హైడ్రా చుట్టూ రాజకీయాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 30, (న్యూస్ పల్స్)
Politics around Hydra
తెలంగాణ రాజకీయానికి కేంద్ర బిందువుగా మారిపోయింది హైడ్రా. తెలంగాణాలోని మూడు ప్రధాన పార్టీలిప్పుడు మైలేజీ కోసం హైడ్రా చుట్టూనే పావులు కదుపుతున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ కూడా హైడ్రా కేంద్రంగానే పొలిటికల్ యాక్టివిటీస్ ను పెంచుతున్నాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే రాష్ట్రంలో మిగిలిన పొలిటికల్ యాక్టివిటీస్ అన్నీ హైడ్రాతో పక్కకెళ్లిపోయాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలకు హైడ్రానే ఆయుధంగా మారింది. విపక్షాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్న అధికార పార్టీ హైడ్రాను అస్త్రంగా ప్రయోగిస్తుంటే…. అధికార పక్షాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలు కూడా హైడ్రానే ఆయుధంగా మల్చుకుంటున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు హైడ్రా ఆక్రమణదారుల్లో గుబులు పుట్టిస్తుండగా, కూల్చివేతలతో నష్టపోయిన వారికి అండగా నిలుస్తూ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నాయి బీజేపీ, బీఆర్ఎస్. ఇందులోనూ బీజేపీ తరఫున ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ తరఫున మాజీమంత్రి హరీశ్ దూకుడు పెంచుతూ హైడ్రాను టార్గెట్ చేస్తున్నారు. ఇలా మూడు పార్టీలు హైడ్రానే ఇప్పుడు కేంద్ర బిందువుగా మారడం చర్చనీయాంశంగా మారుతోంది. హైదరాబాద్ నగరంలో ముంపు లేకుండా ఉండాలంటే చెరువులు, నాలాల ఆక్రమణలు తొలగించాలని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకు ప్రాణం పోశారు.
తొలుత కొద్ది మంది పెద్దల ఆక్రమణలను తొలగించి ప్రజల్లో మంచి ఇమేజ్ సంపాదించుకున్న హైడ్రా… కాలక్రమంలో బడుగులు, మధ్య తరగతి వారి ఇండ్లనూ కూల్చివేస్తుండటంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కానీ, భవిష్యత్‌పై భరోసా కోసం హైడ్రా ఉండాల్సిందేనని భావిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా వల్ల రాజకీయంగా నష్టపోతామని మంత్రి వర్గ సహచరులు చెబుతున్నా, సీఎం వినలేదంటున్నారు.చెరువులు, నాలాల ఆక్రమించుకున్నవారు ఎంతటి వారైనా కూల్చాల్సిందే అంటూ సీఎం దూకుడు చూపుతున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకే చెందిన కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు కుటుంబానికి చెందిన భవనాలు సైతం నేలమట్టం చేశారు.
ఇదే ఊపులో మాజీ మంత్రి కేటీఆర్ లీజుకు తీసుకున్న జన్వాడ ఫాంహౌస్ కు కూడా నోటీసులు ఇచ్చేసింది హైడ్రా. ఐతే ప్రతిపక్షాలను లొంగదీసుకోడానికే హైడ్రా అంటూ మొదట్లో విమర్శలు చేసిన బీఆర్ఎస్, బీజేపీ.. ఆ తర్వాత కొంత సైలెంట్ అయిపోయాయి. అయితే ఇప్పుడు హైడ్రా దూకుడు పెంచడం.. సామాన్యులు తిరుగబడుతుండటంతో మళ్లీ ప్రజల తరఫున పోరాట పంథా ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది.ఎవరు అడ్డు చెప్పినా, హైడ్రాకు అపరమిత అధికారాలు కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి… బీఆర్ఎస్, బీజేపీ అస్త్రాలను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఎక్కడ కూల్చివేతలు ఉంటే అక్కడ క్షణాల్లో వాలిపోతున్న ఈటల రాజేందర్ ప్రభుత్వ వ్యతిరేకత పెంచేలా చాప కింద నీరులా వ్యవహరిస్తున్నారంటున్నారు.
కొన్
ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతాన్ని ఖాళీ చేయించాలనే ప్రభుత్వ లక్ష్యానికి సవాల్ విసురుతోంది. మూసీ నది తీరంలో పర్యాటక ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం విదేశాల్లో పర్యటించి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలంటే మూసీని ప్రక్షాళించాలని భావిస్తున్నారు. ఐతే మూసీ తీరంలో ఎక్కువగా పేదలు ఇల్లు నిర్మించుకుని నివసిస్తుండటంతో వారిని ఖాళీ చేయించడం సవాల్‌గా మారిందంటున్నారు. వీరిపైకి హైడ్రా బుల్డోజర్ వెళితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే మూసీ తీరంలో సర్వే జరుగుతుండగా, స్థానికుల తరపున పోరాటానికి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు రంగంలోకి దిగారు.
అసలే హరీశ్ రావుకు క్రౌడ్ పుల్లర్ అనే పేరుంది. ఆయన ఓల్డ్ సిటీలో హైడ్రాకు వ్యతిరేకంగా పోరాడితే పరిస్థితులు ఎటుదారి తీస్తాయోననే భయం వ్యక్తమవుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత ప్రభుత్వంపై పోరాడటానికి బీఆర్ఎస్‌కు సరైన ఆయుధంగా హైడ్రా ఉపయోగ పడే అవకాశం ఉందంటున్నారు. ఇక పాతనగరంలో హైడ్రా బాధితులతో హరీశ్‌రావు చేతులు కలిపితే పార్టీకి మైలేజ్ పెరుగుతుందని అంచనాలో ఉంది గులాబీ దళం.ఇలా మూడు పార్టీల నేతలు హైడ్రా చుట్టూనే రాజకీయం చేస్తున్నారు. పాజిటివ్ టాక్‌తో ప్రజల మనసు గెలవాలని కాంగ్రెస్… బాధితుల బాధలను తెరపైకి తెచ్చి హైడ్రా నిర్దయగా వ్యవహరిస్తోందని నిరూపించేలా ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. మరి ఈ యుద్ధంలో అంతిమ విజేత ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. మొత్తానికి టాక్ ఆఫ్ ద స్టేట్‌గా మారిన హైడ్రా మున్ముందు ఎలా వ్యవహరిస్తుందనేది చూడాల్సివుంది.