ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం…
విజయవాడ, జూన్ 22, (న్యూస్ పల్స్
Praveen Prakash regrets… : ప్రవీణ్ ప్రకాష్.. జగన్ అస్మదీయ అధికారి. అత్యంత వీర విధేయుడు. జగన్ ముందు వంగి వంగి నమస్కారాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సీనియారిటీ, సిన్సియారిటీ అధికారిగా పేరు తెచ్చుకున్న ఈయన.. గత ఐదేళ్ల వైసిపి పాలనలో మాత్రం ఎన్నెన్నో విమర్శలను మూటగట్టుకున్నారు. ముఖ్యంగా విద్యాశాఖలో అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని ఇబ్బంది పెట్టారన్న అపవాదులు మూటగట్టుకున్నారు. ప్రభుత్వ పెద్దలతో అంటగాకినట్లు ఈయనపై ఆరోపణలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈయనపై వేటు పడింది. సాధారణ పరిపాలన శాఖకు ప్రభుత్వం సరెండర్ చేసింది. అయితే ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు ప్రవీణ్ ప్రకాష్.
పాఠశాల విద్యాశాఖలో తాను ఎవరిని అవమానించలేదని.. ఎవరికైనా అలా అనిపిస్తే వారికి చేతులు జోడించి ప్రార్థిస్తున్నానని పశ్చాత్తాపం ప్రకటించారు ఆయన. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రవీణ్ ప్రకాష్ కు అత్యంత ప్రాధాన్యమిస్తూ వచ్చారు. కీలకమైన పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. అయితే విద్యాసంస్కరణలో భాగంగా విద్యా శాఖలో ఎన్నెన్నో మార్పులు జరిగాయి. అయితే పూటకో జీవో, ఉత్తర్వులతో విద్యాశాఖ అస్తవ్యస్తంగా మారింది. ప్రతి నెల ఒక జిల్లాను సందర్శించి హడలెత్తించారు ప్రవీణ్ ప్రకాష్. అధికారులపై బదిలీ వేటు వేయడం, చర్యలు తీసుకోవడం, ఉపాధ్యాయులను తప్పు పట్టడం, ఆకస్మిక తనిఖీలు.. ఇలా ఒకటేమిటి చాలా విద్యలు ప్రదర్శించారు ప్రవీణ్ ప్రకాష్. కనీసం విద్యాశాఖ అధికారుల వెర్షన్ కూడా వినేవారు కాదు.
అప్పటికప్పుడు కఠిన చర్యలకు ఉపక్రమించేవారు. అయితే ఇదంతా ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యాశాఖలో అధికారులు, ఉపాధ్యాయులు ప్రభుత్వ వ్యతిరేక వర్గాలుగా ముద్రపడ్డారు. వారిపై ప్రవీణ్ ప్రకాష్ ద్వారా ప్రభుత్వం కక్ష సాధించిందన్న ఆరోపణలు ఉన్నాయి.టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత నలుగురు కీలక అధికారులపై వేటు పడింది. అందులో ప్రవీణ్ ప్రకాష్ ఒకరు. గత ఐదేళ్లుగా ప్రవీణ్ ప్రకాష్ తీరుతో ఇబ్బంది పడిన బాధితులు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బయటపడుతున్నారు. తమకు జరిగిన అన్యాయాలను ఏకరువు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రవీణ్ ప్రకాష్ ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు.’ గత ఏడాదిన్నరలో ఎన్నో నేర్చుకున్నాను. విద్యాశాఖ పురోగతి కోసమే కృషి చేశాను.
Read : AP EX CM Jagan’s luxurious life on screen | YS Jagan | జగన్ విలాస జీవితం
నేను తనిఖీలతో ఉపాధ్యాయులు, సిబ్బందిని అవమానించాను అంటూ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో వచ్చాయి. అభ్యసన సామర్ధ్యాలు పెంచేందుకే అలా మాట్లాడాను. ఎవర్ని అవమానించేందుకు అలా చేయలేదు. ఎవరైనా అలా భావిస్తే చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. దయచేసి వాటిని మనసులో ఉంచుకోకండి. మరో మనిషిని అవమానించే గుణం నాకు లేదు’ అని వీడియోలో స్పష్టం చేశారు.అయితే వైసీపీ సర్కార్లో కీలక అధికారులు చేసిన పుణ్యమా అని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారడం వెనుక ప్రవీణ్ ప్రకాష్ చర్యలు ఉన్నాయి. ఆయన తీరుతో విసిగి వేశారి పోయిన వారు ప్రభుత్వ వ్యతిరేకులుగా మారిపోయారు. ఆయన చర్యల పుణ్యమా అని వైసిపి మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం వ్యక్తం చేసినా.. పార్టీ పరంగా వైసిపికి, వ్యక్తిగతంగా ప్రవీణ్ ప్రకాష్ కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.