రెండు వైపులా పోలీసు చెక్ పోస్టులు ఉంచింది. దీంతో ఆ ప్రాంతాల గుండా ప్రజల రాకపోకలు మొదలయ్యాయి. జగన్ నివాసం వద్ద పోలీస్ సెక్యూరిటీని కూడా ప్రభుత్వం తొలగించడంతో ప్రైవేట్ సెక్కూరిటీతో భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 30మంది కొత్త వారితో జగన్ నివాసం వద్ద సెక్యూరిటీ సిబ్బందిని నియమించారు.తాజా మాజీ మంత్రులకు సెక్యూరిటీని వెనక్కి తీసుకుంటోంది టిడిపి ప్రభుత్వం.

ఈ పరిణామాలన్ని నిశితంగా గమనిస్తున్నారు మాజీ సీఎం జగన్. ఆయన సీఎంగా ఉన్నప్పుడు భారీ భద్రత ఉండేది. ఇంటి నుంచి జగన్ బయలుదేరితే పోలీసులు భారీ ఎత్తున ఉండేవారు. 75 నుంచి 100 మంది పోలీసులు కనిపించేవారు. అయితే అధికారం పోయిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది తగ్గారు. అటు ఓడిపోయిన మంత్రుల సెక్యూరిటీని ప్రభుత్వం ఉపసంహరించుంటోంది. ఇప్పటికే చాలామందికి భద్రత తొలగించింది. ఈ లెక్కన మాజీ సీఎం జగన్కు సైతం భద్రత సిబ్బంది తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ సెక్యూరిటీ కుదిస్తే లేనిపోని సమస్యలు వస్తాయని వైసిపి భావిస్తోంది. అందుకే భారీ ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని జగన్ డిసైడ్ అయినట్లు సమాచారం.

2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పట్లో చంద్రబాబుకు సెక్యూరిటీని కుదించింది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుకు 125 మందికి పైగా పోలీసులు ఉండేవారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రతా సిబ్బంది సంఖ్య 75 కు తగ్గింది. అప్పట్లో దీనిపై టిడిపి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది.గత ఐదేళ్లుగా జరిగిన పరిణామాలతో,కోర్టు ఆదేశాలతో చంద్రబాబు భద్రతను పెంచాల్సి వచ్చింది. పుంగనూరు ఘటన తర్వాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్ చంద్రబాబు భద్రతపై పునసమీక్షించింది. అటు కోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం సైతం భద్రతను పెంచాల్సి వచ్చింది.అయితే చంద్రబాబులా జగన్ పరిస్థితి లేదు.

ఎందుకంటే వైసీపీకి విపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే ఆ పార్టీ పరిమితమైంది. అందుకే ప్రత్యర్థులకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని జగన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ సెక్యూరిటీ పై దృష్టి సారించారు. ఓ ప్రైవేటు ఏజెన్సీ నుంచి దాదాపు 30 మందిని ఆయన నియమించుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం ప్రైవేట్ సెక్యూరిటీ తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చింది. వెంటనే వారు విధుల్లో చేరారు. షిఫ్ట్ కి పదిమంది చొప్పున.. మూడు షిఫ్టుల్లో వీరు విధులు నిర్వహించనున్నారు. తెలంగాణలో వైసీపీకి చెందిన ఓ వ్యక్తి ఏజెన్సీ నుంచి వీరందరినీ నియమించుకున్నట్లు తెలుస్తోంది. జగన్ జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా ఈ సిబ్బంది ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

YS Jagan sensational comments | వైఎస్ జగన్ సంచలన వ్యా ఖ్యలు.. | Eeroju news

Related posts

Leave a Comment